MS Dhoni Performance: నా రోల్‌పై నేను సంతోషంగా ఉన్నా.. తన ప్రదర్శనపై ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు-ms dhoni happy to play finisher role in limited opportunities for csk in ipl 2023 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ms Dhoni Performance: నా రోల్‌పై నేను సంతోషంగా ఉన్నా.. తన ప్రదర్శనపై ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు

MS Dhoni Performance: నా రోల్‌పై నేను సంతోషంగా ఉన్నా.. తన ప్రదర్శనపై ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
May 11, 2023 06:28 AM IST

MS Dhoni Performance: తన రోల్‌పై తను సంతోషంగానే ఉన్నట్లు చెన్నై కెప్టెన్ ధోనీ పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారని అన్నాడు. దిల్లీతో బుధవారం నాడు జరిగిన మ్యాచ్‌లో చెన్నై 27 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

 మహేంద్ర  సింగ్ ధోనీ
మహేంద్ర సింగ్ ధోనీ (PTI)

MS Dhoni Performance: దిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం నాడు జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 168 పరుగుల లక్ష్యాన్ని ఛేధించలేని దిల్లీ 140 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా తమ ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లుకుంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించిన చెన్నై జట్టు మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఎంఎస్ ధోనీ 9 బంతుల్లో 20 పరుగులు చేసి అదరగొట్టాడు. సిక్సర్లపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన ధోనీ.. ఈ సీజన్‌లో మొత్తం ఇప్పిటవరకు 47 బంతులు ఎదుర్కొని 10 సిక్సర్లు బాదాడు. అంతేకాకుండా 200కి పైగా స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు.

41 ఏళ్ల ధోనీ యువకుడిలా మారి సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. గత సీజన్ మొత్తంలోనూ 10 సిక్సర్లు బాదిన మహీ.. 2021లో 7 సిక్సర్లు, 20201లో కేవలం 3 సిక్సర్లే బాదాడు. దీన్ని బట్టి చూస్తుంటే వయసు పెరిగే కొద్ది సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు మన మిస్టర్ కూల్. మహీ ఫర్మార్మెన్స్‌కు ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. అతడి ప్రదర్శన చూస్తుంటే వింటేజ్ ధోనీని గుర్తు చేస్తున్నాడని కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయంపై మన మహీ కూడా స్పందనను తెలియజేశాడు. తక్కువ అవకాశాలు వస్తున్నప్పటికీ చెన్నై తరఫున ఫినిషింగ్ రోల్ పోషించడం ఆనందంగా ఉందని అన్నాడు.

"నేను చేయాల్సిన పనే ఇది. నేను ఏం చేయాలనుకుంటున్నానో అదే చేయనివ్వండి అని వారికి చెప్పాను. ఎక్కువగా పరుగెత్తే అవకాశమివ్వద్దని చెప్పా. అది వర్క్ అవుతుంది కూడా. నాకు కావాల్సింది కూడా ఇదే. ఈ విధంగా ప్రదర్శన చేయడంపై సంతోషంగా ఉన్నాను" అని ఎంఎస్ ధోనీ తెలిపాడు.

చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఓపెనర్ రుతురాజ్‌పై ధోనీ ప్రశంసల వర్షం కురిపించాడు.

"రుతురాజ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒక్కసారి పరుగులు తీయడం ప్రారంభిస్తే ఇంక వెనక్కి తిరిగి చూసుకోడు. కష్టపడకుండా పని పూర్తి చేస్తాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆకట్టుకుంటాడు. డేవాన్ కాన్వేతో కలిసి మెరుగైన భాగస్వామ్యాలు నమోదు చేస్తున్నాడు. పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగినట్లుగా తన గేమ్‌ను మార్చుకుంటాడు. అలాంటి ఆటగాళ్లు జట్టులో ఉండాలి" అంటూ ధోనీ తెలిపాడు.

దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. 168 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని దిల్లీ ఛేదించలేక 140 పరుగులకే పరిమితమైంది. దిల్లీ బ్యాటర్లలో రిలే రొసౌ(35), మనీష్ పాండే(27) మినహా మిగిలిన వారంతా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. వారు కూడా ఎక్కువ బంతులు వినియోగించడంతో చివరకు వచ్చేసరికి రన్ రేట్ పెరిగిపోయింది. వేగంగా ఆడే క్రమంలో దిల్లీ బ్యాటర్లు క్రమంగా వికెట్లు కొల్పోయి పరాజయాన్ని మూటగట్టుకున్నారు. చెన్నై బౌలర్లలో మహీష పతిరాణా 3 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ 2 వికెట్లతో రాణించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 14 ఆదివారం నాడు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది.

Whats_app_banner