MS Dhoni Injury: ధోనీకి మోకాలి గాయం.. అదే అతడి పరుగును అడ్డుకుంది.. చెన్నై కోచ్ ఫ్లెమింగ్ స్పష్టం
MS Dhoni Injury: మహేంద్ర సింగ్ ధోనీ మోకాలి గాయమైనట్లు చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పారు. ఆ బాధ కారణంగా వికెట్ల మధ్య పరుగును వేగంగా తీయలేకపోయాడని స్పష్టం చేశారు.
MS Dhoni Injury: రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం నాడు జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 17 బంతుల్లో 32 పరుగులతో ఆకట్టుకున్నాడు. చివరి ఓవర్లో 2 సిక్సర్లతో చెలరేగినప్పటికీ తన జట్టుకు మాత్రం విజయాన్ని అందించలేకపోయాడు. ఈ మ్యాచ్ రాజస్థాన్.. చెన్నైపై 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే వికెట్ల మధ్యలో చిరుత పులి మాదిరిగా పరుగులు తీసే ధోనీ.. నిన్నటి మ్యాచ్‌లో మాత్రం అంత దూకుడును చూపించలేకపోయాడు. అతడు గాయపడ్డాడేమోనని అప్పటికి పలువురు అభిప్రాయపడ్డారు. తాజాగా ఈ విషయంపై చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించారు. మహీ మోకాలికి గాయమైనట్లు పేర్కొన్నారు.
"అతడి(ధోనీ) మోకాలికి గాయమైంది. అందుకే వికెట్ల మధ్యలో పరుగు తీసేందుకు అతడు ఇబ్బంది పడ్డాడు. ఈ గాయమే అతడి పరుగును అడ్డుకుంది. అంత బాధలోనూ రాజస్థాన్ రాయల్స్‌పై అద్భుతంగా ఆడాడు. అతడి ఫిట్‌నెస్‌తో ఎల్లప్పుడు ప్రొఫెషనల్‌గా ఉంటాడు." అని ఫ్లెమింగ్ తెలిపాడు.
ధోనీ ఫిట్‌నెస్‌పై ఫ్లెమింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. "టోర్నమెంట్ ప్రారంభమయ్యే ఓ నెల రోజుల ముందు మాత్రమే ధోనీ వచ్చాడు. కాబట్టి అతడు ముందుగానే ప్రీపేర్ అవ్వడానికి పెద్దగా అవకాశం రాలేదు. అతడు చాలా ఫిట్‌గా ఉంటాడు. ఫిట్‌నెస్ కోసం టోర్నీకి ముందు కొంతకాలం రాంచీలో నెట్ ప్రాక్టీస్ చేశాడు. తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. అతడు చాలా బాగా ఆడుతుండటం ఇప్పటికే మీరు చూసుంటారు. కాబట్టి తనను తాను మెయింటేన్ చేసుకునే విధానంపై మాకు ఎలాంటి సందేహం లేదు. ఎల్లప్పుడూ తనను తాను వేగవంతం చేసుకుంటాడు." అని ఫ్లెమింగ్ అన్నాడు.
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయానికి ఆఖరు ఓవర్లో 21 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో ధోనీ, జడేజా ఉన్నారు. సందీప్ శర్మ వేసిన చివరి ఓవర్ తొలి మూడు బంతుల్లోనే రెండు సిక్సర్లు బాదిన మహీ.. చెన్నై శిభిరంలో విజయంపై ఆశలు రేపాడు. అనంతరం సందీప్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సీఎస్‌కే 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చెన్నై జట్టు తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 17 సోమవారం నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది.