ఆర్సీబీ చాలామంది ఫేవరెట్. ఒక్కసారి కప్పు కొట్టకపోయినా.. బెంగళూరుకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈసారి అయినా కప్ కొడతారేమోననే ఆశతో ఉన్నారు. ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టు ఎప్పటిలాగే కష్టాల్లో పడింది. శనివారం దిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన ఆర్‌సీబీకి ముందున్న మార్గం అగమ్యగోచరంగా మారింది.
ప్రస్తుతం, ఆర్సీబీ జట్టు(RCB Team) ఆడిన పది మ్యాచ్‌లలో ఐదు గెలిచి, ఐదు ఓడిపోయింది. మొత్తం 10 పాయింట్లు సంపాదించి -0.209 రన్ రేట్‌తో ఐదో స్థానంలో ఉంది. విశేషమేమిటంటే ఆర్సీబీతో పాటు మరో మూడు జట్లు కూడా 10 పాయింట్లతో పోటీ పడుతున్నాయి.
ఇప్పుడు RCB ప్లే ఆఫ్స్(RCB Palyoff)కు అర్హత సాధించాలంటే, రాబోయే అన్ని మ్యాచ్‌లు ముఖ్యమైనవి. కచ్చితంగా గెలవాలి. కేవలం గెలిస్తే సరిపోదు, కనీసం రెండు మ్యాచ్‌లలో భారీ పరుగులతో గెలిచి ప్లస్ రన్ రేట్‌కి తిరిగి రావాలి. RCB తన తదుపరి మ్యాచ్‌ని రోహిత్ శర్మ(Rohit Sharma) నేతృత్వంలోని ముంబయి ఇండియన్స్‌తో ఆడనుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మే 09న ఈ మ్యాచ్ జరగనుంది.
ఆ తర్వాత మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 14న రాజస్థాన్ రాయల్స్, 18న సన్‌రైజర్స్ హైదరాబాద్, చివరకు మే 21న గుజరాత్ టైటాన్స్‌తో RCB పోటీ పడనుంది.
ఆర్సీబీతో పాటు రాజస్థాన్, ముంబై, పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు సాధించాయి. దీంతో బెంగళూరుకు గట్టి పోటీ ఉంది. రన్ రేట్ ఆధారంగా, RR 4వ స్థానంలో, RCB 5వ స్థానంలో, ముంబయి, పంజాబ్ వరుసగా ఆరు, ఏడో స్థానాల్లో ఉన్నాయి.
శనివారం దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కోహ్లి 55 పరుగులు, లామ్రోర్ 54 పరుగులు చేశాడు. దిల్లీ టీమ్.. ఈజీగా గెలిచేసింది. 16.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి విజయం సాధించింది దిల్లీ క్యాపిటల్స్. పిలిప్ సాల్ట్ 87 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.