IPL 2023 Prize money details: ఐపీఎల్ విన్నింగ్ టీమ్‌కు ప్రైజ్ మనీ ఎంత? ఆరెంజ్-పర్పుల్ క్యాప్ విజేతలకు ఎంత వస్తుంది?
IPL 2023 Prize money details: ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టుకు ఎంత ప్రైజ్ మనీ ఉంటుందనే ఆసక్తిగా మారింది. ఈ సీజన్‌లో మొత్తం ప్రైజ్ మనీ విలువ వచ్చేసి రూ.46.65 కోట్లుగా నిర్దేశించారు. అంతేకాకుండా ఆరెంజ్-పర్పుల్ క్యాప్ హోల్డర్లుకు లక్షల్లో ప్రైజ్ మనీ లభిస్తుంది.
IPL 2023 Prize money details: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా క్రేజ్ ఉంది. ఎంతలా అంటే చాలా మంది విదేశీ ఆటగాళ్లు తమ జాతీయ జట్టు కంటే కూడా ఐపీఎల్‌లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి ఐపీఎల్ 2023 సీజన్ ముంగిపునకు ఒక్క అడుగు దూరంలో ఉంది. ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం నాడు చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. ఇదిలా ఉంటే 2008లో ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు టోర్నీకి పాపులారిటీ పెరుగుతూనే వచ్చింది. వ్యూయర్షిప్ భారీగా పెరిగింది. ఫలితంగా ఐపీఎల్ విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్ మనీలోనూ మార్పులు వచ్చాయి.
మొదటి రెండు సీజన్లలో ఐపీఎల్ విన్నింగ్ టీమ్‌కు రూ.4.8 కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చేవారు. రన్నర్‌గా నిలిచిన జట్టు రూ.2.4 కోట్లు ఉండేది. ఆ తర్వాత ప్రైజ్ మనీ భారీగా పెరిగింది. గత సీజన్ విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు రూ.20 కోట్ల నగదు బహుమతి వచ్చింది. రన్నరప్ అయిన రాజస్థాన్ రాయల్స్ రూ.13 కోట్లు అందుకుంది.
స్పోర్ట్ స్టార్ నివేదిక ప్రకారం ఈ ఏడాది జట్లకు కేటాయించిన మొత్తం ప్రైజ్ మనీ రూ.46.5 కోట్లు. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విన్నర్లకు చెరో రూ.15 లక్షలు అందజేస్తారు. ఈ టోర్నీ ఎమర్జింగ్ ప్లేయర్‌గా నిలిచిన ఆటగాడికి రూ.20 లక్షలు ఇస్తారు. ఇదికాకుండా అదనంగా ఈ సీజన్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌గా నిలిచిన వారికి రూ.12 లక్షల ప్రైజ్ మనీ లభిస్తుంది.
శుక్రవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. శుబ్‌మన్ గిల్ 60 బంతుల్లో 129 పరుగులతో సెంచరీతో విజృంభించాడు. ఫలితంగా గుజరాత్ 3 వికెట్లు కోల్పోయి 233 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబయి ఇండియన్స్ 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో గుజరాత్ వరుసగా రెండో సారి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.
ఆదివారం నాడు చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందుకు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే గెలిస్తే ఆ జట్టు ఖాతాలో ఐదో ఐపీఎల్ టైటిల్ చేరుతుంది. ఒకవేళ గుజరాత్ గెలిస్తే.. వరుసగా రెండో సారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలుస్తుంది.