Harbhajan Comments on SRH: సన్‌రైజర్స్ కష్టమే.. నేనైతే అనుకోవట్లేదు.. హర్భజన్ బోల్డ్ కామెంట్స్
Harbhajan Comments on SRH: టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. హైదరాబాద్ బ్యాటర్లు తేలిపోయారని, ఈ సీజన్‌లో ఆ జట్టు పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ చేస్తుందని తాను అనుకోవట్లేదని స్పష్టం చేశాడు.
Harbhajan Comments on SRH: ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిన సంగతి తెలిసిందే. ఫలితంగా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. దీంతో ఐపీఎల్‌లో గెలుపు కోసం సన్‌రైజర్స్ జట్టు ఆత్రుతగా ఎదురుచూస్తోంది. లక్నోపై ఓటమి తర్వాత ఆరెంజ్ ఆర్మీపై అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా మార్క్‌క్రమ్ జట్టులోకి వచ్చిన తర్వాత కూడా ఓడిపోవడంతో నిరాశ చెందుతున్నారు. తాజాగా సన్‌రైజర్స్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని తాను అనుకోవట్లేదని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
"సన్‌రైజర్స్ బ్యాటర్లు ఈ సీజన్‌లో 170 నుంచి 190 పరుగులు చేస్తారని నేను అనుకోవడం లేదు. మార్క్‌క్రమ్ ఆడకపోతే వారి పని ఇంకా కష్టతరమవుతుంది. రాహుల్ త్రిపాఠి నైపుణ్యం కలిగిన బ్యాటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ సీజన్‌లో అనుకున్న స్థాయిలో రాణించలేడని అనిపిస్తుంది. తదుపరి మ్యాచ్‌ల్లో ఏమైనా ఆడతాడో చూడాలి." అని హర్భజన్ స్పష్టం చేశాడు.
ఇదే సమయంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిపించాడు భజ్జీ. "రాహుల్ కెప్టెన్సీ బాగుంది. ఛేజింగ్‌లో పెద్ద షాట్లు ఆడాల్సిన అవసరం వారికి లేకపోయింది. అతడు 35 పరుగులతో రాణించగా.. కృనాల్ పాండ్య 34 పరుగులతో ఆకట్టుకున్నాడు. లక్నో సులభంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్ చాలా బోరింగ్‌గా, ఎలాంటి మజా లేకుండా సాగింది. ఎందుకంటే పెద్దగా పరుగులేమి లభించలేదు. వికెట్ కూడా చాలా నిదానంగా ఉంది. బ్యాటింగ్ అప్పుడే సన్‌రైజర్స్ సరెండర్ అయిపోయింది." అని హర్భజన్ అన్నాడు.
హైదరాబాద్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 122 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు ఓవర్లు మిగిలుండగానే కేవలం 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్నో బ్యాటర్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్(35), కృనాల్ పాండ్య(34) ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. అయితే అంతకంటే ముందు తమ బౌలింగ్ దాడితో హైదరాబాద్‌ను స్వల్ప లక్ష్యానికే పరిమితం చేసి సక్సెస్ అయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో అదిల్ రషీద్ 2 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, ఫజాల్ హఖ్ ఫరూఖి, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.