IPL 2023 Points Table: ఓడినా గుజరాత్ అగ్ర పీఠం పదిలం.. దిల్లీ విజయంతో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ మార్పులివే-gujarat continued to remain top spot in points table despite lose against delhi ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Points Table: ఓడినా గుజరాత్ అగ్ర పీఠం పదిలం.. దిల్లీ విజయంతో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ మార్పులివే

IPL 2023 Points Table: ఓడినా గుజరాత్ అగ్ర పీఠం పదిలం.. దిల్లీ విజయంతో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ మార్పులివే

Maragani Govardhan HT Telugu
May 03, 2023 07:46 AM IST

IPL 2023 Points Table: దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఓడినప్పటికీ తన అగ్రపీఠాన్ని అలాగే పదిలం చేసుకుంది. దిల్లీ క్యాపిటల్స్ మాత్రం అలాగే అన్నింటికంటే దిగువన కొనసాగుతోంది.

గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య
గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య (AFP)

IPL 2023 Points Table: దిల్లీ క్యాపిటల్స్ తప్పనిసరిగా విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించింది. గుజరాత్‌కు నిర్దేశించిన 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని అద్భుత ప్రదర్శనతో కాపాడుకుంది. ఫలితంగా హార్దిక్ సేనను 125/6లకే పరిమితం చేసింది. ఫలితంగా 5 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో దిల్లీ మూడో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓడినప్పటికీ పాయింట్ల పట్టికలో తన స్థానంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అలాగే అగ్రస్థానంలో కొనసాగుతోంది.

దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఓడిన గుజరాత్ తన అగ్ర పీఠాన్ని మాత్రం పదిలంగానే ఉంచుకుంది. 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో టాప్-1గా నిలిచింది. 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో వరుసగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఉన్నాయి. మరోపక్క దిల్లీ క్యాపిటల్స్ 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు సాధించి అన్నింటికంటే దిగువన 10వ స్థానంలో ఉంది. ఇందులో గెలిచినప్పటికీ మెరుగైన రన్ రేట్ లేని కారణంగా కింది స్థానంలో ఉంది.

ఆరెంజ్ క్యాప్..

ఈ టోర్నీలో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు సాధించిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆరెంజ్ క్యాప్‌తో కొనసాగుతున్నాడు. 9 మ్యాచ్‌ల్లో అతడు 466 పరుగులు చేశాడు. అతడి తర్వాత రాజస్థాన్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ 428 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. 424 పరుగులతో చెన్నై ప్లేయర్ డేవాన్ కాన్వే మూడో ప్లేస్‌లో ఉన్నాడు. 364 పరుగులతో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో నిలిచాడు.

పర్పుల్ క్యాప్..

గుజరాత్ టైటాన్స్ పేసర్ అత్యధిక వికెట్లతో మహ్మద్ షమీ(Mohammed Shami) పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అతడు 9 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి తర్వాత తుషార్ దేశ్ పాండే కూడా 17 వికెట్లతోనే రెండో స్థానంలో నిలిచాడు. 15 వికెట్లతో వరుసగా మహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ తదుపరి స్థానాల్లో ఉన్నారు.

మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్‌పై దిల్లీ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. 131 పరుగుల లక్ష్యాన్ని చివరి వరకు పోరాడి కాపాడుకుంది. గుజరాత్ బ్యాటర్లలో హార్దిక్ పాండ్య(56) అర్ధశతకంతో ఆకట్టుకున్నప్పటికీ తన జట్టుకు మాత్రం విజయాన్ని అందించలేకపోయాడు. అతడు మినహా మిగిలిన వారు విఫలం కావడంతో మ్యాచ్ వార్నర్ సేన గెలిచింది. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ చెరో 2 వికెట్లు తీయగా.. అన్రిచ్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

Whats_app_banner