Gavaskar on Kohli vs Gambhir: ఇలాంటి ప్లేయర్స్‌ను సస్పెండ్ చేయాలి.. కోహ్లి, గంభీర్ గొడవపై గవాస్కర్ తీవ్ర వ్యాఖ్యలు
Gavaskar on Kohli vs Gambhir: ఇలాంటి ప్లేయర్స్‌ను సస్పెండ్ చేయాలి అంటూ కోహ్లి, గంభీర్ గొడవపై గవాస్కర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మరోసారి ఇలాంటివి జరగకూడదంటే అదే సరైనదని అతడు అనడం గమనార్హం.
Gavaskar on Kohli vs Gambhir: ఐపీఎల్లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్, నవీనుల్ హక్ గొడవ హాట్ టాపిక్ గా మారింది. చాలా రోజుల తర్వాత మొత్తం ఐపీఎల్ ను ఊపేస్తోందీ గొడవ. దీనిపై ఎవరి వాదన ఎలా ఉన్నా.. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం తీవ్రంగా స్పందించాడు. ఇలాంటివి మళ్లీ జరగకూడదంటే అలాంటి ప్లేయర్స్ ను సస్పెండ్ చేయాలని సన్నీ అనడం గమనార్హం.
ఈ మధ్య కాలంలో ప్రతిదీ టీవీల్లో కనిపిస్తుండటంతో ప్లేయర్స్ ఇంకాస్త ఎక్స్‌ట్రాలు చేస్తున్నారని కూడా గవాస్కర్ అన్నాడు. ఈ గొడవకు కారణమైన విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మ్యాచ్ ఫీజులలో 100 శాతం జరిమానా విధించింది బీసీసీఐ. అయితే భవిష్యత్తులో ఇలాంటి గొడవలు జరగకూడదంటే ఈ జరిమానాలు ఏమాత్రం సరిపోవని కూడా సన్నీ స్పష్టం చేశాడు.
"నేను ఇంతకుముందే ఆ వీడియోలు చూశాను. నిన్న మ్యాచ్ చూడలేకపోయాను. ఇలాంటి ఎప్పుడూ మంచిది కాదు. 100 శాతం మ్యాచ్ ఫీజు అంటే ఏంటి? అసలు 100 శాతం మ్యాచ్ ఫీజుకు అర్థమేంటి? అది కోహ్లి అయితే ఆర్సీబీ అతనికి రూ.17 కోట్లు చెల్లిస్తోంది. మొత్తంగా 16 మ్యాచ్ లు అనుకున్నా.. ఒక మ్యాచ్ కు వంద శాతం అంటే రూ.కోటి. అతనికి ఇప్పుడు రూ. కోటి, అంతకంటే ఎక్కువ జరిమానా విధిస్తారా? నిజంగా ఇది చాలా పెద్ద జరిమానానే" అని స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ గవాస్కర్ అన్నాడు.
"గంభీర్ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. కానీ ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలి. జరిమానా భారీగా ఉంది కాబట్టి ఇలాంటివి మళ్లీ జరగవని వాళ్లు అనుకుంటున్నారు. ఆటను ఎప్పుడైనా పోటీతత్వంతో ఆడండి. మా కాలంలో సరదాగా కౌంటర్లు వేసేవాళ్లం. కానీ ఇలాంటి దూకుడు మాత్రం ఉండేది కాదు. ఈ కాలంలో ప్రతిదీ టీవీలో చూపిస్తున్నారు కాబట్టి.. ప్లేయర్స్ కాస్త ఎక్స్‌ట్రాలు చేస్తున్నారు" అని సన్నీ అన్నాడు.
"ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే.. మళ్లీ ఇలాంటివి జరగకుండా ఏం చేయాలో అది చేయండి. 15 ఏళ్ల కిందట హర్భజన్, శ్రీశాంత్ ఘటన జరిగినప్పుడు ఏం చేశారో అదే చేయండి. ఇలాంటి ప్లేయర్స్ ను రెండు మ్యాచ్ లకు సస్పెండ్ చేయండి. దీనివల్ల ఆయా జట్లకు దెబ్బ పడుతుంది. ఇలాంటి కఠిన చర్యల వల్లే ఇలాంటి గొడవలకు చెక్ పెట్టగలం" అని గవాస్కర్ స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం