Ambati Rayudu Retirement: ఐపీఎల్‌కు అంబటి రాయుడు గుడ్ బై.. ఈ సారి యూ టర్న్ ఉండదట
Ambati Rayudu Retirement: చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలికాడు. తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. ఈ సారి నిజంగానే గుడ్ బై చెప్పానని, ఇకపై యూ టర్న్ ఉండదని స్పష్టం చేశాడు.
Ambati Rayudu Retirement: చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపిఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆదివారం నాడు గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచే తనకు చివరిదని స్పష్టం చేశాడు. 2018 ఎడిషన్ నుంచి చెన్నై తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న రాయుడు ఆ జట్టు రెండు సార్లు ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2010లో మొదటి సారిగా ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన అంబటి రాయుడు ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశాడు. ఈ విషయాన్ని తన ట్విటర్ వేదికగా రాయుడు ప్రకటించాడు.
"ముంబయి, చెన్నై రెండు గొప్ప జట్ల తరఫున ఆడాను. 204 మ్యాచ్‌లు 14 సీజన్లు, 11 ప్లేఆఫ్స్, 8 ఫైనల్స్, 5 ట్రోఫీలు. ఈ రోజు ఆరోది అవతుందని భావిస్తున్నాను. ఈ జర్నీ అద్బుతంగా సాగింది. ఈ రోజు ఫైనల్‌తో నా ఐపీఎల్ కెరీర్ ముగించాలను కుంటున్నాను. ఇదే నా చివరి ఐపీఎల్ మ్యాచ్. ఈ గ్రేట్ టోర్నమెంట్‌లో ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదించాను. అందరికీ ధన్యవాదాలు. ఇంక యూ టర్న్ అనేది ఉండదు." అని అంబటి రాయుడు తన ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు.
అంబటి రాయుడు మొదటి సారిగా 2013లో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాడు. అప్పుడు ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అది ఆ జట్టుకు కూడా మొదటిదే కావడం విశేషం. ఈ సీజన్‌లో రాయుడు అన్ని మ్యాచ్‌లు ఆడాడు. అనంతరం 2015, 2017 సీజన్లలోనూ ముంబయికే ఆడాడు. ఆ తర్వాత సంవత్సరమే చెన్నై సూపర్ కింగ్స్‌కు మారాడు.
ఎంఎస్ ధోనీ సారథ్యంలో రాయుడు పవర్ హిట్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సీఎస్‌కే తరఫున అత్యుత్తమ స్ట్రైక్ రేటుతో ఆడాడు. 149.75 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసాడు. 2018లో చెన్నైకు మారిన అతడు ఆ సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 602 పరుగులు చేశాడు. ఆ ఎడిషన్ అతడికి అత్యుత్తమంగా నిలిచింది. అలాగే చెన్నై 2021లో ఐపీఎల్ ట్రోఫీ సాధించినప్పుడు కూడా ఆ జట్టుకే ఆడాడు రాయుడు. ఆ సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 151.17 స్ట్రైక్ రేటుతో ఆడాడు.
అయితే గత సీజన్ చెన్నై జట్టుకే కాకుండా అంబటి రాయుడుకు గుర్తుండిపోయే సీజన్. ఎందుకంటే పాయింట్ల పట్టికలో చెన్నై 9వ స్థానంలో నిలవగా.. రాయుడు కూడా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. అంతేకాకుండా సీజన్ మధ్యలోనే అతడు తన రిటైర్మెంట్ కూడా ప్రకటించి మళ్లీ యూ టర్న్ తీసుకున్నాడు. ఇక 2023 సీజన్‌లోనూ రాయుడు పెద్దగా రాణించలేదు. 15 మ్యాచ్‌ల్లో అతడు 139 పరుగులు మాత్రమే చేశాడు. పదే పదే విఫలమవుతున్నా.. ధోనీ మాత్రం అతడిపై నమ్మకముంచాడు. అంబటి రాయుడు తన ఐపీఎల్ కెరీర్‌లో 204 మ్యాచ్‌ల్లో 4239 పరుగులు చేశాడు. ఫలితంగా ఐపీఎల్‌లో అత్యధికంగా పరుగులు చేసిన బ్యాటర్లలో 12వ స్థానంలో నిలిచాడు.