CM Jagan - Ambati Rayudu: సీఎం క్యాంప్ ఆఫీస్ లో అంబటి రాయుడు.. 'పొలిటికల్' ఇన్నింగ్స్ ఖాయమేనా..?-cricketer ambati rayudu met ap cm ys jagan at camp office ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cricketer Ambati Rayudu Met Ap Cm Ys Jagan At Camp Office

CM Jagan - Ambati Rayudu: సీఎం క్యాంప్ ఆఫీస్ లో అంబటి రాయుడు.. 'పొలిటికల్' ఇన్నింగ్స్ ఖాయమేనా..?

HT Telugu Desk HT Telugu
May 11, 2023 04:12 PM IST

Ambati Rayudu Met CM jagan:తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీంఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు... సీఎం జగన్ ను కలిశారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధితో పాటు పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ భేటీ కాస్త పొలిటికల్ కారిడార్ లో ఆసక్తిని రేపుతోంది.

సీఎం జగన్ తో రాయుడు భేటీ
సీఎం జగన్ తో రాయుడు భేటీ

Cricketer Ambati Rayudu Latest News:అంబటి రాయుడు... టీంఇండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడిగా అందరికి తెలుసే...! అయితే కొన్ని రోజులుగా ఏపీ పాలిటిక్స్ లో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఉంటుందన్న చర్చ నడుస్తోంది. అంతేకాదు... ఏకంగా భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరుతారని... ఆ దిశగా చర్చలు కూడా నడుస్తున్నట్లు వార్తలు వినిపించాయి. మొత్తంగా త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఉంటుందన్న క్రమంలో... ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

గురువారం మధ్యాహ్నం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అంబటి రాయుడు కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో క్రీడా రంగం అభివృద్ధి, క్రీడారంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై చర్చించారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ టీమ్‌లో ఆడుతున్న అంబటి రాయుడుకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపినట్లు క్యాంప్ కార్యాలయం అధికారులు తెలిపారు. రాయుడు సూచనలను పరిగణనలోకి తీసుకొని... ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ చెప్పినట్లు తెలుస్తోంది.

గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు కొంత కాలంగా రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడిపై జనసేన కూడా కన్నేసింది. ఇదే సమయంలో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కూడా పార్టీలో చేరిక విషయంపై ప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే కొద్దిరోజుల కింద అంబటి రాయుడు... సీఎం జగన్ పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశాడు. కొద్దిరోజుల కింద సీఎం జగన్ చేసిన ప్రసంగాన్ని వైసీపీ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా… అంబటి రాయుడు దాన్ని రీట్వీట్ చేశాడు. అంతేకాదు… ‘మన ముఖ్యమంత్రి జగన్ గారి గొప్ప ప్రసంగం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మీ మీద నమ్మకం, విశ్వాసం ఉన్నాయి సార్’ అంటూ రాసుకొచ్చాడు. ఈ క్రమంలో ఆయన ఫ్యాన్ పార్టీకి జై కొడుతారేమో అన్న ప్రచారం జోరందకుంది. తాజాగా క్యాంప్ కార్యాలయానికి వచ్చి ముఖ్యమంత్రి జగన్ తో స్వయంగా భేటీ కావటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఫలితంగా ఆయన నిజంగానే వైసీపీలో చేరుతారా...? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా..? అనేది టాక్ ఆఫ్ ది ఆంధ్రాగా మారింది

IPL_Entry_Point