Ysrcp News : వైసీపీలోకి సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్-sattenapalli ex mla yarram venkateswara reddy join ysrcp in presence cm jagan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp News : వైసీపీలోకి సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్

Ysrcp News : వైసీపీలోకి సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్

Bandaru Satyaprasad HT Telugu
May 10, 2023 07:16 PM IST

Ysrcp News : సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయన కుమారుడు నితిన్ రెడ్డి, సత్తెనపల్లి బీజేపీ నేత పక్కాల సూరిబాబు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు.

వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి
వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి (twitter )

Ysrcp News : పల్నాడు జిల్లా సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వర రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో యర్రం వెంకటేశ్వర రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. వెంకటేశ్వర రెడ్డితో పాటు ఆయన కుమారుడు నితిన్‌ రెడ్డి, సత్తెనపల్లి బీజేపీ కన్వీనర్‌ పక్కాల సూరిబాబు వైసీపీలో జాయిన్ అయ్యారు. సత్తెనపల్లి నుంచి 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు యర్రం వెంకటేశ్వర రెడ్డి. గత ఎన్నికల్లో ఆయన అంబటి రాంబాబుపై పోటీ కూడా చేశారు. ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ పార్టీలో చేరారు. ఈ చేరికలలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఏపీఎండీసీ డైరెక్టర్‌ గాదె సుజాత కీలకంగా వ్యవహరించారు.

జనసేన నుంచి వైసీపీలోకి

గత ఎన్నికల్లో యర్రం వెంకటేశ్వర రెడ్డి జనసేన నుంచి సత్తెనపల్లిలో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆయన జనసేనలో అంత యాక్టివ్ గా లేరు. కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న ఆయన... ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. యర్రం వెంకటేశ్వరరెడ్డి ఎలాంటి మచ్చలేని వ్యక్తి అని మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కితాబు ఇచ్చారు. ఆయన వైసీపీలో చేరడంతో సత్తెనపల్లిలో పార్టీకి మరింత బలం చేకూరుతుందని ధీమా వ్యక్తం చేశారు. యర్రం వెంకటేశ్వరరెడ్డి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని అంబటి రాంబాబు అన్నారు. జనసేన, బీజేపీ నుంచి కీలక నేతలు వైసీపీలో చేరటం సంతోషం అన్నారు. సత్తెనపల్లిలో నన్ను ఓడించాలని నాదెండ్ల మనోహర్ కుట్ర చేసి యర్రం వెంకటేశ్వరరెడ్డిని జనసేన టికెట్ ఇచ్చారన్నారు. ఆ తర్వాత ఆయనను పట్టించుకోలేదని విమర్శించారు. రాజకీయాల్లో జనసేన కుట్రలు ఎలా ఉంటాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

కీలకంగా వ్యవహరించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

యర్రం వెంకటేశ్వర రెడ్డి సేవలను ఉపయోగించుకుంటామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. రాజకీయాల్లో అవినీతి మరకలేని వ్యక్తి యర్రం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఎంపీ లావు కృష్ణదేవరాయులు ఇటీవలి వైసీపీకి దూరంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయనకు సరైన ప్రోటోకాల్ ఇవ్వడం లేదన్న అసంతృప్తితో పార్టీకి దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే యర్రం వెంకటేశ్వరరెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయంలో లావు శ్రీకృష్ణదేవరాయలు కీలకంగా వ్యవహరించారు.

వైసీపీలో చేరడంపై యర్రం వెంకటేశ్వరరెడ్డి స్పందిస్తూ... కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా గెలిచానని, 2009లో జనసేనలో చేరమంటే చేరానన్నారు. ఇటీవల జనసేన మీటింగ్ పెట్టినా తనను ఆహ్వానించలేదన్నారు. వైసీపీలో చేరటం వల్ల తన అనుచరులు సంతోషంగా ఉన్నారన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని వెల్లడించారు. మరో నేత సూరిబాబు మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా అంబటి రాంబాబు తెలుసని. ఆయన ఆహ్వానం మేరకు వైసీపీలోకి చేరానన్నారు. పేదల సంక్షేమం కోసం వైసీపీ పనిచేస్తుందన్నారు.

IPL_Entry_Point