Ambati Rayudu | అది టీ కప్పులో తుఫాను.. రాయుడు ట్వీట్‌పై సీఎస్కే కోచ్‌ ఫ్లెమింగ్-its a storm in a teacup says csk coach fleming on ambati rayudu tweet ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ambati Rayudu | అది టీ కప్పులో తుఫాను.. రాయుడు ట్వీట్‌పై సీఎస్కే కోచ్‌ ఫ్లెమింగ్

Ambati Rayudu | అది టీ కప్పులో తుఫాను.. రాయుడు ట్వీట్‌పై సీఎస్కే కోచ్‌ ఫ్లెమింగ్

HT Telugu Desk HT Telugu
May 16, 2022 02:58 PM IST

డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కి ఈ సీజన్‌లో ఏదీ కలిసి రావడం లేదు. వరుస ఓటములతో కనీసం ప్లేఆఫ్స్‌ చేరలేకపోయింది. దీనికితోడు కెప్టెన్సీలో మార్పులు.. మొదట రవీంద్ర జడేజా గొడవ, ఇప్పుడు అంబటి రాయుడు ట్వీట్‌ ఆ టీమ్‌లో ఏదో జరుగుతోందన్న అనుమానాలకు తావిస్తోంది.

అంబటి రాయుడు
అంబటి రాయుడు (PTI)

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాప్‌ టీమ్స్‌లో ఒకటి. నాలుగుసార్లు ఛాంపియన్. ఏడేళ్ల కిందట స్పాట్‌ ఫిక్సింగ్‌ వివాదంతో ఆ టీమ్‌పై రెండేళ్ల నిషేధం తర్వాత కూడా తిరిగి వచ్చి రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. కానీ ఈసారి మాత్రం ఆ టీమ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వరుస ఓటములతో ఆ టీమ్‌ ఇప్పటికే ప్లేఆఫ్స్‌ చేరకుండానే ఇంటిదారి పట్టింది.

సీజన్‌ మొదట్లో కెప్టెన్‌గా ఉన్న జడేజా తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, తర్వాత గాయం కారణంగా టీమ్‌లోనూ చోటు కోల్పోవడం.. ఈ మధ్యలో చెన్నై టీమ్‌ అతన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో అయిందన్న వార్తలు కలకలం రేపాయి. ఇవన్నీ ఇలా ఉండగానే అంబటి రాయుడు చేసిన ట్వీట్‌ మరో దుమారం రేపింది. తనకిదే చివరి ఐపీఎల్‌ సీజన్‌ అని శనివారం ఓ ట్వీట్‌ చేసి, గంటలోపే దానిని డిలీట్‌ చేయడం.. తర్వాత అలాంటిదేమీ లేదని టీమ్‌ సీఈవో చెప్పడం ఫ్యాన్స్‌ను గందరగోళానికి గురి చేసింది.

తాజాగా ఈ వివాదంపై చెన్నై సూపర్‌ కింగ్స్ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ కూడా స్పందించాడు. గుజరాత్‌ టైటన్స్‌ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఫ్లెమింగ్‌ మాట్లాడుతూ.. "అదేమీ అసంతృప్తి కలిగించలేదు. నిజాయతీగా చెప్పాలంటే అది టీకప్పులో తుఫానులాంటిది. అతడు బాగానే ఉన్నాడని అనుకుంటున్నా. ఈ సంఘటన టీమ్‌లో ఎలాంటి మార్పూ తీసుకురాలేదు" అని ఫ్లెమింగ్‌ చెప్పాడు.

రాయుడు చేసిన ఆ ట్వీట్‌పై సీఎస్కే సీఈవో కూడా స్పందించాడు. ఈ సీజన్‌లో తాను బాగా ఆడటం లేదన్న అసంతృప్తిలో రాయుడు ఉన్నాడని, అందుకే పొరపాటున ఆ ట్వీట్‌ చేశాడని చెప్పాడు. తాను మాట్లాడిన తర్వాత రాయుడు బాగానే ఉన్నాడని, రిటైర్‌ కావడం లేదని స్పష్టం చేశాడు. వేలంలో సీఎస్కే టీమ్‌ రాయుడిని రూ.6.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లలో అతడు 271 రన్స్‌ చేశాడు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్