RR vs PBKS Preview: ఆ వేదికపై తొలి ఐపీఎల్ మ్యాచ్.. పంజాబ్‌తో రాజస్థాన్ ఢీ -all set for rajasthan royals and punjab kings ipl match in guwahati ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rr Vs Pbks Preview: ఆ వేదికపై తొలి ఐపీఎల్ మ్యాచ్.. పంజాబ్‌తో రాజస్థాన్ ఢీ

RR vs PBKS Preview: ఆ వేదికపై తొలి ఐపీఎల్ మ్యాచ్.. పంజాబ్‌తో రాజస్థాన్ ఢీ

Maragani Govardhan HT Telugu
Apr 05, 2023 12:42 PM IST

RR vs PBKS Preview: ఐపీఎల్ 2023లో భాగంగా బుధవారం నాడు రాజస్థాన్-పంజాబ్ మధ్య జరగనుంది. తొలిసారిగా గువహటి బర్సాపారా వేదికగా ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. చెరో విజయంతో ఊపు మీదున్న ఇరుజట్లు విజయం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి.

రాజస్థాన్-పంజాబ్
రాజస్థాన్-పంజాబ్

RR vs PBKS Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నేటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్- పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. ఇందుకోసం తొలిసారిగా గువహటిలోని బర్సాపార స్టేడియం ఐపీఎల్‌కు వేదిక కానుంది. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ తన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి మంచి ఊపులో ఉంది. మరోపక్క డక్‌వర్త్ లూయిస్ విధానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. దీంతో చెరో విజయంతో ఇరు జట్లు బరిలోకి దిగబోతున్నాయి. సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

రబాడ రిటర్న్..

మొహాలీ వేదికగా కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 5 వికెట్లు నష్టపోయి 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్‌కతాను 16 ఓవర్లలో 7 వికెట్లు తీసి 146 పరుగులే చేసేలా చేసింది. గత మ్యాచ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా రాణించి జట్టుకు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌కు కగిసో రబాడా ఎంట్రీ ఇవ్వడం పంజాబ్‌కు మరింత బలం చేకూరనుంది. అంతేకాకుండా అతడు ఇంకో వికెట్ తీస్తే ఐపీఎల్‌లో 100 వికెట్ల క్లబ్‌లో చేరిపోతాడు. ఈ టోర్నీలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఇటీవల నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రబాడా అత్యుత్తమంగా రాణించాడు. అతడు మంచి ఫామ్‌లో ఉండటం పంజాబ్‌కు కలిసొచ్చే అంశం. బ్యాటింగ్‌లో భానుక రాజపక్స్, శిఖర్ ధావన్ లాంటి సీనియర్ ఆటగాళ్లతో పాటు జితేశ్ శర్మ, ప్రబ్‌ససిమ్రన్ లాంటి యువ ఆటగాళ్లు ఈ జట్టు సొంతం. అంతేకాకుండా సామ్ కరన్, సికిందర్ రజా లాంటి ఇంటర్నేషనల్ ఆల్ రౌండర్లతో పటిష్ఠంగా ఉంది పంజాబ్.

బలంగా రాజస్థాన్..

మరోపక్క.. రాజస్థాన్ రాయల్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గత మ్యాచ్‌లో చిత్తుగా ఓడించింది. 72 పరుగుల భారీ మార్జీన్‌తో విజయం సాధించింది. ఈ జట్టు టాపార్డర్ దుర్భేధ్యంగా ఉంది. జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, దేవ్‌దత్ పడిక్కల్ లాంటి ఆటగాళ్లు అత్యుత్తమంగా ఆడుతున్నారు. ముఖ్యంగా బట్లర్ చాలా ప్రమాదకరంగా రాణిస్తున్నాడు. గత మ్యాచ్‌లో బట్లర్, యశస్వి, సంజూ శాంసన్ ముగ్గురు అర్ధశతకాలు నమోదు చేయడం విశేషం. అలాగే మిడిలార్డర్ మెరుపులు మెరిపించేందుకు హిట్మైర్, రియాన్ పరాగ్ లాంటి డ్యాషింగ్ ఆటగాళ్లు ఈ టీమ్ సొంతం. బౌలింగ్ విభాగంలో సీనియర్ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్‌తో పాటు జేసన్ హోల్డర్ లాంటి పేసర్లు ఉన్నారు. స్పిన్ బౌలింగ్‌లో యజువేంద్ర చాహల్ గత మ్యాచ్‌లో 4 వికెట్లతో అదరగొట్టాడు. దీంతో అన్ని రంగాల్లోనూ రాజస్థాన్ రాయల్స్ బలంగా ఉంది.

ఇక ఈ రెండు జట్లలో రాజస్థాన్ బ్యాటింగ్‌లో కాస్త బలంగా ఉండగా.. ఆల్ రౌండర్లతో పంజాబ్ పటిష్ఠంగా ఉంది. రెండు జట్లు అన్నీ రంగాల్లోనూ సమతూల్యంగా ఉండటంతో ఈ మ్యాచ్ ఆసక్తిని పెంచనుంది. చివరగా ఈ రెండు జట్లు గత ఐపీఎల్‌లో వాంఖడే వేదికగా తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో పంజాబ్‌పై రాజస్థాన్ విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ 41 బంతుల్లో 68 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. బౌలింగ్‌లోనూ చాహల్ 3 వికెట్లతో రాణించాడు. ఐపీఎల్ అన్నీ సీజన్లలో కలిపి ఇరు జట్లు ముఖాముఖి 24 సార్లు తలపడగా.. రాజస్థాన్ 14 మ్యాచ్‌లు గెలవగా.. పంజాబ్ 10 గేముల్లో విజయం సాధించింది.

తాజాగా బుధవారం నాడు జరగనున్న మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్లలో గాయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ జట్టులో ప్రసిధ కృష్ణ సీజన్ మొత్తానికే దూరం అయ్యాడు. అతడి స్థానంలో సందీప్ శర్మ వచ్చాడు. తాజాగా ఓబెడ్ మెకాయ్ కూడా గాయపడటం గమనార్హం. మరోపక్క పంజాబ్ కింగ్స్‌ లియామ్ లివింగ్‌స్టోన్‌కు తొలి మ్యాచ్‌లో మోకాలి గాయమైంది. దీంతో అతడు ఈ మ్యాచ్‌లో ఆడతాడో లేదో అనుమానం నెలకొంది.

పిచ్ పరిస్థితి..

గువహటి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశముంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ వేదికపై మూడు టీ20లు జరగ్గా భారీ స్కోర్లు నమోదయ్యాయి. సగటున 185 పరుగులు చేశారు. గతేడాది భారత్- సౌతాఫ్రికా మధ్య జరిగిన టీ20లో ఇరుజట్లు కలిపి 458 పరుగులు చేశాయి.

జట్లు అంచనా..

రాజస్థాన్ రాయల్స్..

యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్, సంజూ శాంసన్(కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, షిమ్రన్ హిట్మైర్, రియాన్ పరాగ్, జేసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కేఎం ఆసిఫ్, యజువేంద్ర చాహల్.

పంజాబ్ కింగ్స్..

శిఖర్ ధావన్(కెప్టెన్), భానుక రాజపక్స, జితేష్ శర్మ, సికిందర్ రజా, సామ్ కరన్, ఎం షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్, కగిసో రబాడ.

Whats_app_banner