SRH vs KKR: హైదరాబాద్-కోల్‌కతా మ్యాచ్‌లో ఈ మూడు రికార్డులు బ్రేక్ అవుతాయా?-3 records that can break in kkr vs srh match ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Srh Vs Kkr: హైదరాబాద్-కోల్‌కతా మ్యాచ్‌లో ఈ మూడు రికార్డులు బ్రేక్ అవుతాయా?

SRH vs KKR: హైదరాబాద్-కోల్‌కతా మ్యాచ్‌లో ఈ మూడు రికార్డులు బ్రేక్ అవుతాయా?

Maragani Govardhan HT Telugu
Apr 14, 2023 04:33 PM IST

SRH vs KKR: శుక్రవారం నాడు హైదరాబాద్-కోల్‌కతా మధ్య జరగనున్న ఐపీఎల్ 19వ మ్యాచ్‌లో 3 రికార్డులు బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భువనేశ్వర్ కుమార్ 150వ ఐపీఎల్ మ్యాచ్ లాంటి రికార్డు కూడా ఉంది.

హైదరాబాద్-కోల్‌కతా
హైదరాబాద్-కోల్‌కతా

SRH vs KKR: ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2023లో 19వ మ్యాచ్‌గా జరగనున్న ఈ గేమ్‌లో విజయం కోసం ఇరుజట్లు ఆరాట పడుతున్నాయి. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన కేకేఆర్.. ఆ ఓటమిని పుంజుకుని బెంగళూరు, గుజరాత్‌లపై వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకుంది. మరోపక్క సన్‌రైజర్స్ ఓటమితో ఈ సీజన్‌ను పేలవంగా ప్రారంభించింది. రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని కైవసం చేసుకున్న హైదరాబాద్ పంజాబ్‌పై విజయం సాధించింది. ఇప్పుడు కేకేఆర్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది.

ఈ రెండు జట్లు తమ గత మ్యాచ్‌ను గెలవడంతో ఈ గేమ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో కొన్ని రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశముంది. ముఖ్యంగా మూడు రికార్డులను అధిగమించే అవకాశం ఎక్కువగా ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

జేసన్ రాయ్ 60వ టీ20 అర్ధ సెంచరీ..

ఈ మ్యాచ్‌కు కేకేఆర్ తరఫున ఆ జట్టు స్టార్ ఆటగాడు జేసన్ రాయ్ అరంగేట్రం చేయనున్నాడు. 32 ఏళ్ల ఈ ఓపెనర్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్బుత ప్రదర్శతో ఆకట్టుకున్నాడు. 307 టీ20ల్లో 141.9 స్ట్రైక్ రేటుతో 8,110 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 59 అర్ధశతకాలు ఉన్నాయి. ఈ రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే మ్యాచ్‌లో అర్ధశతకం నమోదు చేస్తే.. అది పొట్టి ఫార్మాట్‌లో 60వది అవుతుంది. ఫిలతంగా 60 కంటే ఎక్కువ అర్ధ సెంచరీలు సాధించిన మూడో ఇంగ్లాండ్ బ్యాటర్‌గా రికార్డు సాధిస్తాడు. అతడికంటే ముందు అలెక్స్ హేల్స్, జాస్ బట్లర్ ఉన్నారు.

ఉమేష్ యాదవ్ మూడో అత్యధిక వికెట్ టేకర్..

ఉమేష్ యాదవ్ ప్రస్తుతం కేకేఆర్ తరఫున అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు 62 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అతడు 65 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం కేకేఆర్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా ఉన్నాడు. ఇంకో రెండు వికెట్లు తీస్తే 66 వికెట్లతో మూడో స్థానంలో ఉన్న పియూష్ చావ్లాను అధిగమించి ఆ స్థానాన్ని ఆక్రమిస్తాడు. హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఉమేష్ ఈ రికార్డు సాధించే అవకాశముంది.

భువనేశ్వర్‌కు 150వ ఐపీఎల్ మ్యాచ్..

ఐపీఎల్ చరిత్రలో ఆల్ టైమ్ గ్రేట్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ పేరు తప్పకుండా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో 149 మ్యాచ్‌లు ఆడిన భువి 26 సగటుతో 156 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో 8వ స్థానంలో ఉన్నాడు. కేకేఆర్‌తో జరగనున్న ఈ మ్యాచ్‌ అతడి ఐపీఎల్ కెరీర్‌లో 150వది అవుతుంది. ఫలితంగా ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ పేసర్‌గా భువి రికార్డు సృష్టిస్తాడు.

WhatsApp channel