IND vs PAK: “ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. యాషెస్ కన్నా పెద్ద పోరు”: వెస్టిండీస్ స్టార్
IND vs PAK: ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ గురించి వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అలాగే, వన్డే ప్రపంచకప్‍లో టీమిండియాకు ఇద్దరు కీలక ఆటగాళ్లు ఎవరో చెప్పాడు.
India vs Pakistan: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఈ రెండు దేశాల్లోనే కాదు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు అంటే క్రేజ్ మరో లెవెల్‍లో ఉంటుంది. రెండు టీమ్‍ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‍లు చాలా ఏళ్ల నుంచి లేకపోవటంతో ఐసీసీ టోర్నీలతో పాటు ఆసియా కప్‍లో మాత్రమే తలపడుతున్నాయి. అందుకే ఏ ఐసీసీ టోర్నీలో టీమిండియా, పాక్ తలపడినా ఈ మ్యాచ్ కోసమే ఎందరూ ఎదురుచూస్తుంటారు. ఇక భారత్ వేదికగా ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ టోర్నీలోనూ భారత్, పాకిస్థాన్ ఢీకొననున్నాయి. అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ ఆసక్తికర కామెంట్లు చేశాడు.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ టెస్టు సిరీస్ కంటే ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ పెద్ద పోరాటమని క్రిస్ గేల్ అన్నాడు. తాను ఆ మ్యాచ్ చూస్తానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. “యాషెస్ కన్నా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ పెద్దది. పోరు చాలా తీవ్రతతో ఉంటుంది. అంతర్జాతీయ వేదికపై.. వందల కోట్ల మంది ప్రజలు చూస్తారు. అక్టోబర్ 15న ఏం జరుగుతుందో చూద్దాం. నేను కచ్చితంగా మ్యాచ్ చూస్తా” అని గేల్ చెప్పాడు.
ప్రపంచకప్‍లో టీమిండియాకు కీలకమైన ఇద్దరు ఆటగాళ్లు ఎవరన్న ప్రశ్నకు కూడా గేల్ స్పందించాడు. పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా, ధనాధన్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ పేర్లను చెప్పాడు. “కచ్చితంగా జస్‍ప్రీత్ బుమ్రా. అతడు మళ్లీ జట్టులోకి వస్తాడని నేను అనుకుంటున్నా. అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్.. ఇండియాకు కీలకం కానున్నాడు” అని గేల్ సమాధానం ఇచ్చాడు.
2012 నుంచి ఇండియా, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‍లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలతో పాటు ఆసియా కప్‍లో మాత్రమే తలపడుతున్నాయి. 2007 తర్వాత ఇరు జట్ల మధ్య ఒక్క టెస్టు మ్యాచ్ కూడా జరగలేదు.
ఈ ఏడాది భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనుంది.