IND vs WI : రాణించిన శ్రేయస్, రవి బిష్ణోయ్ - ఐదో టీ20 టీమ్ ఇండియా ఘన విజయం
ఐదో టీ20 వెస్టిండీస్ పై టీమ్ ఇండియా 88 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా బ్యాటింగ్ మెరుపులకు తోడు రవి బిష్ణోయ్ బౌలింగ్ లో రాణించడంతో ఇండియా గెలిచింది.
ఆదివారం వెస్టిండీస్ తో జరిగిన ఐదో టీ20లో టీమ్ ఇండియా 88 పరుగులు తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంతో సిరీస్ ను 4 1 తేడాతో ముగించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 188 రన్స్ చేయగా వెస్టిండీస్ 15.4 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఐదో టీ20 మ్యాచ్ కు గాయం కారణంగా రోహిత్ శర్మ దూరం కావడంతో హార్డిక్ పాండ్య కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో భారీ స్కోరు చేసింది. శ్రేయస్ 40 బాల్స్ లో రెండు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 64 రన్స్ చేశాడు. దీపక్ హుడా 25 బాల్స్ లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 35 రన్స్ చేయగా కెప్టెన్ హార్దిక్ 16 బాల్స్ లోనే రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 28 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు.
బ్యాట్స్ మెన్స్ అందరూ రాణించడంతో టీమ్ ఇండియా ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నస్టానికి 188 రన్స్ చేసింది. 189 రన్స్ టార్గెట్ తో బరిలో దిగిన వెస్టిండీస్ 100 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. హెట్ మేయర్ ఒక్కడే హాఫ్ సెంచరీతో భారత బౌలర్లను ఎదుర్కొన్నాడు. 35 బాల్స్ లో నాలుగు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 56 రన్స్ చేశాడు.
బ్రూక్స్, థామస్ మినహా మిగిలిన బ్యాట్స్ మెన్స్ ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. చివరి ఐదు వికెట్లను పదిహేడు పరుగులు తేడాతో వెస్టిండీస్ కోల్పోయింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ నాలుగు, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో మూడు వికెట్లు తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అక్షర్ పటేల్, సిరీస్ అవార్డును అర్షదీప్ సింగ్ దక్కించుకున్నారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ టీ20 సిరీస్ ను 4 1 తో టీమ్ ఇండియా ముగించింది.
టాపిక్