Gavaskar on Ind vs Pak: కార్తీక్‌ను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదు: గవాస్కర్
Gavaskar on Ind vs Pak: పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దినేష్ కార్తీక్‌ను పక్కన పెట్టడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నాడు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్. టీమ్ ఎంపిక అతడు అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Gavaskar on Ind vs Pak: ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. దీంతో టీమ్‌పై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా టీమ్ ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు ఈ కీలక మ్యాచ్‌లో దినేష్ కార్తీక్‌ను ఎందుకు పక్కన పెట్టారో అంతుబట్టడం లేదని సన్నీ అన్నాడు.
కార్తీక్‌పై ఫినిషర్ అన్న ముద్ర వేసినా.. ఈ మ్యాచ్‌కు తుది జట్టులో ఎందుకు తీసుకోలేదని అతడు ప్రశ్నించాడు. పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్, హాంకాంగ్‌లపై విజయాల్లో కీలకపాత్ర పోషించిన జడేజా గాయంతో దూరం కావడంతో టీమ్ కాంబినేషన్ సెట్ కావడానికి కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్‌ను తీసుకున్నారు. దీనిపై గవాస్కర్ తన అభ్యంతరం వ్యక్తం చేశాడు.
"దినేష్ కార్తీక్‌ను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదు. అతన్ని ఓ ఫినిషర్‌గా గుర్తించారు. కానీ ఇంత పెద్ద మ్యాచ్‌లో అతడు టీమ్‌లో లేడు. ఇది నాకు ఆశ్చర్యం కలిగించింది" అని ఇండియా టుడేతో మాట్లాడుతూ గవాస్కర్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో పంత్ ఫెయిలయ్యాడు. కీలకమైన టైమ్‌లో క్రీజులోకి వచ్చిన అతడు 12 బాల్స్‌లో 14 రన్స్ చేసి ఓ చెత్త షాట్‌తో ఔటయ్యాడు.
అయితే ఈ మ్యాచ్‌లో మునుపటి కోహ్లిని గుర్తు చేసిన విరాట్‌పై సన్నీ ప్రశంసలు కురిపించాడు. అతడు గతంలో కంటే కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడని అభిప్రాయపడ్డాడు. ఆసియా కప్‌కు ముందు తీవ్ర ఒత్తిడిలో ఉన్న విరాట్.. ఇందులో రెండు వరుస హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అన్ని షాట్లను కాన్ఫిడెంట్‌గా ఆడాడని సన్నీ చెప్పాడు.
"తొలి బంతి నుంచే బ్యాట్ మిడిల్‌లో తగిలాయి. కొన్ని షాట్లు అద్భుతంగా ఉన్నాయి. ఫిఫ్టీ కోసం ఫ్లిక్ షాట్‌తో కొట్టిన సిక్స్ కూడా చాలా బాగుంది. అన్ని బాల్స్ అతని బ్యాట్ మిడిల్‌లో తగులుతుండటం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది అతనికి మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎన్ని రన్స్ చేశాడన్నదాని కంటే ఎలా ఆడాడన్నదే ముఖ్యం. రానున్న మ్యాచ్‌లలో ఇండియాకు ఇది చాలా ప్లస్ కానుంది" అని గవాస్కర్ అన్నాడు.