FIFA World Cup Prize Money: క్రికెట్ వరల్డ్‌కప్ కంటే ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ ఎన్ని రెట్లు ఎక్కువో తెలుసా?
FIFA World Cup Prize Money: క్రికెట్ వరల్డ్‌కప్ కంటే ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ ఎన్ని రెట్లు ఎక్కువో తెలుసా? ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసే ఆటగా పేరున్న ఫుట్‌బాల్‌లో వరల్డ్‌కప్ విజేతకు ఇచ్చే ప్రైజ్‌మనీ కూడా అదే స్థాయిలో ఉంటుంది మరి.
FIFA World Cup Prize Money: క్రికెట్‌లో ఈ మధ్యే టీ20 వరల్డ్‌కప్ ముగిసింది. విజేతగా నిలిచిన ఇంగ్లండ్‌కు రూ.13 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. ఇది ఒకరకంగా భారీ ప్రైజ్‌మనీయే. కానీ ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌తో పోలిస్తే మాత్రం చాలా చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ విజేతకు ఇంత కంటే సుమారు 30 రెట్ల ఎక్కువ ప్రైజ్‌మనీ లభిస్తుంది మరి. విజేత కాదు కదా.. ఈ వరల్డ్‌కప్‌లో చివరి స్థానం (32)లో నిలిచే టీమ్‌కు కూడా ఇంతకంటే సుమారు ఆరు రెట్ల ప్రైజ్‌మనీ ఎక్కువగా లభించనుంది.
ఈసారి ఖతార్‌లో జరగబోయే ఫిఫా వరల్డ్‌కప్‌లో విజేతకు 44 మిలియన్ డాలర్లు (సుమారు రూ.357 కోట్లు) ప్రైజ్‌మనీగా ఇవ్వనున్నారు. 2018తో పోలిస్తే ఇది 4 మిలియన్ డాలర్లు ఎక్కువ కావడం విశేషం. ఇక రన్నరప్‌కు 30 మిలియన్ డాలర్లు (రూ.245 కోట్లు), మూడోస్థానంలో ఉన్న టీమ్‌కు 27 మిలియన్ డాలర్లు (రూ.220 కోట్లు), నాలుగోస్థానంలో టీమ్‌కు 25 మిలియన్ డాలర్లు (రూ.204 కోట్లు), 5 నుంచి 8వ స్థానాల్లో నిలిచిన టీమ్స్‌కు 17 మిలియన్ డాలర్లు (రూ.138 కోట్లు), 9-16వ స్థానాల్లో నిలిచిన టీమ్స్‌కు 13 మిలియన్ డాలర్లు (రూ.106 కోట్లు), 17-32వ స్థానాల్లో నిలిచే టీమ్స్‌కు 9 మిలియన్ డాలర్లు (రూ.74 కోట్లు) లభిస్తాయి.
అంకెల్లో ఫిఫా వరల్డ్‌కప్ 2022
32: ఖతార్‌లో జరగబోయే వరల్డ్‌కప్‌లో ఆడబోయే టీమ్స్ సంఖ్య
80: ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌లో ఆడబోయే 80వ టీమ్ ఖతార్
8: వరల్డ్‌కప్‌ను ఇప్పటి వరకూ గెలిచిన టీమ్స్ సంఖ్య ఇది. బ్రెజిల్ 5సార్లు, జర్మనీ, ఇటలీ నాలుగేసి సార్లు, అర్జెంటీనా, ఫ్రాన్స్, ఉరుగ్వే రెండేసి సార్లు, ఇంగ్లండ్, స్పెయిన్ ఒక్కోసారి గెలిచాయి.
80000: ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనున్న లూసెయిల్ స్టేడియం సామర్థ్యం
2.6: 2018 వరల్డ్‌కప్‌లో ఒక్కో గేమ్‌లో నమోదైన సగటు గోల్స్ సంఖ్య
6: ఇప్పటి వరకూ ఆతిథ్య దేశం వరల్డ్‌కప్ గెలిచిన సందర్భాలు
500 కోట్లు: ఈ ఏడాది వరల్డ్‌కప్‌ను టీవీల్లో చూడబోయే వారి సంఖ్య. భూమిపై ఉన్న జనాభాలో ఇది సగం కంటే కూడా ఎక్కువ కావడం విశేషం
11581 చదరపు కి.మీ.: వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తున్న ఖతార్ దేశ విస్తీర్ణం ఇది. ఫిఫా వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తున్న అతి చిన్న దేశంగా నిలవనుంది.