FIFA World Cup 2022: అద్భుతమైన ప్లేయర్‌.. మెస్సీపై ప్రశంసలు కురిపించిన రొనాల్డో-fifa world cup 2022 nears as ronaldo says messi is amazing player
Telugu News  /  Sports  /  Fifa World Cup 2022 Nears As Ronaldo Says Messi Is Amazing Player
క్రిస్టియానో రొనాల్డో
క్రిస్టియానో రొనాల్డో (REUTERS)

FIFA World Cup 2022: అద్భుతమైన ప్లేయర్‌.. మెస్సీపై ప్రశంసలు కురిపించిన రొనాల్డో

18 November 2022, 10:50 ISTHari Prasad S
18 November 2022, 10:50 IST

FIFA World Cup 2022: అద్భుతమైన ప్లేయర్‌ అంటూ మెస్సీపై ప్రశంసలు కురిపించాడు క్రిస్టియానో రొనాల్డో. ఫుట్‌బాల్‌లో ప్రస్తుతం అత్యుత్తమ ప్లేయర్స్‌గా ఈ ఇద్దరికీ పేరున్న విషయం తెలిసిందే.

FIFA World Cup 2022: ఫుట్‌బాల్‌ గురించి పెద్దగా తెలియని స్పోర్ట్స్‌ లవర్స్‌ కూడా క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్‌ మెస్సీలను గుర్తు పడతారు. ఆ ఇద్దరికీ ఫుట్‌బాల్‌ వరల్డ్‌లో ఉన్న గుర్తింపు అలాంటిది. ఆధునిక ఫుట్‌బాల్‌ చరిత్రలో వీళ్లు క్రియేట్‌ చేసిన మ్యాజిక్‌ను ఫ్యాన్స్‌ అంత త్వరగా మరచిపోరు. ఇప్పుడీ ఇద్దరు ప్లేయర్స్‌ తమ టీమ్స్‌ను విశ్వ విజేతగా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.

రానున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ vs రొనాల్డో సమరం కోసం కూడా ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఫైనల్‌ అర్జెంటీనా, పోర్చుగల్‌ మధ్య జరగాలని ఆశిస్తున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. అయితే వరల్డ్‌కప్‌కు ముందు తన ప్రత్యర్థి మెస్సీ గురించి రొనాల్డో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. అతడు తన టీమ్‌మేట్‌లాంటి వాడని రొనాల్డో అన్నాడు.

ఇద్దరూ ప్రత్యర్థులే అయినా ఫీల్డ్‌లో ఒకరిని ఒకరు ఎంతో గౌరవించుకుంటూ ఉంటారు. ఇప్పుడు రొనాల్డో చేసిన కామెంట్స్‌ కూడా అందుకు అద్దం పడుతున్నాయి. పియర్స్‌ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెస్సీపై రొనాల్డో ప్రశంసలు కురిపించాడు. అయితే ఫీల్డ్‌ బయట మాత్రం తాము అంత గొప్ప స్నేహితులం మాత్రం కాదని కూడా అన్నాడు.

"అద్భుతమైన ప్లేయర్‌. అతన్ని చూస్తుంటే ఓ మ్యాజిక్‌లా అనిపిస్తుంది. ఓ వ్యక్తిగా మేము ఇద్దరం 16 ఏళ్లుగా ఫుట్‌బాల్‌ ఫీల్డ్‌ను పంచుకుంటున్నాం. ఒక్కసారి ఊహించుకోండి 16 ఏళ్లు. అందుకే అతనితో మంచి రిలేషన్‌షిప్‌ ఉంది. అతడు నా ఫ్రెండ్‌ అని చెప్పను. ఫ్రెండ్‌ అంటే ఇంటికి వస్తాడు. ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. అతడు ఫ్రెండ్‌ కాదు కానీ టీమ్‌మేట్‌లాంటి వాడు" అని మెస్సీని ఉద్దేశించి రొనాల్డో అన్నాడు.

"అతడు నా గురించి మాట్లాడే తీరు చూస్తే ఎప్పుడూ అతన్ని గౌరవిస్తాను. అంతెందుకు అతని భార్య లేదా నా భార్య అయినా కూడా వాళ్లు కూడా ఒకరినొకరు గౌరవించుకుంటారు. వాళ్లు అర్జెంటీనాకు చెందిన వాళ్లు. నా గర్ల్‌ఫ్రెండ్‌ది కూడా అర్జెంటీనాయే. మెస్సీ గురించి ఏం చెబుతాం? గొప్ప వ్యక్తి. ఫుట్‌బాల్‌ గొప్పగా ఆడతాడు" అని రొనాల్డో అన్నాడు.

రానున్న ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా టీమ్‌ సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్‌లతో కలిసి గ్రూప్‌ సిలో ఉంది. మరోవైపు పోర్చుగల్‌ టీమ్‌ ఉరుగ్వే, ఘనా, సౌత్‌ కొరియాలతో కలిసి గ్రూప్ హెచ్‌లో ఉంది. అయితే ఈ రెండు టీమ్స్‌ ఫైనల్‌ చేరాలని, మెస్సీ, రొనాల్డో ముఖాముఖి తలపడాలని ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.