Maradona Hand of God goal ball Auction: ఆ ఫుట్‌బాల్‌కు వేలంలో రూ.19.58 కోట్లు.. ఎందుకంత క్రేజ్?
Maradona Hand of God goal ball Auction: ఆ ఫుట్‌బాల్‌కు వేలంలో రూ.19.58 కోట్లు వచ్చాయి. ఇంతకీ ఆ బాల్ ఏదో తెలుసా? 1986 వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా వివాదాస్పద హ్యాండ్ ఆప్ గాడ్ గోల్‌లో పాలుపంచుకున్న బాల్ అది.
Maradona Hand of God goal ball Auction: ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌లలో చోటు చేసుకున్న వివాదాల్లో ఎప్పుడూ ముందుండే హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్ గురించి తెలుసు కదా. 1986 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా కెప్టెన్ డీగో మారడోనా చేత్తో గోల్ చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ గోల్‌లో పాలుపంచుకున్న బాల్‌ను బుధవారం (నవంబర్ 16) వేలం వేశారు.
ఇందులో ఏకంగా 20 లక్షల పౌండ్ల ధర పలకడం విశేషం. అంటే మన కరెన్సీలో రూ.19.58 కోట్లు. ఈ అడిడాస్ బాల్ ఇన్నాళ్లూ ట్యూనీషియాకు చెందిన మ్యాచ్ రిఫరీ అలీ బిన్ నాజర్ దగ్గర ఉంది. దీనికి వేలంలో 30 లక్షల పౌండ్ల వరకూ వస్తుందని అంచనా వేశారు. యూకేకు చెందిన గ్రాహమ్ బడ్ ఆక్షన్స్ దీనిని వేలం వేయగా 20 లక్షల పౌండ్ల ధర పలికింది.
ఇదే మ్యాచ్‌లో మారడోనా వేసుకున్న జెర్సీని ఆరు నెలల కిందట వేలం వేశారు. దానికి ఏకంగా 93 లక్షల డాలర్లు (సుమారు రూ.76 కోట్లు) రావడం విశేషం. సోతేబీ సంస్థ దానిని వేలం వేయగా.. ఊహించిన దాని కంటే రెట్టింపు మొత్తం వచ్చింది. తాజాగా వేలం వేసిన ఫుట్‌బాల్‌ను ఆ మ్యాచ్‌లో మొత్తం 90 నిమిషాల పాటు ఉపయోగించారు. అప్పటికి ఇంకా ఫుట్‌బాల్‌లో ఒకటి కంటే ఎక్కువ బాల్స్ వినియోగించే రూల్ రాలేదు.
ఆ మ్యాచ్‌లో మారడోనా రెండు గోల్స్ చేశాడు. నిజానికి ఆ గోల్ తన చేత్తో చేసిందే అని తర్వాత అతడు చెప్పాడు. కొంత మారడోనా చేత్తో, మరికొంత దేవుడి చేత్తో ఆ గోల్ చేసినట్లు మారడోనా చెప్పడం గమనార్హం. అప్పటి నుంచీ హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్‌గా అది పేరుగాంచింది. ఆ మ్యాచ్ అర్జెంటీనా 2-1తో గెలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టింది.
ఈ గోల్ చేసినప్పుడు మ్యాచ్‌లో రిఫరీగా బిన్ నాజరే ఉన్నాడు. తాను స్పష్టంగా దానిని చూడలేకపోవడంతో అర్జెంటీనాకు గోల్ ఇచ్చినట్లు అతడు చెప్పాడు. తన లైన్స్‌మ్యాన్ చెప్పిన దాని ప్రకారం తాను గోల్‌గా ఇచ్చినట్లు తెలిపాడు. అప్పటి ఫిఫా నిబంధనల ప్రకారమే నడుచుకున్నానని అన్నాడు. అది లైన్స్‌మ్యాన్ తప్పు అని అప్పటి ఇంగ్లండ్ కోచ్ తనతో అన్నట్లు కూడా బిన్ నాజర్ వెల్లడించాడు.
టాపిక్