FIFA Earnings through world cup 2022: ఈ వరల్డ్‌కప్‌తో ఫిఫా సంపాదిస్తున్న మొత్తం రూ.61 వేల కోట్లు!
FIFA Earnings through world cup 2022: ఈ వరల్డ్‌కప్‌తో ఫిఫా సంపాదిస్తున్న మొత్తం అక్షరాలా రూ.61 వేల కోట్లు. ఆదివారం (నవంబర్ 20) ప్రారంభమైన 22వ ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ద్వారా ఫిఫా ఖజానా మరింత నిండింది.
FIFA Earnings through world cup 2022: ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఎంతో మనకు తెలుసు. ఈ టోర్నీని దాదాపు ప్రపంచంలోని సగం జనాభా టీవీల ద్వారా చూస్తుందంటేనే సాకర్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక అంతటి గేమ్ ద్వారా వచ్చే ఆదాయం కూడా అదే రేంజ్‌లో ఉంటుంది మరి.
ఫుట్‌బాల్ వ్యవహారాలు చూసుకునే ఫిఫా ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్ ద్వారా ఏకంగా 750 కోట్ల డాలర్లు (సుమారు రూ.61 వేల కోట్లు) ఆర్జించనుండటం విశేషం. ఖతార్‌లో జరుగుతున్న వరల్డ్‌కప్ 2022 నాలుగేళ్ల వాణిజ్య ఒప్పందాల ద్వారా ఈ మొత్తం వచ్చినట్లు ఫిఫా వెల్లడించింది. ఈ విషయాలను ఆదివారం (నవంబర్ 20) ఫిఫా అధికారులు తమ 200కుపైగా ఉన్న సభ్య దేశాలకు వివరించింది.
రష్యాలో 2018లో జరిగిన వరల్డ్‌కప్ నాలుగేళ్ల సైకిల్ కంటే ఇది 100 కోట్ల డాలర్లు ఎక్కువ కావడం గమనార్హం. ఈ అదనపు ఆదాయం ప్రస్తుత వరల్డ్‌కప్ ఆతిథ్య దేశమైన ఖతార్‌కు చెందిన కంపెనీల ద్వారా వచ్చింది. ఖతార్ ఎనర్జీ, ఖతార్ బ్యాంక్ క్యూఎన్‌బీ, టెలికమ్యూనికేషన్స్ సంస్థ ఊరెడూలాంటి సంస్థలు ఫిఫా వరల్డ్‌కప్‌కు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి.
ఇక 2018 రష్యా వరల్డ్‌కప్, ప్రస్తుత వరల్డ్‌కప్ బ్రాడ్‌కాస్ట్ డీల్స్ ద్వారా కూడా ఫిఫాకు భారీ మొత్తమే వచ్చింది. తమకు వచ్చే ఆదాయం నుంచే ఫిఫా ఆర్గనైజింగ్ కమిటీలకు, ప్రైజ్‌మనీ, టీమ్స్ రవాణా, వసతి వంటి వాటికి డబ్బు చెల్లిస్తుంది. ఈసారి మొత్తం ఫిఫా వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ 44 కోట్ల డాలర్లు (సుమారు రూ.3600 కోట్లు). అందులో విజేతకే 4.4 కోట్ల డాలర్లు (రూ.360 కోట్లు) దక్కనున్నాయి. ఈ మొత్తం ఫిఫానే ఇస్తుంది.
ప్రతి వరల్డ్‌కప్ సమయంలో ఫిఫా తమ ఆదాయ వివరాలను వెల్లడిస్తుంది. అంటే ప్రతి నాలుగేళ్లకోసారి తమ ఖాతాలను నిర్వహిస్తుంది. గతంలో 2015-18 మధ్య రష్యా వరల్డ్‌కప్ సమయంలో ఫిఫాకు 640 కోట్ల డాలర్ల ఆదాయం వచ్చింది. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న నేషనల్ ఫుట్‌బాల్ టీమ్స్‌తోపాటు వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లను నిర్వహించడానికి ఇందులో నుంచి కొంత మొత్తాన్ని వినియోగించారు.