FIFA Earnings from World Cup: ఒక్క వరల్డ్‌కప్‌తో ఫిఫా సంపాదన ఎంతో తెలిస్తే షాకవడం ఖాయం!-fifa earnings from world cup and other international tournaments are very huge ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Fifa Earnings From World Cup And Other International Tournaments Are Very Huge

FIFA Earnings from World Cup: ఒక్క వరల్డ్‌కప్‌తో ఫిఫా సంపాదన ఎంతో తెలిస్తే షాకవడం ఖాయం!

Hari Prasad S HT Telugu
Nov 18, 2022 08:31 AM IST

FIFA Earnings from World Cup: ఒక్క వరల్డ్‌కప్‌తో ఫిఫా సంపాదన ఎంతో తెలిస్తే ఎవరైనా షాకవుతారు. టోర్నీ నిర్వహణ కోసం ఎంతో ఖర్చు పెట్టినా కూడా ఫిఫాకు చివరికి భారీగానే మిగులుతుంది.

ఫుట్‌బాల్‌ వ్యవహారాలు చూసుకునే ఫిఫా
ఫుట్‌బాల్‌ వ్యవహారాలు చూసుకునే ఫిఫా (REUTERS)

FIFA Earnings from World Cup: ప్రపంచంలో ఫుట్‌బాల్‌ వ్యవహారాలు చూసుకునే సంస్థ ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ డి ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఫిఫా). భూమిపై ఎక్కువ మంది చూసే ఆటగా పేరున్న ఫుట్‌బాల్‌తో ఫిఫాకు సంపాదన కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. కూర్చొన్న చోటికే కోట్లకు కోట్లు వచ్చి పడుతూనే ఉంటాయి. ఇక వరల్డ్‌కప్‌ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

2018లో వరల్డ్‌కప్‌ జరిగినప్పుడు ఫిఫాకు వచ్చిన ఆదాయం 460 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.37500 కోట్లు. అది కూడా టోర్నీ నిర్వహణ కోసం ఎంతో ఖర్చు చేసిన తర్వాత కూడా. ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ ప్రైజ్‌మనీ సహా, నిర్వాహక దేశం ఆర్గనైజింగ్‌ కమిటీకి, రవాణాకు, టీమ్స్‌, సపోర్ట్‌ స్టాఫ్‌ వసతి ఏర్పాట్లకు, ఆతిథ్య దేశంలో ఫుట్‌బాల్‌ అభివృద్ధికి.. ఇలా ఎంతో ఖర్చు చేస్తుంది.

అయినా నాలుగేళ్ల కిందటి వరల్డ్‌కప్‌లో ఫిఫాకు ఈ స్థాయి ఆదాయం రావడం విశేషం. ఇక ఇప్పుడు ఖతార్‌ వరల్డ్‌కప్‌లోనూ మొత్తంగా 44 కోట్ల డాలర్ల ప్రైజ్‌మనీ ఇస్తోంది. అందులో విజేతకే 4.4 కోట్ల డాలర్లు దక్కుతుంది. అంటే సుమారు మన కరెన్సీలో రూ.358 కోట్లు. నాలుగేళ్లకోసారి ఫిఫా తన ఆదాయ వివరాలను వెల్లడిస్తుంది. తాజాగా 2015-18 కాలానికిగాను ఫిఫా మొత్తంగా 640 కోట్ల డాలర్లు (సుమారు రూ.52 వేల కోట్లు) సంపాదించింది. మరి ఫిఫా ఈ స్థాయిలో ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది.

ఫిఫా ఆదాయం ఇలా

ఫిఫా సంపాదనలో చాలా వరకూ టీవీ హక్కుల అమ్మకం ద్వారానే వస్తుంది. వరల్డ్‌కప్‌, ఇతర ఇంటర్నేషనల్ టోర్నీల టీవీ హక్కులను ఫిఫా భారీ మొత్తానికి అమ్ముతుంది. ఇంతకు ముందు చెప్పినట్లు 640 కోట్ల ఆదాయంలో 460 కోట్లు కేవలం టీవీ హక్కుల ద్వారానే రావడం విశేషం. ఇక మార్కెటింగ్‌ హక్కుల ద్వారా కూడా ఫిఫా పెద్ద మొత్తమే అందుకుంటుంది.

వరల్డ్‌కప్‌లాంటి మెగా ఈవెంట్లలో బడా కంపెనీలు తమ అడ్వర్‌టైజ్‌మెంట్ల కోసం భారీ మొత్తాలు ఫిఫాకు చెల్లిస్తాయి. 2015-18 నాలుగేళ్ల సైకిల్‌లో ఫిఫాకు ఇలా మార్కెటింగ్‌ హక్కుల అమ్మకం ద్వారా ఏకంగా 166 కోట్ల డాలర్ల (సుమారు రూ.13500 కోట్లు) ఆదాయం వచ్చింది.

ఇక టికెట్ల అమ్మకాలు, ఆతిథ్యం ద్వారా కూడా ఫిఫాకు కొంత ఆదాయం సమకూరుతుంది. అయితే టీవీ, మార్కెటింగ్‌ హక్కులతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 2015-18 సైకిల్‌లో వీటి ద్వారా ఫిఫాకు 7.12 కోట్ల డాలర్లు (సుమారు రూ.580 కోట్లు) సమకూరింది.

ఫిఫా తన పేరును వాడుకోవడానికి కూడా భారీ మొత్తంలో డబ్బు వసూలు చేస్తుంది. వీడియో గేమ్స్‌ చేసే ఈఏ 20 ఏళ్లకుగాను ఫిఫా పేరు వాడుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం ఏడాదికి 15 కోట్ల డాలర్లు ఫిఫాకు చెల్లిస్తుంది. గతేడాది లైసెన్సింగ్‌, మర్చండైజ్‌, రీటెయిల్‌, గేమింగ్‌ ద్వారా ఫిఫాకు 18 కోట్ల డాలర్లు వచ్చాయి.

WhatsApp channel