FIFA World Cup 2022 Expenditure: వామ్మో.. ఫిఫా వరల్డ్‌కప్ కోసం ఖతార్ చేసిన ఖర్చు రూ.16.6 లక్షల కోట్లు
FIFA World Cup 2022 Expenditure: ఇది నిజంగా నిజం. ఫిఫా వరల్డ్‌కప్ కోసం ఖతార్ చేసిన ఖర్చు అక్షరాలా రూ.16.6 లక్షల కోట్లు (200 బిలియన్ డాలర్లు). ఈ ఖర్చు చూసి ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకుంటున్నాయి.
FIFA World Cup 2022 Expenditure: ఫిఫా వరల్డ్‌కప్ ఆతిథ్య హక్కులు దక్కించుకోవడాన్ని గొప్ప గౌరవంగా దేశాలు భావిస్తాయి. తొలిసారి 2022లో మిడిల్ ఈస్ట్ దేశమైన ఖతార్ ఈ హక్కులు దక్కించుకుంది. కానీ ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం ఆ దేశం చేసిన ఖర్చు చూస్తే కళ్లు తేలేయాల్సిందే. కనీవినీ ఎరగని రీతిలో ఫిఫా వరల్డ్‌కప్ నిర్వహణ కోసం ఖతార్ ఏకంగా 200 బిలియన్ డాలర్లు (సుమారు రూ.16.6 లక్షల కోట్లు) ఖర్చు చేసిందట.
32 దేశాల పాల్గొంటున్న ఈ టోర్నీ నిర్వహణకు అంత ఖర్చు అవసరమా? అసలు ఆ స్థాయిలో ఎందుకు ఖర్చయింది అన్న సందేహాలు ఉన్నాయి. ఇది 2018లో రష్యా నిర్వహించిన ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ఖర్చుల(11.7 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే 17 రెట్లు ఎక్కువ కావడం విశేషం. కానీ ఖతార్ చేసిన ఖర్చు వెనుక పెద్ద తతంగమే ఉంది. అదేంటో చూద్దాం.
అన్నీ కొత్త స్టేడియాలే
ఫిఫా వరల్డ్‌కప్ ఈసారి ఖతార్‌లోని 8 స్టేడియాల్లో జరగనుంది. ఇందులో ఒక్క స్టేడియం తప్ప మిగతా ఏడింటినీ ఈ టోర్నీ కోసమే నిర్మించడం విశేషం. దీని కారణంగా ఆ దేశంలో 26 వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి లభించింది. ఇందులో 80 వేల మంది కూర్చొని చూసే సామర్థ్యం ఉన్న లూసెయిల్ స్టేడియం కూడా ఒకటి. ఇక్కడే ఫైనల్ జరగనుంది. ఇక అప్పటికే ఉన్న ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియాన్ని కూడా ఫిఫా వరల్డ్‌కప్ కోసం పూర్తిగా రెనోవేట్ చేశారు. దీంతో ఖర్చు తడిసి మోపెడైంది.
వచ్చే వారికి వసతి ఎలా?
ఖతార్ దేశ జనాభా కేవలం 30 లక్షలు. ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌ను నిర్వహిస్తున్న అతి చిన్న దేశం ఇదే. అలాంటి ఖతార్‌కు కేవలం ఈ వరల్డ్‌కప్ చూడటానికే ఏకంగా 12 లక్షల మంది వివిధ దేశాల నుంచి రానున్నారు. మరి అంత మందికి ఇక్కడ వసతి ఎలా అన్నది కూడా పెద్ద సవాలే. అందుకే గత 12 ఏళ్లుగా ఖతార్ మొత్తం ఆర్గనైజర్లు కొత్తగా హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి పూనుకున్నారు.
ఇక స్థానికులు కూడా ఈ టోర్నీ జరగనున్న నెల రోజుల పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి అద్దెకు ఇవ్వడానికి సిద్దమయ్యారు. అంతేకాదు క్రూయిజ్ షిప్పులు, ఎడారిలో కూడా కొందరు అభిమానులు ఉండటానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రూయిజ్ షిప్‌లలో మూడు హోటల్స్ ఉన్నాయి. వీటిలో 10 వేల మంది ఉండొచ్చు. దోహా సమీపంలో ప్రత్యేకంగా నిర్మించి వెయ్యి టెంట్లలోనూ అభిమానులు ఉండనున్నారు.
టోర్నీ కోసమే మెట్రో రైలు వ్యవస్థ నిర్మాణం
ఖతార్‌లాంటి చిన్న దేశంలో ఆ దేశ జనాభాకు తగినట్లుగానే పరిమిత స్థాయిలోనే అన్నీ ఉంటాయి. కానీ ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌లాంటి మెగా ఈవెంట్ నిర్వహిస్తున్న సమయంలో బయట నుంచి వచ్చే లక్షలాది మంది అభిమానుల కోసం అన్నీ కొత్తగా నిర్మించుకోవాల్సి వచ్చింది. తమ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్‌ను కూడా ఖతార్ గణనీయంగా మెరుగు పరచుకుంది. ప్రత్యేకంగా టోర్నీ కోసమే మెట్రో రైలు వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దీనిని 2019లోనే ప్రారంభించారు.
వరల్డ్‌కప్‌కు ఎంతో ముందుగానే ఇక్కడ ప్రధాన హైవేలు నిర్మించింది. ట్రామ్ వ్యవస్థనూ ఏర్పాటు చేసింది. ఇక మ్యాచ్‌ల టికెట్లు కొనుగోలు చేసిన వాళ్లకు నవంబర్ 10 నుంచి డిసెంబర్ 23 మధ్య ఈ ట్రాన్స్‌పోర్ట్ మొత్తం ఉచితమే. ఖతార్‌లో కేవలం 55 కి.మీ. పరిధిలోనే మొత్తం 8 స్టేడియాలు ఉన్నాయి. అంటే ఒక రోజు ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది.
8 స్టేడియాల్లో ఐదింటికి నేరుగా మెట్రో రైలును కనెక్ట్ చేశారు. మిగతా మూడింటికి మెట్రో, షటిల్ బస్ సర్వీసులు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. స్టేడియాల మధ్య అభిమానులను తీసుకెళ్లడానికి ఏకంగా 4 వేల బస్సులను ఏర్పాటు చేశారు. వరల్డ్ కప్ సందర్భంగా రోజుకు 50 వేల మంది ఈ బస్సులను ఉపయోగించుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
భద్రత ఎలా?
ఫిపా వరల్డ్‌కప్ కోసం వేల మంది భద్రతా సిబ్బందిని ఖతార్‌లోకి దింపారు. వివిధ దేశాలతో ఈ భద్రత కోసమే ప్రత్యేకంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. టర్కీ నుంచి పోలీసులు, పాకిస్థాన్ నుంచి ఆర్మీతోపాటు టోర్నీలో పాల్గొంటున్న వివిధ దేశాల నుంచి కూడా భద్రతా సిబ్బంది వచ్చారు. ఇప్పటికే సెక్యూరిటీ రిహార్సల్స్ కూడా చేశారు. ఇందులో 50 వేల మంది పాల్గొనడం గమనార్హం.