FIFA World Cup Trophy Details: ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీని తయారు చేసేది ఈ కుటుంబమే.. విలువెంతో తెలుసా?-fifa world cup trophy details as one italian family have the rights to make this iconic trophy ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Fifa World Cup Trophy Details: ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీని తయారు చేసేది ఈ కుటుంబమే.. విలువెంతో తెలుసా?

FIFA World Cup Trophy Details: ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీని తయారు చేసేది ఈ కుటుంబమే.. విలువెంతో తెలుసా?

Hari Prasad S HT Telugu
Nov 15, 2022 08:18 PM IST

FIFA World Cup Trophy Details: ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీని తయారు చేసేది మొదటి నుంచీ ఒక కుటుంబమే. ఇక ఆ ట్రోఫీ విలువెంతో తెలిస్తే ఎవరైనా కళ్లు తేలేయాల్సిందే.

ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని తయారు చేసిన వ్యక్తి సిల్వియో గాజానిగా
ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని తయారు చేసిన వ్యక్తి సిల్వియో గాజానిగా (Via REUTERS)

FIFA World Cup Trophy Details: ఫిఫా వరల్డ్‌కప్‌కు ఉన్న క్రేజ్‌ ప్రపంచంలో మరే ఇతర టోర్నీకి లేదంటే అతిశయోక్తి కాదు. ఫుట్‌బాల్‌ను ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ఆడటంతో ఈ విశ్వ సమరానికి అంతటి క్రేజ్‌ వచ్చింది. ఈసారి టోర్నీ నవంబర్ 20న ప్రారంభమై.. డిసెంబర్‌ 18న ముగుస్తోంది. అంతకుముందు ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ ప్రపంచవ్యాప్తంగా 51 దేశాల్లో పర్యటించి వచ్చింది.

అయితే ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ ట్రోఫీకి కూడా ఎన్నో విశేషాలు ఉన్నాయి. దీనిని తయారు చేసే విధానం నుంచి దీని విలువ వరకూ అన్నీ ఆశ్చర్యం కలిగించేవే. ఈ ట్రోఫీని ముద్దాడాలన్న ఆశతో ఈ ఏడాది 32 టీమ్స్ ఫిఫా వరల్డ్‌కప్‌లో పాల్గొనబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీ వెనుక ఉన్న చరిత్ర గురించి ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీ విశేషాలు

ఫిఫా వరల్డ్‌కప్‌ను 18 క్యారెట్ల బంగారంతో తయారు చేస్తారు. ఈ ట్రోఫీ ఎత్తు 37 సెంటీమీటర్లు. బరువు ఆరు కేజీలు. ఇద్దరు వ్యక్తులు భూగోళాన్ని మోస్తున్నట్లుగా ఈ ట్రోఫీని తీర్చిదిద్దారు. ఈ ట్రోఫీని తయారు చేసినప్పుడు దీని విలువ 50 వేల డాలర్లు. కానీ దీని ప్రస్తుత విలువ 2 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.160 కోట్లు కావడం విశేషం.

ఆ కుటుంబమే ట్రోఫీ తయారు చేసేది

50 ఏళ్లకుపైగా ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీని ఇటలీకి చెందిన ఒకే కుటుంబం తయారు చేస్తోంది. వరుసగా రెండోసారి కూడా ఇటలీ టీమ్‌ వరల్డ్‌కప్‌లో పాల్గొనకపోయినా.. ఈ ట్రోఫీ రూపంలో ఇటలీ ప్రాతినిధ్యం ఉండటం విశేషం. ప్రస్తుత ట్రోఫీని 1971లో ఇటలీలోని సిల్వియో గాజానిగా అనే ఆర్టిస్ట్‌ రూపొందించాడు. అంతకుముందు ట్రోఫీని బ్రెజిల్‌కు ఇచ్చేయడంతో ఈ కొత్త ట్రోఫీని రూపొందించాల్సి వచ్చింది.

ఆ తర్వాత కూడా ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీని గాజానిగా కుటుంబమే తయారు చేస్తూ వస్తోంది. నిజానికి ప్రతిసారీ విజేతకు ఈ ఒరిజినల్‌ ట్రోఫీని బహూకరించి తర్వాత తిరిగి తీసుకుంటారు. వాళ్లకు బంగారుపూత ఉన్న నకలును ఇస్తారు. ఏదైనా టీమ్‌ మూడుసార్లు ట్రోఫీని గెలిస్తే వాళ్లకు ఒరిజినల్‌ ట్రోఫీని ఇచ్చేసి మళ్లీ కొత్తగా మరో ట్రోఫీని తయారు చేస్తారు. ఈ ట్రోఫీని జూలెస్‌ రిమెట్‌ ట్రోఫీగా పిలుస్తారు. ఫిఫా మూడో అధ్యక్షుడిగా ఉన్న రిమెట్‌ గౌరవార్థం ట్రోఫీకి ఆ పేరు పెట్టారు.

Whats_app_banner