Dinesh Karthik on Dhawan: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్.. ఇటీవల కాలంలో అతడి ప్రదర్శనపై సర్వత్రా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్ మూడు మ్యాచ్‌ల్లో 7, 8, 3 పరుగులతో విఫలమయ్యాడు. మరోపక్క అందివచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్న ఇషాన్ కిషన్.. తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా వెళ్తున్నాడు. అంతేకాకుండా శుబ్‌మన్ గిల్ కూడా నిలకడగా రాణిస్తుండటంతో జట్టులో ధావన్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా ఈ విషయంపై దినేశ్ కార్తిక్ స్పందించాడు. ధావన్ వన్డే కెరీర్ ముగిసినట్లేనని పేర్కొన్నాడు.,"శ్రీలంకతో సిరీస్‌కు ధావన్‌ను ఏ స్థానంలో ఆడించాలి? ఇషాన్ కిషన్‌ను కాదనగలరా? మరోపక్క శుబ్‌మన్ గిల్ బాగా రాణిస్తున్నాడు. రోహిత్ అందుబాటులో ఉంటే.. ఎవరైనా తప్పుకోవాల్సి వస్తుంది. నాకు తెలిసి ధావన్ తప్పుకోవచ్చు. అద్భుతమైన గబ్బర్ వన్డే కెరీర్‌కు ఇది విషాదకరమైన ముగింపు కావచ్చు. అయితే కొత్తగా వచ్చిన సెలక్టర్లు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది." అని దినేశ్ కార్తిక్ అన్నాడు.,2023లో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో శిఖర్ ధావన్ ప్లెయింగ్ లెవెన్‌లోకి రావడం కష్టపడాల్సి ఉంటుందని దినేశ్ కార్తిక్ తెలిపాడు.,"శుబ్‌మన్ గిల్ జట్టులో భాగమై ఉన్నట్లయితే చాలా కాలంగా ఆడుతున్న కారణంగా బహుశా అతడు ఓపెనింగ్ చేసేవాడేమో. ఇషాన్ కిషన్ వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకున్నాడు. దీంతో ధావన్‌కు జట్టులో స్థానంలో అనుమానంగా మారింది." అని దినేశ్ కార్తిక్ తెలిపాడు.,గత కొంతకాలంగా ధావన్ వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. టెస్టులు, టీ20ల్లో అతడిని పక్కకు పెట్టారు. ఈ ఏడాది కొన్ని సిరీస్‌ల్లో వన్డేలకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఇటీవల కాలంలో వరుసగా విఫలమవుతూ.. జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో అతడు ఆడేది అనుమానంగా మారింది.,