Shikhar Dhawan on Rishabh Pant: పంత్ మ్యాచ్ విన్నర్.. సంజూ వెయిట్ చేయాల్సిందే: శిఖర్ ధావన్
Shikhar Dhawan on Rishabh Pant: పంత్ మ్యాచ్ విన్నర్.. సంజూ శాంసన్ వెయిట్ చేయాల్సిందే అంటూ పంత్ vs సంజూ చర్చకు ఫుల్‌స్టాప్ పెట్టాడు టీమిండియా స్టాండిన్ కెప్టెన్ శిఖర్ ధావన్. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత అతడీ కామెంట్స్ చేశాడు.
Shikhar Dhawan on Rishabh Pant: రిషబ్ పంత్ vs సంజూ శాంసన్ చర్చకు తనదైన సమాధానం ఇచ్చాడు ఇండియన్ టీమ్ స్టాండిన్ కెప్టెన్ శిఖర్ ధావన్. పంత్‌పై ప్రశంసలు కురిపిస్తూనే ప్రస్తుతం అతడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు చెప్పాడు. ఇక సంజూ శాంసన్ తన అవకాశాల కోసం ఎదురు చూడాల్సిందేననీ స్పష్టం చేశాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.
"ఓవరాల్‌గా ఏది మంచి అనేది చూడాలి. మన మ్యాచ్ విన్నర్ ఎవరో గుర్తించాలి. దీనిని విశ్లేషించి అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి" అని మ్యాచ్ తర్వాత ధావన్ అన్నాడు. గత కొన్నాళ్లుగా వైట్ బాల్ క్రికెట్‌లో పంత్ దారుణంగా విఫలమవుతున్నాడు. అతడు ఆడిన చివరి 9 టీ20, వన్డే ఇన్నింగ్స్ చూస్తే.. 10, 15, 11, 6, 6, 3, 9, 9, 27 స్కోర్లు చేశాడు.
న్యూజిలాండ్‌తో చివరి మూడు వన్డేల్లో అతడు 11, 15, 10 రన్స్ మాత్రమే చేయగలిగాడు. మరోవైపు సంజూ శాంసన్ మాత్రం తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో పంత్‌కు మద్దతిస్తూ ధావన్ చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి.
"సంజూ శాంసన్ తనకు దక్కిన అవకాశాలను సరిగ్గా సద్వినియోగం చేసుకుంటున్నాడు. కానీ కొన్నిసార్లు అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మరో ప్లేయర్ బాగా ఆడుతున్నాడు. అతని నైపుణ్యాన్ని బట్టి చూస్తే అతడో మ్యాచ్ విన్నర్. అతడు కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలవాల్సిన అవసరం ఉంది" అని ధావన్ స్పష్టం చేశాడు.
ఇక న్యూజిలాండ్ సిరీస్‌లో వర్షమే ఎక్కువ శాతం మ్యాచ్‌లను తినేయడంపై రెండు జట్ల కెప్టెన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఇది చాలా ఫ్రస్ట్రేటింగ్‌గా ఉంటుంది. మనం వర్షాన్ని నియంత్రించలేం. కానీ మాకు అవకాశాలు వచ్చాయి. మాలోని బలహీనతలు తెలిశాయి. ఎక్కడ మెరుగు పరచుకోవాలని తెలుసుకున్నాం. అన్నింటిపై చర్చించి విశ్లేషించాం" అని ధావన్ చెప్పాడు. డిసెంబర్ 4 నుంచి బంగ్లాదేశ్ టూర్‌కు వెళ్లే ఇండియన్ వన్డే టీమ్‌లోనూ ధావన్ ఉన్నాడు. ఆ సిరీస్‌కు కెప్టెన్ రోహిత్‌తోపాటు విరాట్ కోహ్లి కూడా తిరిగి రానున్నాడు.