Laxman on Rishabh Pant: విఫలమవుతున్నా పదేపదే పంత్‌కే అవకాశాలెందుకు.. ఇదీ కోచ్ లక్ష్మణ్ సమాధానం
Laxman on Rishabh Pant: విఫలమవుతున్నా పదేపదే పంత్‌కే అవకాశాలెందుకు? ఈ ప్రశ్న చాలా రోజులుగా ఇండియన్ ఫ్యాన్‌ను వేధిస్తోంది. అయితే దీనికి తాజాగా స్టాండిన్ కోచ్ లక్ష్మణ్ సమాధానమిచ్చాడు.
Laxman on Rishabh Pant: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై రోజురోజుకూ విమర్శలు ఎక్కువవుతున్నాయి. టెస్ట్ క్రికెట్‌లో టీమ్‌ను గెలిపిస్తున్నా.. వైట్‌బాల్ క్రికెట్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు. టీ20లు, వన్డేల్లో పంత్ చాలా రోజులుగా పెద్ద స్కోర్లు చేయలేకపోతున్నాడు. అయినా అతన్ని టీమ్‌లో కొనసాగిస్తూనే ఉన్నారు.
ఓవైపు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లాంటి బ్యాటర్లు ఉన్నా.. పంత్‌కే పదే పదే అవకాశాలు ఇవ్వడంపై ఫ్యాన్స్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లోనూ పంత్ కేవలం 6, 11, 15 స్కోర్లకే పరిమితమయ్యాడు. అంతకుముందు టీ20 వరల్డ్‌కప్‌లోనూ సౌతాఫ్రికాపై 27, జింబాబ్వేపై 3, సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 6 రన్స్ మాత్రమే చేశాడు.
అయినా పంత్‌కే అవకాశాలు ఎందుకు అన్న ప్రశ్నకు టీమిండియా స్టాండిన్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ సమాధానమిచ్చాడు. "వాళ్లకు అవకాశాలు ఇవ్వడం, వాళ్లను ఎంపిక చేయకపోయినప్పుడు అదే విషయాన్ని చెప్పడం చేస్తున్నాం. పంత్ నాలుగో స్థానంలో బాగా ఆడుతున్నాడు. అతడు ఓల్డ్ ట్రాఫర్డ్‌లో సెంచరీ చేసి ఎక్కువ కాలం కూడా కాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. టీ20 క్రికెట్ గ్రౌండ్లు ఎంత పెద్దగా ఉన్నా కూడా క్లియర్ చేసే కాన్ఫిడెన్స్‌ను బ్యాటర్లకు ఇచ్చింది" అని మూడో వన్డే ప్రారంభానికి ముందు లక్ష్మణ్ అన్నాడు.
సంజూ శాంసన్ ఓవైపు వన్డేల్లో సక్సెస్ అవుతున్నాడు. ఆడిన తొలి 11 వన్డేల్లో 66 సగటుతో 330 రన్స్ చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కానీ అతన్ని పంత్ కోసం పక్కన పెడుతూనే ఉన్నారు. ఇది ఒకరకంగా అభిమానులకు చిరాకు తెప్పిస్తోంది. ఇకనైనా వైట్ బాల్ క్రికెట్‌లో పంత్ స్థానంలో శాంసన్, ఇషాన్‌లాంటి వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు ద్రవిడ్ లేకపోవడంతో స్టాండిన్ కోచ్‌గా వ్యవహరించిన లక్ష్మణ్ తన రోల్‌ను పూర్తిగా ఎంజాయ్ చేసినట్లు చెప్పాడు. "వర్షం అసంతృప్తి కలగజేసింది. అయితే కోచింగ్ మాత్రం పూర్తి సంతృప్తినిచ్చింది. మధ్యమధ్యలో ఇలా కోచింగ్ బాధ్యతలు చేపట్టడం, యువకులతో గడపడం బాగుంది. ప్రతి మ్యాచ్‌లో ఏ కాంబినేషన్‌ను ఆడించాలనేది సవాలే. ఇండియాకు చాలా మంచి బెంచ్ స్ట్రెంత్, టాలెంట్ ఉంది" అని లక్ష్మణ్ చెప్పాడు.