Dinesh Karthik: ప్రయోగాలే టీమ్ ఇండియా ఓటమికి కారణం : దిలీప్ వెంగ్‌సర్కార్
Dinesh Karthik: ఆసియా కప్ లో దినేష్ కార్తిక్ ను ఎంపిక చేసినా అతడికి సరైన అవకాశాలు ఇవ్వలేదని అన్నాడు టీమ్ ఇండియా మాజీ సెలెక్టర్ దిలీప్ వెంగ్ సర్కార్. ప్రయోగాలు చేయడమే ఆసియా కప్ లో టీమ్ ఇండియా ఓటమికి కారణమని చెప్పాడు.
Dinesh Karthik: ఆసియా కప్‌లో టీమ్ ఇండియా వైఫల్యంపై రోజురోజుకు విమర్శలు పెరిగిపోతున్నాయి. టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా బరిలో దిగిన టీమ్ ఇండియా... పాకిస్థాన్, శ్రీలంకలపై వైఫల్యంతో సూపర్ ఫోర్ రౌండ్‌లోనే వెనుదిరిగింది.
కోహ్లి మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్లు రాణించలేకపోవడం, బౌలర్లు కూడా చేతులెత్తేయడంతో టీమ్ ఇండియాకు నిరాశే మిగిలింది. వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని ప్రయోగాలు చేయడమే టీమ్ ఇండియా ఓటమికి కారణమని మాజీ సెలెక్టర్ దిలీప్ వెంగ్ సర్కార్ పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో వెంగ్ సర్కార్ మాట్లాడుతూ ఆసియా కప్ లాంటి పెద్ద టోర్నీలలో ప్రయోగాలు చేయాలని అనుకుంటే ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయని అన్నాడు.
వెంగ్ సర్కార్ మాట్లాడుతూ ‘ఆసియా కప్ కోసం దినేష్ కార్తిక్ ను ఎంపిక చేశారు. కానీ కీలకమైన మ్యాచ్ లలో అతడికి అవకాశం ఇవ్వలేదు. అంతకుముందు మ్యాచ్ లలో అశ్విన్ పక్కనపెట్టారు. శ్రీలంకతో మ్యాచ్ లో తొలిసారి ఆడించారు. ఇష్టానుసారం ప్లేయర్లను మార్చడంతో జట్టు కూర్పు సరిగా కుదరలేదు. గెలవాల్సిన కీలకమైన మ్యాచ్ లలో ప్రయోగాలు చేయడం తోనే టీమ్ ఇండియా వైఫల్యాల్ని మూటగట్టుకుంది.
ప్లేయర్స్ అందరికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచన మంచిదే. కానీ వరల్డ్ నెల రోజులు మాత్రమే సమయం ఉంది. ఇలాంటి తరుణంలో సరైన టీమ్ ఎంపిక చేయడం కోసమే ఈ ప్రయోగాలు చేస్తున్నామని మేనేజ్ మెంట్ భావిస్తుందనుకుంటా. కానీ ఆసియా కప్ లాంటి పెద్ద టోర్నీని నిర్లక్ష్యం చేయడం సరైంది కాదన్నది నా అభిప్రాయం. ఆసియా కప్ గెలిస్తే వరల్డ్ కప్ ముందు జట్టులో ఆత్మవిశ్వాసం వచ్చేది. ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి ప్రధాన టోర్నమెంట్ లలో ప్రయోగాలు చేస్తే జట్టు లో సమిష్టితత్వం దెబ్బతింటుంది’ అని వెంగ్ సర్కార్ అభిప్రాయపడ్డాడు.