Dhoni in SA20: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ధోనీ.. కమిషనర్ స్మిత్ ఏమన్నాడంటే?
Dhoni in SA20: సౌతాఫ్రికా టీ20 లీగ్ SA20లో ధోనీ ఆడతాడా? దీనికి సంబంధించిన ఈ లీగ్ కమిషనర్ గ్రేమ్ స్మిత్ చేసిన కామెంట్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. సమీప భవిష్యత్తులో ధోనీ వస్తానంటే కచ్చితంగా మాట్లాడతామని ఆయన చెప్పారు.
Dhoni in SA20: ఎస్మెస్ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరై చాలా కాలమే అవుతున్నా.. ఇప్పటికీ చాలా క్రేజ్ ఉంది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు ఇంకా కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. మరి అతడు సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 లీగ్ ఎస్ఏ20 (SA20)తో ఒప్పందం కుదుర్చుకుంటాడా? తాజాగా ఈ లీగ్ కమిషనర్ గ్రేమ్ స్మిత్ దీనిపై స్పందించారు. హిందుస్థాన్ టైమ్స్ అడిగిన ఈ ప్రశ్నకు స్మిత్ ఆసక్తికర సమాధానమిచ్చారు.
నిజానికి ఇండియన్ క్రికెట్ తో సంబంధం ఉన్న ప్లేయర్స్ కు విదేశీ లీగ్ లలో ఆడే అనుమతి బీసీసీఐ ఇవ్వదు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనా.. ఇంకా ఐపీఎల్లో ఆడుతున్నాడు. అలా ఇండియన్ క్రికెట్ తో అతనికి సంబంధాలు కొనసాగుతున్నాయి. దీంతో ధోనీకి కూడా సౌతాఫ్రికా లీగ్ తో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం లేదు. దీనిపైనే స్మిత్ స్పందించారు.
"ధోనీలాంటి ప్లేయర్ ను కలిగి ఉండటం అద్భుతం. కానీ ఇంతకుముందు నేను చెప్పినట్లు మేము ఎప్పుడూ బీసీసీఐతో కలిసి పని చేస్తాం. వాళ్లను గౌరవిస్తాం. వాళ్లతో చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్లతో కలిసి పని చేశాం. నేర్చుకున్నాం. ఐపీఎల్, వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలను విజయవంతంగా నిర్వహించడంలో బీసీసీఐకి మంచి అనుభవం ఉంది.
SA20 కోసం కూడా ఆ సంబంధం చాలా అవసరం. ధోనీ విషయం కూడా మేము ఆలోచించాం. ఒకటీ, రెండు అవకాశాలు ఉన్నాయి. మేము మంచి లీగ్ ను నిర్మించాలని అనుకుంటున్నాం. అందువల్ల ధోనీలాంటి వ్యక్తి చేరితే లీగ్ విలువ మరింత పెరుగుతుంది. చాలా కాలంగా అతడు క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. అలాంటి వ్యక్తి వస్తే మా లీగ్ గౌరవం పెరుగుతుంది. అవకాశం ఉంటే మాత్రం నేను కచ్చితంగా ధోనీతో మాట్లాడతాను" అని స్మిత్ స్పష్టం చేశారు.
2021లోనే అంతర్జాయతీ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు. 2023 సీజన్ కోసం అతడు సిద్ధమవుతున్నాడు. అతనికి ఇదే చివరి ఐపీఎల్ అన్న వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై ధోనీ ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
సంబంధిత కథనం