DCW vs GGT: గుజరాత్‌ను చిత్తు చేసిన దిల్లీ.. 10 వికెట్ల తేడాతో ఘనవిజయం-delhi capitals women won by 10 wickets against gujarat giants women ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dcw Vs Ggt: గుజరాత్‌ను చిత్తు చేసిన దిల్లీ.. 10 వికెట్ల తేడాతో ఘనవిజయం

DCW vs GGT: గుజరాత్‌ను చిత్తు చేసిన దిల్లీ.. 10 వికెట్ల తేడాతో ఘనవిజయం

Maragani Govardhan HT Telugu
Mar 11, 2023 10:09 PM IST

DCW vs GGT: వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై దిల్లీ క్యాపిటల్స్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దిల్లీ ఓపెనర్లు షెఫాలీ వర్మ అర్ధశతకంతో అదగొట్టింది. అంతకుముందు బౌలింగ్ చేసిన దిల్లీ బౌలర్లలో మరిజానే క్యాప్ 5 వికెట్లతో రాణించింది.

గుజరాత్‌పై దిల్లీ ఘనవిజయం
గుజరాత్‌పై దిల్లీ ఘనవిజయం (PTI)

DCW vs GGT: వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం సాధించింది. ముంబయి డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ను దిల్లీ 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 106 పరుగుల లక్ష్యాన్ని వికెట్లేమి కోల్పోకుండా కేవలం 7.1 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(76) భారీ అర్ధశతకంతో విజృంభించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా.. మరో ఓపెనర్, దిల్లీ కెప్టెన్ మెగ్ ల్యానింగ్(21) నిలకడగా రాణించింది. గుజరాత్ బౌలర్లకు ఎలాంటి అవకాశమివ్వకుండా ఆకాశమే హద్దుగా చెలరేగింది షెఫాలీ.

105 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఎలాంటి గాబరా లేకుండా సులభంగా దిల్లీ ఛేదించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుంది. 28 బంతుల్లోనే 76 పరుగులు చేసి విధ్వంసం సృష్టించింది. స్టేడియం నలువైపులా బౌండరీలు తరలిస్తూ గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించిది. లక్ష్యం చిన్నదైనా దూకుడును మాత్రం అస్సలు తగ్గించలేదు ఈ బ్యాటర్. 105 పరుగుల లక్ష్యంలో షెఫాలీనే 76 పరుగులు చేసిందంటే ఆమె ఊచకోత ఎలా సాగిందో తెలుసుకోవచ్చు. షెఫాలీ మొత్తం ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.

మరో వైపు కెప్టెన్ మెగ్ ల్యానింగ్.. షెఫాలీకి సహకరిస్తూ నిలకడగా రాణించింది. 15 బంతుల్లో 21 పరుగులతో ఆకట్టుకుంది. ఇందులో 3 ఫోర్లు ఉన్నాయి. స్వల్ప లక్ష్యాన్ని ఓపెనర్లు ఇద్దరే ఛేదించారు. 7.1 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని పూర్తి చేశారు. ముఖ్యంగా ఆష్లే గార్డనర్‌ వేసిన ఒక్క ఓవర్లోనే 22 పరుగులు రాబట్టుకున్నారు. ఏ బౌలర్‌ను కూడా తక్కువ పరుగులు చేయకుండా వదిలిపెట్టలేదు.

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 105 పరుగులే చేయగలిగింది. కిమ్ గార్త్ 32 పరుగులే అత్యధిక. ఈమె మినహా మిగిలిన వారంతా తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో దిల్లీ పని సులభమైంది. దిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మరిజానే క్యాప్ 5 వికెట్లతో అదరగొట్టింది. తన స్పెల్‌తో టాపార్డర్‌ను తక్కువ పరుగులకే వెనక్కి పంపింది. ఆమెకు తోడు శిఖా పాండే కూడా 3 వికెట్లతో విజృంభించడంతో గుజరాత్ తక్కువ పరుగులకే పరిమితమైంది.

Whats_app_banner