New Cricket Rules: టీ20 వరల్డ్‌కప్‌.. క్రికెట్‌లోని ఈ మార్పులు మ్యాచ్‌ ఫలితాలను శాసిస్తాయా?-cricket rules changes may impact match results in t20 world cup 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  New Cricket Rules: టీ20 వరల్డ్‌కప్‌.. క్రికెట్‌లోని ఈ మార్పులు మ్యాచ్‌ ఫలితాలను శాసిస్తాయా?

New Cricket Rules: టీ20 వరల్డ్‌కప్‌.. క్రికెట్‌లోని ఈ మార్పులు మ్యాచ్‌ ఫలితాలను శాసిస్తాయా?

Hari Prasad S HT Telugu
Oct 20, 2022 11:56 AM IST

New Cricket Rules: టీ20 వరల్డ్‌కప్‌పై ఈ మధ్యే క్రికెట్‌ నిబంధనల్లో వచ్చిన మార్పులు ఎంత మేర ప్రభావం చూపనున్నాయన్న చర్చ జరుగుతోంది. అక్టోబర్‌ 1 నుంచే క్రికెట్‌లో చాలా మార్పులు జరిగిన విషయం తెలిసిందే.

<p>టీ20 వరల్డ్ కప్ 2022లో ఆడుతున్న జట్ల కెప్టెన్ల సెల్ఫీ</p>
టీ20 వరల్డ్ కప్ 2022లో ఆడుతున్న జట్ల కెప్టెన్ల సెల్ఫీ (PTI)

New Cricket Rules: క్రికెట్‌ను మరింత జనాదరణ కలిగిన స్పోర్ట్‌గా మార్చడానికి ఐసీసీ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంటుంది. క్రికెట్‌లో తాజాగా ప్లేయింగ్‌ కండిషన్స్‌లో కొన్ని కీలక మార్పులు జరిగాయి. అక్టోబర్‌ 1 నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. మరి ఈ రూల్స్‌లో మార్పులు టీ20 వరల్డ్‌కప్‌లో మ్యాచ్‌ల ఫలితాలను శాసిస్తాయా అన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఐదు మార్పులపై చర్చ జరుగుతోంది. అవేంటో చూద్దాం.

నాన్‌ స్ట్రైకర్‌ రనౌట్‌

క్రికెట్‌లో కొన్ని దశాబ్దాలుగా ఉన్న పదం మన్కడింగ్‌. నాన్‌ స్ట్రైకర్‌ బాల్‌ విసరక ముందే క్రీజు నుంచి బయటకు వెళ్లినప్పుడు బౌలర్‌ రనౌట్‌ చేయడాన్ని ఇలా పిలిచేవారు. ఇది అన్యాయమైన ఆట నిబంధనల్లో ఉండేది. కానీ తాజాగా దానిని కూడా సాధారణ రనౌట్‌గా పరిగణిస్తున్నట్లు నిబంధనల్లో మార్పులు చేశారు. వేగంగా సాగే టీ20 క్రికెట్‌లో నాన్‌ స్ట్రైకర్లు చాలా వరకూ పరుగు కోసం ఇలా క్రీజును వదులుతుంటారు. దీంతో ఈ వరల్డ్‌కప్‌లో బౌలర్లు దీనినో అస్త్రంగా మార్చుకోవడం ఖాయం. ఇది మ్యాచ్‌ ఫలితాలనే మార్చేస్తుందనడంలో సందేహం లేదు.

స్లో ఓవర్‌ రేట్‌ పెనాల్టీ

నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోతే మ్యాచ్‌ ఫీజుల్లో కోత, తర్వాతి మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం వంటి రూల్స్‌ గతంలో ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం స్లో ఓవర్‌ రేట్‌కు అప్పటికప్పుడే శిక్ష విధించేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచే ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. టీ20ల్లో ఇన్నింగ్స్‌ ప్రారంభమైన 85 నిమిషాల తర్వాత ఎన్ని ఓవర్లు మిగిలి ఉంటాయో.. అన్ని ఓవర్ల పాటు ఫీల్డింగ్‌ టీమ్‌కు సర్కిల్‌ బయట ఒక ఫీల్డర్‌ను తక్కువగా ఉంచే పెనాల్టీ విధిస్తారు. టీ20ల్లో ఇది టీమ్స్ గెలుపోటములను శాసిస్తుంది. అయితే గాయాలు, డీఆర్‌ఎస్‌, అంపైర్‌ రివ్యూల సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇవి కాకుండా ఫీల్డింగ్‌ టీమ్‌ సమయం వృథా చేయడానికి అవకాశం ఉండదు.

స్ట్రైక్‌లోకి కొత్త బ్యాటర్‌

ఓ బ్యాటర్‌ క్యాచ్‌ ఔట్‌ అయిన సమయంలో నాన్‌ స్ట్రైకర్‌ సగం క్రీజు దాటితే తర్వాతి బాల్‌ ఎదుర్కొనే అవకాశం అతనికే ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం.. క్రీజులోకి కొత్తగా వచ్చే బ్యాటరే స్ట్రైక్‌ తీసుకోవాలి. ఇది కూడా టీమ్స్ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా టెయిలెండర్లు బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో బౌలింగ్‌ టీమ్‌కు ఈ నిబంధన కలిసి వస్తుంది.

ఫీల్డర్లు కదిలితే పెనాల్టీ

బౌలర్‌ బౌలింగ్‌ చేసే సమయంలో ఫీల్డర్లు కదిలితే పెనాల్టీ వేయడం ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే తాజాగా కొత్త పెనాల్టీ విధించారు. ఎవరైనా ఫీల్డర్‌ ఇలా చేస్తే బ్యాటింగ్ టీమ్‌కు ఐదు రన్స్‌ అదనంగా ఇస్తారు. ఆ బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటిస్తారు. అయితే బ్యాటర్‌ షాట్‌ ఆడబోయే విధానానికి అనుగుణంగా ఫీల్డర్‌ కదిలడం మాత్రం న్యాయమైన ఆట కిందికే వస్తుంది.

పిచ్‌ బయట పడితే నోబాల్‌

ఒక్కోసారి బౌలర్‌ విసిరిన బంతి పిచ్‌ బయట పడితే బ్యాటర్లు బయటకు వెళ్లి మరీ బంతిని కొట్టేవారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం.. ఒక బ్యాటర్‌ బంతిని కొట్టాలంటే అతని శరీరం లేదా బ్యాట్‌లో కొంత భాగమైనా పిచ్‌ లోపలే ఉండాలి. ఒకవేళ బ్యాటర్‌ క్రీజు బయటకు వెళ్లాల్సిన విధంగా బౌలర్‌ బంతి వేస్తే అంపైర్‌ దానిని నోబాల్‌గా ప్రకటించి, తర్వాత బంతికి ఫ్రీ హిట్‌ ఇస్తాడు.

Whats_app_banner