Praggnanandhaa: ప్రధాని మోదీని కలిసిన చెస్ స్టార్ గ్రాండ్‍మాస్టర్ ప్రజ్ఞానంద
Praggnanandhaa: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు భారత యువ చెస్ సంచలనం ప్రజ్ఞానంద. ఇటీవల జరిగిన చెస్ ప్రపంచకప్‍లో రన్నరప్‍గా ప్రజ్ఞానంద నిలిచారు.
Praggnanandhaa meets PM Modi: ఇటీవల జరిగిన చెస్ ప్రపంచకప్‍లో భారత యువ సంచలనం, 18ఏళ్ల గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద అద్భుతంగా ఆడారు. టోర్నీలో ప్రపంచ మూడో ర్యాంకర్ హికారు నకమురా, రెండో ర్యాంకర్ ఫాబినో కరునను ఓడించి ఫైనల్ చేరారు. అయితే, తుదిపోరులో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్ చేతిలో ప్రజ్ఞానంద ఓటమి చెందారు. రన్నరప్‍గా నిలిచి వెండి పతకం సాధించారు. ఫైనల్‍లో ఓడినా.. అందరి మనసులను ప్రజ్ఞానంద గెలిచారు. ప్రపంచకప్ లాంటి పెద్ద వేదికలో ఆయన కనబరిచిన ప్రతిభకు అందరూ ఫిదా అయ్యారు. కార్ల్‌సన్ కూడా అతడిని ప్రశంసించారు. కోట్లాది మంది ప్రజ్ఞానందకు అభినందలు తెలిపారు. కాగా, నేడు (ఆగస్టు 31) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రజ్ఞానంద కలిశారు. ఆ వివరాలివే..
ఢిల్లీలో నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రజ్ఞానంద కలిశారు. తన తల్లిదండ్రులతో కలిసి ప్రధాని నివాసానికి ఆయన వెళ్లారు. చెస్ ప్రపంచకప్‍లో తాను సాధించిన సిల్వర్ మెడల్‍ను ప్రధానికి చూపించారు ప్రజ్ఞానంద. అతడిని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆప్యాయంగా మాట్లాడారు. ప్రజ్ఞానంద తల్లిదండ్రులతోనూ మాట్లాడారు ప్రధాని మోదీ. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్ ఎక్స్ (ఇంతకు ముందు ట్విట్టర్)లో ప్రజ్ఞానంద వెల్లడించారు.
“ఆయన నివాసంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నన్ను, నా తల్లిదండ్రులను ప్రోత్సహించేలా మీరు చెప్పిన మాటలకు చాలా ధన్యవాదాలు” అని ప్రజ్ఞానంద ట్వీట్ చేశారు. ప్రధానిని కలిసిన ఫొటోలను పోస్ట్ చేశారు.
ప్రజ్ఞానంద ట్వీట్‍కు ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. “మీ కుటుంబంతో పాటు మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. మీరు మీ పట్టుదలను, అభిరుచిని అద్భుతంగా ప్రదర్శించారు. భారత దేశ యువత సంకల్పిస్తే ఏ రంగంలోనైనా ఎలా విజయం సాధించగలదో మీరు ఉదాహరణగా నిలిచారు” అని మోదీ రిప్లై ఇచ్చారు.
చెస్ ప్రపంచకప్‍లో అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రజ్ఞానందకు మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా బహుమతి ఇచ్చారు. ఓ స్పెషల్ ఎడిషన్ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని కానుకగా ఇచ్చారు.