Cameron Green on IPL Auction: వేలంలో రూ.17.5 కోట్లు ఎలా వచ్చాయో.. నేను చేసింది పెద్దగా ఏమీ లేదు: గ్రీన్‌-cameron green on ipl auction says he did not do much to earn that much ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cameron Green On Ipl Auction: వేలంలో రూ.17.5 కోట్లు ఎలా వచ్చాయో.. నేను చేసింది పెద్దగా ఏమీ లేదు: గ్రీన్‌

Cameron Green on IPL Auction: వేలంలో రూ.17.5 కోట్లు ఎలా వచ్చాయో.. నేను చేసింది పెద్దగా ఏమీ లేదు: గ్రీన్‌

Hari Prasad S HT Telugu
Dec 26, 2022 05:27 PM IST

Cameron Green on IPL Auction: వేలంలో రూ.17.5 కోట్లు ఎలా వచ్చాయోనని, దీనికోసం తాను చేసింది పెద్దగా ఏమీ లేదని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ అన్నాడు. తనకు భారీ ధర దక్కడంపై గ్రీన్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే.

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ (AFP)

Cameron Green on IPL Auction: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌.. ఇతడు ఆడింది 7 టీ20లే అయినా అతనికి ఉన్న క్రేజ్‌ మాత్రం మామూలుగా లేదు. తొలిసారి ఐపీఎల్‌ వేలంలో పాల్గొన్న గ్రీన్‌.. లీగ్ చరిత్రలో రెండో అత్యధిక ధర పొందిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మధ్య జరిగిన మినీ వేలంలో కామెరాన్‌ గ్రీన్‌ను ముంబై ఇండియన్స్‌ టీమ్‌ రూ.17.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇదే వేలం రూ.18.5 కోట్లతో సామ్‌ కరన్‌ను పంజాబ్‌ కింగ్స్ దక్కించుకుంది.

23 ఏళ్ల గ్రీన్‌ కోసం ఏకంగా మూడు ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. బెంగళూరు, ఢిల్లీ, ముంబై మధ్య పోటీ నెలకొనగా.. చివరికి ముంబై ఈ ఆల్‌రౌండర్‌ను దక్కించుకుంది. పొలార్డ్‌ రిటైర్‌ కావడంతో ఏర్పడిన ఆల్‌రౌండర్‌ లోటును గ్రీన్‌ ద్వారా పూడ్చుకుంది. అయితే తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్ట్‌ తొలి రోజే ఐదు వికెట్లు తీసుకున్న సందర్భంగా గ్రీన్‌.. ఐపీఎల్‌ వేలంపై స్పందించాడు.

"ఈ విషయాన్ని ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఇది చాలా స్పెషల్‌ ఫీలింగ్‌. దీనిని చాలా కాలం పాటు నేను గుర్తుంచుకుంటాను" అని గ్రీన్‌ అన్నాడు. అయితే వేలంలో ఇంత భారీ ధర దక్కడానికి తాను చేసిందేమీ లేదని అనడం విశేషం.

"నిజం చెప్పాలంటే ఈ స్థాయిలో ధర రావడానికి నేను పెద్దగా చేసిందేమీ లేదని అనుకుంటున్నాను. అయితే ఇది నాలో ఎలాంటి మార్పు తీసుకురాదు. నాలో, నా క్రికెట్‌లోనూ ఎలాంటి మార్పు రాదు. నాలో పెద్దగా మార్పు వస్తుందని అనుకోవడం లేదు" అని కూడా గ్రీన్ చెప్పాడు.

కామెరాన్‌ గ్రీన్‌ కేవలం ఏడు టీ20 మ్యాచ్‌లే ఆడాడు. అయితే ఇండియాపై అతడు ఆడిన తీరు చూసిన తర్వాత ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌లోకి ఎంపికయ్యాడు. గ్రీన్‌కు వేలంలో భారీ ధర ఖాయమని ముందు నుంచే అంచనాలు ఉన్నాయి. అయితే ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ను కూడా మించిపోతాడని మాత్రం ఊహించలేదు.

ఇక తాజాగా జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్ట్‌లో గ్రీన్‌ 5 వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బ తీశాడు. దీంతో సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 189 రన్స్‌కే ఆలౌటయ్యారు. లెజెండరీ స్పిన్నర్ షేన్‌ వార్న్‌ తర్వాత బాక్సింగ్‌ డే నాడు 5 వికెట్లు తీసిన తొలి ఆస్ట్రేలియన్‌గా గ్రీన్‌ నిలిచాడు.

WhatsApp channel

సంబంధిత కథనం