Ben Stokes in IPL 2023: చెన్నైకి షాక్.. ఐపీఎల్ మధ్యలోనే వెళ్లిపోనున్న బెన్ స్టోక్స్
Ben Stokes in IPL 2023: చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు షాక్ తగిలేలా ఉంది. ఆ టీమ్ ఏరికోరి రూ.16.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన బెన్ స్టోక్స్ ఈసారి ఐపీఎల్ మధ్యలోనే వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Ben Stokes in IPL 2023: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈసారి ఐపీఎల్ కు తిరిగొస్తున్న విషయం తెలుసు కదా. ధోనీ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని గత మినీ వేలంలో కొనుగోలు చేసింది. స్టోక్స్ రాకతో చెన్నై టీమ్ మరింత బలంగా మారింది. గతేడాది దారుణమైన సీజన్ తర్వాత ఈసారి ఆ టీమ్ మళ్లీ గాడిలో పడాలని చూస్తోంది. దీంతో వేలంలో స్టోక్స్ పై భారీగా ఖర్చు చేసి మరీ దక్కించుకుంది.
అయితే అతడు మాత్రం ఈ సీజన్ లోని అన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ కు ముందు ఐర్లాండ్ తో జరగబోయే ఏకైక టెస్టులో ఇంగ్లండ్ టీమ్ ను లీడ్ చేయడానికి అంటూ ముందుగానే ఐపీఎల్ ను వీడనున్నాడు. స్టోక్స్ లీగ్ ను వదిలే సమయానికి కీలకమైన దశలో ఉండే అవకాశం ఉంది.
ఇంగ్లండ్, ఐర్లాండ్ టెస్టు జూన్ 1న ప్రారంభం కానుంది. ఇక ఐపీఎల్ మాత్రం మే 28న జరగబోయే ఫైనల్ తో ముగుస్తుంది. దీంతో మధ్యలో కేవలం మూడు రోజుల సమయమే ఉంటుంది. అయితే స్టోక్స్ మాత్రం ఈ టెస్ట్ ఆడబోయే ముందు తనకు తగిన సమయం ఉండాలని భావిస్తున్నాడు. "నేను ఆ మ్యాచ్ ఆడతాను. ఆ మ్యాచ్ ఆడటానికి ముందు నాకు తగిన సమయం ఉండేలా చూసుకుంటాను" అని స్టోక్స్ చెప్పాడు.
ఇప్పటికే న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ కూడా ఐపీఎల్ మొత్తానికి అందుబాటులో లేకపోవడం చెన్నైకి మింగుపడనిదే. ఇక ఇప్పుడు స్టోక్స్ కూడా లీగ్ మధ్యలోనే వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు యాషెస్ కు ముందు ఐర్లాండ్ తో టెస్ట్ ఎంత ముఖ్యమన్నదానిపై తాను ఐపీఎల్లో ఆడబోయే ఇతర ఇంగ్లండ్ ప్లేయర్స్ కు చెబుతానని కూడా స్టోక్స్ చెప్పాడు.
రానున్న ఐపీఎల్లో జో రూట్, మార్క్ వుడ్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జోఫ్రా ఆర్చర్, సామ్ కరన్ లాంటి ఇంగ్లండ్ ప్లేయర్స్ ఆడుతున్నారు. "యాషెస్ సిరీస్ కోసం ఎలా ప్రిపేర్ కావాలనుకుంటున్న విషయంపై నేను ప్రతి ప్లేయర్ తో మాట్లాడతాను. ఎందుకంటే ఆ ఐదు మ్యాచ్ లు మాకు ఈ సమ్మర్ లోనే చాలా పెద్దవి" అని స్టోక్స్ అన్నాడు.