BCCI to PCB: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు దిమ్మదిరిగే రిప్లై ఇచ్చిన బీసీసీఐ, ఐసీసీ-bcci to pcb turned down the request to change wc venues ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Bcci To Pcb: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు దిమ్మదిరిగే రిప్లై ఇచ్చిన బీసీసీఐ, ఐసీసీ

BCCI to PCB: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు దిమ్మదిరిగే రిప్లై ఇచ్చిన బీసీసీఐ, ఐసీసీ

Hari Prasad S HT Telugu
Jun 22, 2023 07:09 AM IST

BCCI to PCB: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు దిమ్మదిరిగే రిప్లై ఇచ్చాయి బీసీసీఐ, ఐసీసీ. వరల్డ్ కప్‌లో తాము ప్రత్యర్థులతో ఆడబోయే వేదికలను మార్చాలన్న వినతిని తోసిపుచ్చాయి.

వరల్డ్ కప్ లో వేదికలు మార్చాల్సిందిగా పాక్ బోర్డు చేసిన వినతిని తోసిపుచ్చిన ఐసీసీ
వరల్డ్ కప్ లో వేదికలు మార్చాల్సిందిగా పాక్ బోర్డు చేసిన వినతిని తోసిపుచ్చిన ఐసీసీ (AP-Reuters )

BCCI to PCB: ఇండియాతో అహ్మదాబాద్ లో ఆడే ప్రసక్తే లేదు.. ఆఫ్ఘనిస్థాన్ తో చెన్నైలో ఆడబోము.. ఆస్ట్రేలియాతో బెంగళూరులో మ్యాచ్ వద్దు అంటూ వరల్డ్ కప్ వేదికలపై గొంతెమ్మ కోరికలు కోరుతున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు బీసీసీఐ, ఐసీసీ దిమ్మదిరిగే రిప్లై ఇచ్చాయి. వేదికలు మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి. పాక్ బోర్డు వింత కోరిక క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే.

వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్ అక్టోబర్ 20న ఆస్ట్రేలియాతో బెంగళూరులో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇక అక్టోబర్ 23న ఆప్ఘనిస్థాన్ తో చెన్నైలో తలపడాల్సి ఉంది. అయితే స్పిన్ కు అనుకూలించే చెన్నై పిచ్ పై ఆఫ్ఘన్ జట్టుతో ఆడటానికి పాక్ జంకుతోంది. అందుకే ఆఫ్ఘన్ తో మ్యాచ్ బెంగళూరులో, ఆస్ట్రేలియాతో మ్యాచ్ చెన్నైలో ఆడతామంటూ బీసీసీఐ, ఐసీసీలకు ప్రతిపాదన పంపించింది.

దీనిపై మంగళవారం బీసీసీఐ, ఐసీసీ సంయుక్తంగా ఓ సమావేశం నిర్వహించాయి. అలా కుదరదని అధికారికంగా పీసీబీకి తేల్చి చెప్పాయి. టోర్నీలో ఆడబోయే ఈ ఇతర టీమ్ కూడా ఇలా వేదికలను మార్చాల్సిందిగా కోరలేదు. కానీ పాకిస్థాన్ మాత్రం ప్రత్యర్థులకు తగినట్లుగా తమకు అనుకూలమైన వేదికలు కావాలని కోరడం ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆస్ట్రేలియాతో చెన్నైలో, ఆఫ్ఘనిస్థాన్ తో బెంగళూరులో ఆడితే ఈ రెండు మ్యాచ్ లలోనూ తామే ఫేవరెట్స్ గా బరిలోకి దిగుతామన్న ఆలోచనలో పాకిస్థాన్ ఉంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంతర్గత చర్చల్లో ఇదే అంశం ప్రస్తావనకు వచ్చినట్లు గతంలో ఈఎస్పీఎన్‌క్రికిన్ఫో రిపోర్టు వెల్లడించింది. అంతకుముందు ఇండియాతో అహ్మదాబాద్ లో మ్యాచ్ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని కూడా పీసీబీ ఆరోపించిన విషయం తెలిసిందే.

ఆసియా కప్ కోసం పాకిస్థాన్ కు వెళ్లే ప్రసక్తే లేదని బీసీసీఐ తేల్చి చెప్పిన నాటి నుంచీ వరల్డ్ కప్ పై పాక్ బోర్డు ఏదో ఒక పేచీ పెడుతూనే ఉంది. అసలు ఈ మెగా టోర్నీని బాయ్‌కాట్ చేస్తామని మొదట్లో హెచ్చరించినా.. తర్వాత వెనక్కి తగ్గింది. ఆ తర్వాత వేదికలను మార్చాల్సిందిగా ప్రతిపాదనలు పంపింది. ఇప్పుడు ఆ ప్రతిపాదనను కూడా ఐసీసీ తిరస్కరించడంతో పీసీబీ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Whats_app_banner

సంబంధిత కథనం