Babar scares Hasan Ali: బౌలర్‌ని బ్యాట్‌తో కొట్టబోయిన బాబర్ ఆజం.. వీడియో వైరల్
Babar scares Hasan Ali: బౌలర్‌ని బ్యాట్‌తో కొట్టబోయాడు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఈ ఘటన జరిగింది.
Babar scares Hasan Ali: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఓ ఊహించని ఘటన జరిగింది. పెషావర్ జల్మీ, ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య జరిగిన మ్యాచ్ లో బాబర్ ఆజం సహనం కోల్పోయాడు. తాను పరుగు తీస్తున్న సమయంలో అడ్డుగా వచ్చిన బౌలర్ హసన్ అలీని బ్యాట్ తో కొట్టబోయాడు. పెషావర్ కెప్టెన్ అయిన బాబర్ హాఫ్ సెంచరీ చేసినా.. ఈ మ్యాచ్ లో ఇస్లామాబాద్ విజయం సాధించింది.
బాబర్ 75 రన్స్ చేయగా.. పెషావర్ 156 పరుగులు చేసింది. ఆ తర్వాత చేజింగ్ లో ఇస్లామాబాద్ తరఫున ఆప్ఘనిస్థాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ కేవలం 31 బాల్స్ లో 62 రన్స్ చేశాడు. దీంతో ఇస్లామాబాద్ 6 వికెట్లతో గెలిచింది. అయితే పెషావర్ బ్యాటింగ్ సందర్భంగా ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఆ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం.. ప్రత్యర్థి బౌలర్ హసన్ అలీని బ్యాట్ తో కొట్టబోయాడు.
హసన్ బౌలింగ్ లో బాబర్ సింగిల్ తీశాడు. ఆ సమయంలో అడ్డుగా ఉన్న హసన్ పైకి బాబర్ బ్యాట్ ఎత్తడంతో అతడు భయపడి దూరంగా వెళ్లిపోయాడు. నిజానికి బాబర్ సరదాగా ఇలా చేశాడు. నేషనల్ టీమ్ లో ఈ ఇద్దరూ కలిసి ఆడతారన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో హసన్ అలీ 3 వికెట్లు తీసిన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.
అయితే ఇదే మ్యాచ్ లో మరో సందర్భంలో బాబర్ ఆజం సహనం కోల్పోయాడు. తన బ్యాట్ ను నేలకేసి కొట్టాడు. ఈ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్నింగ్స్ చివరి బంతికి తాను సింగిల్ మాత్రమే తీయగలిగానన్న అసహనంతో బాబర్ ఇలా చేశాడు. పెషావర్ చేసిన 156 పరుగులను బౌలర్లు కాపాడలేకపోయారు.
అయితే మ్యాచ్ తర్వాత తాను హసన్ తో వ్యవహరించిన తీరుపై బాబర్ స్పందించాడు. "నేను అతనితో పెద్దగా ఏమీ మాట్లాడలేదు. అతడు మళ్లీ క్రికెట్ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. దీంతో అతనితో పోటీ పడాలని భావించాను. కొంతకాలంగా ఫామ్ లో లేడు. కానీ ఇవాళ అతడు బౌలింగ్ చేసిన తీరు చూస్తుంటే మళ్లీ రిథమ్ లోకి వచ్చినట్లే కనిపిస్తున్నాడు. అతన్ని మాటలతో కాస్త ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాను. కానీ అది పని చేయలేదు" అని బాబర్ చెప్పడం విశేషం.
సంబంధిత కథనం