Asian Games Hockey: బంగ్లాదేశ్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా.. గోల్స్ వర్షం-asian games hockey india beat bangladesh get ready for semifinal ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Asian Games Hockey India Beat Bangladesh Get Ready For Semifinal

Asian Games Hockey: బంగ్లాదేశ్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా.. గోల్స్ వర్షం

Hari Prasad S HT Telugu
Oct 02, 2023 03:52 PM IST

Asian Games Hockey: బంగ్లాదేశ్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది టీమిండియా. గోల్స్ వర్షం కురిపిస్తూ ఏకంగా 12-0తో గెలిచి ఏషియన్ గేమ్స్ లో సెమీఫైనల్ కు సిద్ధమైంది.

ఏషియన్ గేమ్స్ చివరి లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన తర్వాత టీమిండియా
ఏషియన్ గేమ్స్ చివరి లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన తర్వాత టీమిండియా (PTI)

Asian Games Hockey: ఏషియన్ గేమ్స్ 2023లో ఇండియన్ హాకీ టీమ్ చెలరేగిపోతోంది. మరో భారీ విజయంతో సెమీఫైనల్ స్టేజ్ కు సిద్ధమైంది. బంగ్లాదేశ్ తో సోమవారం (అక్టోబర్ 2) జరిగిన మ్యాచ్ లో ఏకంగా 12-0తో గెలవడం విశేషం. అంతేకాదు హర్మన్‌ప్రీత్ సింగ్, మణ్‌దీప్ సింగ్ ఇద్దరూ హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేయడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

బంగ్లాదేశ్ తో మ్యాచ్ కు ఇండియన్ టీమ్ చాలా ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టింది. ఇప్పటికే ఏషియన్ గేమ్స్ లో పాకిస్థాన్ ను 10-2తో, ఉజ్బెకిస్థాన్ ను 16-0తో, సింగపూర్ ను 16-1తో, జపాన్ ను 4-2తో ఓడించడం విశేషం. ఇది టీమిండియాకు వరుసగా ఐదో విజయం. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లోనూ మొదటి నుంచే ఇండియా దూకుడుగా ఆడింది.

హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేశాడు. ఆ వెంటనే మణ్‌దీప్ సింగ్ కూడా గోల్ చేయడంతో తొలి క్వార్టర్ లోనే ఇండియా 3-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. రెండో క్వార్టర్ ప్రారంభంలోనే లలిత్ కుమార్ గోల్ చేయడంతో ఈ లీడ్ 4-0కు చేరింది. ఆ తర్వాత మణ్‌దీప్ సింగ్ మరో గోల్ చేశాడు. ఇక అమిత్ రోహన్‌దాస్ గోల్ 6-0తో ఫస్ట్ హాఫ్ ను ఇండియా ముగించింది.

మూడో క్వార్టర్ లోనూ ఇండియా అంతే దూకుడుగా ఆడింది. హర్మన్‌ప్రీత్ తన మూడో గోల్ తో ఇండియా ఆధిక్యం 7-0కు చేరింది. ఆ తర్వాత అభిషేక్ కూడా ఓ కళ్లు చెదిరే గోల్ చేయడంతో మూడో క్వార్టర్ ముగిసే సమయానికి ఇండియా 8-0తో నిలిచింది. ఇక చివరి క్వార్టర్ లో మరింత చెలరేగి ఏకంగా నాలుగు గోల్స్ చేశారు.

చివరి క్వార్టర్ లో మణ్‌దీప్ సింగ్ తన మూడో గోల్ చేశాడు. నీలకంఠ శర్మ చేసిన గోల్ తో ఇండియా గోల్స్ సంఖ్య 10కి చేరింది. ఆ తర్వాత సుమిత్, అభిషేక్ కూడా గోల్స్ చేయడంతో ఇండియా 12-0తో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ తో కలిసి ఐదు మ్యాచ్ లలో ఇండియా ఏకంగా 58 గోల్స్ చేయడం విశేషం. గ్రూప్ స్టేజ్ ముగియడంతో బుధవారం (అక్టోబర్ 4) పూల్ బి రన్నరప్ తో ఇండియా సెమీఫైనల్ ఆడుతుంది.

WhatsApp channel