Kohli in Top 5 Batters List: ఆకాశ్ చోప్రా టాప్-5 బ్యాటర్ల జాబితాలో కోహ్లీ.. బాబర్‌కు నో ఛాన్స్
Kohli in Top 5 Batters List: టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఈ ఏడాది టీ20ల్లో మేటీగా ఆడిన టాప్-5 బ్యాటర్ల జాబితాను సిద్ధం చేశాడు. అందులో విరాట్ కోహ్లీకి కూడా చోటు కల్పించాడు. అతడు నమ్మశక్యంకానీ రీతిలో ఆడాడని స్పష్టం చేశాడు.
Kohli in Top 5 Batters List: గత రెండు, మూడేళ్లుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ.. అనూహ్యంగా ఈ ఏడాది మాత్రం పుంజుకున్నాడు. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేయడమే కాకుండా.. పాత కోహ్లీని గుర్తు చేశాడు. ఈ సంవత్సరం జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించిన కోహ్లీ.. ఆ టోర్నీలో నాలుగు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. అంతటితో ఆగకుండా ఈ ఏడాది పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గానూ, వన్డేల్లో ఆరో స్థానంలోనూ నిలిచాడు. దీంతో సర్వత్రా అతడిపై ప్రశంసల వర్షం కురిసింది. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా కోహ్లీ పొగడ్తలను కురిపించాడు. ఈ ఏడాది అత్యుత్తమ బ్యాటర్ల జాబితాలో అతడికి స్థానం కల్పించాడు.
"ఈ లిస్టులో కోహ్లీ స్థానం దక్కించుకుంటాడని ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు. గత కొన్నేళ్లుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడిన అతడు ఈ ఏడాది చివర్లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లో కూడా విఫలమైన కోహ్లీ.. ఇటీవల కాలంలో మెరుగైన ప్రదర్శన చేశాడు. టీ20ల్లో ఈ ఏడాది అతడు 20 మ్యాచ్‌లు ఆడి 55.78 సగటుతో 781 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్ కప్‍లోనూ రాణించాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు." అని ఆకాశ్ చోప్రా తెలిపాడు.
ఈ ఏడాదికి తను పొందుపరిచిన అత్యుత్తమ బ్యాటర్ల జాబితాలో ఆకాశ్ చోప్రా బాబర్ ఆజంకు చోటు కల్పించలేదు. టీ20ల్లో ప్రదర్శన, 2022లో ఆటగాళ్ల గణాంకాలను బట్టి ఈ లిస్టును తయారు చేశాడు. అందులో సూర్యకుమార్ యాదవ్(భారత్), మహమ్మద్ రిజ్వాన్(పాకిస్థాన్), విరాట్ కోహ్లీ(భారత్), సికిందర్ రజా(జింబాబ్వే), డేవాన్ కాన్వే(న్యూజిలాండ్) టాప్-5లో స్థానాన్ని కల్పించాడు.
"బాబార్ ఆజంకు నా జాబితాలో చోటు కల్పించలేదు. అతడు 26 మ్యాచ్‌ల్లో 32 సగటుతో కేవలం 735 పరుగులే చేశాడు. స్ట్రైక్ రేటు కూడా 123నే ఉంది. కాబట్టి అతడిని నా జట్టులో తీసుకోలేదు. అతడి స్థానంలో డేవాన్ కాన్వేకు చోటిచ్చాను. ఈ ఏడాది టీ20ల్లో డేవాన్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. అతడు ఎక్కువ మ్యాచ్‌లు ఆడి ఉన్నట్లయితే.. సూర్యకుమార్ యాదవ్‌ను కూడా అధిగమించి అగ్రస్థానంలో ఉండేవాడు." అని స్పష్టం చేశాడు.
ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీకి త్వరలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు కల్పించలేదు. అయితే వన్డేల్లో మాత్రం తీసుకున్నారు. జనవరి 3 నుంచి 7 వరకు భారత్-శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుండగా.. జనవరి 10 నుంచి 15 వరకు మూడు వన్డేల సిరీస్ జరగనుంది.
సంబంధిత కథనం