IPL Auction 2023: బెన్ స్టోక్స్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాదే గట్టిగా ప్రయత్నిస్తుంది: ఆకాశ్ చోప్రా
IPL Auction 2023: బెన్ స్టోక్స్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాదే గట్టిగా ప్రయత్నిస్తుందని అన్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. ఐపీఎల్ 2023 సీజన్ కోసం శుక్రవారం (డిసెంబర్ 23) మినీ వేలం జరగనున్న విషయం తెలిసిందే.
IPL Auction 2023: ఐపీఎల్ 2023 మినీ వేలానికి సమయం దగ్గర పడింది. ఈ ఏడాది మొదట్లో జరిగిన మెగా వేలంతో పోలిస్తే ఇది చిన్నదే అయినా కీలకమైన విదేశీ ప్లేయర్స్ లిస్ట్‌లో ఉండటంతో ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా ఇంగ్లండ్ టీమ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ వేలంలో స్టార్ అట్రాక్షన్. అంతేకాదు అతడే అత్యధిక ధర పలికే ప్లేయర్‌గా రికార్డు సృష్టించే అవకాశం కూడా ఉంది.
ఈ ఆల్‌రౌండర్ కమ్ కెప్టెన్ కోసం ప్రధానంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అంచనా వేస్తున్నాడు. బెన్ స్టోక్స్ రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలో పాల్గొంటున్నాడు. కచ్చితంగా ఇలాంటి ప్లేయర్ కోసమే సన్‌రైజర్స్ చూస్తుండటంతో స్టోక్స్ కోసం ఆ ఫ్రాంఛైజీ వేలంలో గట్టిగానే పోటీ పడనుందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
అంతేకాదు అతడు ఐపీఎల్ 2023లో మూడో అత్యధిక ధర పలికే ఆటగాడిగా నిలుస్తాడని చోప్రా అంచనా వేశాడు. "చెన్నై సూపర్ కింగ్స్ లేదంటే పంజాబ్ కింగ్స్ లాంటి టీమ్స్ బెన్ స్టోక్స్ కోసం ప్రయత్నిస్తాయని అనుకోవడం లేదు. ఒకవేళ రూ.8-10 కోట్ల ధరలో దక్కితే ముంబై ఇండియన్స్ అతన్ని కొనుగోలు చేయొచ్చు" అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పాడు.
ఈ ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కెప్టెన్‌గా ఉన్న కేన్ విలియమ్సన్‌తోపాటు నికొలస్ పూరన్‌లాంటి వాళ్లను రిలీజ్ చేసేసింది. దీంతో ఆ టీమ్‌కు బెన్ స్టోక్స్‌లాంటి ప్లేయర్ అవసరం ఎంతైనా ఉంది. స్టోక్స్ టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయగలడు. పైగా మంచి కెప్టెన్సీ మెటీరియల్ కూడా. ఇంగ్లండ్‌ను టెస్టుల్లో విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు.
"వేలంలో స్టోక్స్ మూడో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓ టాపార్డర్ బ్యాటర్, కెప్టెన్ కావాలి కాబట్టి.. వాళ్లు అతని కోసం ప్రధానంగా పోటీలో ఉంటారు. ఇక సరైన ఆల్‌రౌండర్ దొరక్కపోతే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా స్టోక్స్ కోసం ప్రయత్నించవచ్చు" అని ఆకాశ్ చోప్రా చెప్పాడు. ఇక ఈ వేలంలో స్టోక్స్‌తోపాటు సామ్ కరన్, కేన్ విలియమ్సన్, నికొలస్ పూరన్, కామెరాన్ గ్రీన్‌లాంటి వాళ్లు కూడా భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉంది.
టాపిక్