Flowers: సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకూడదు అంటారు ఎందుకో తెలుసా?-why not plucking flowers after sunset what is the reason behind this ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Flowers: సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకూడదు అంటారు ఎందుకో తెలుసా?

Flowers: సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకూడదు అంటారు ఎందుకో తెలుసా?

Gunti Soundarya HT Telugu
Oct 15, 2024 11:00 AM IST

Flowers: పూలు లేకుండా పూజ అసంపూర్ణంగా ఉంటుంది. దేవతలు, దేవుళ్ళకు ఇష్టమైన పూలు సమర్పించడం వల్ల వారి అనుగ్రహం లభిస్తుంది. అయితే సూర్యాస్తమయం తర్వాత మాత్రం పూలు కోయకూడదు అంటారు. ఎందుకో తెలుసా?

సాయంత్రం వేళ పూలు ఎందుకు కోయకూడదు?
సాయంత్రం వేళ పూలు ఎందుకు కోయకూడదు? (pixabay)

హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం పూలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దేవతలు, దేవుళ్ళను ప్రసన్నం చేసుకునేందుకు పూలు సమర్పిస్తారు. రంగు రంగుల ప్రకాశవంతమైన పూలు స్వచ్చంగా, పవిత్రమైనవిగా భావిస్తారు. పూలు లేకుండా ఏ పూజ పూర్తి కాదు.

ఉదయం, సాయంత్రం పూజలో పూలు సమర్పించి దేవుడి ఆశీస్సులు కోరుకుంటారు. ఇవి నైవేద్యాలలో కూడా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటాయి. దేవుళ్ళు, దేవతల విగ్రహాలను అలంకరించేందుకు పూలు ఉపయోగిస్తారు. హిందూ మతంలో మల్లె, గులాబీ, తామర, బంతి పువ్వులు వంటివి ఆలయ నైవేద్యాలలో ఉపయోగిస్తారు. వాటిలో కొన్ని దేవుళ్ళకు సమర్పిస్తారు. ప్రతి ఒక్కర్ దేవుడికి ఒక్కో రకం పూలు ఇష్టపడతారు. పొద్దున్నే పూజ చేసేందుకు పూలు కొస్తారు. కానీ సాయంత్రం వేళ మాత్రం పూలు కోయడం మంచిది కాదని అంటారు. సూర్యాస్తమయం తర్వాత పూలు ఎందుకు కోయకూడదు అంటారో తెలుసుకుందాం.

మనిషి మాదిరిగానే పూలకు కూడా నిద్రచక్రం ఉంటుంది. సాయంత్రం పూట పూలు తీయడం వల్ల వాటి నిద్రకు భంగం వాటిల్లుతుంది. మొక్కల విశ్రాంతి డస దెబ్బతింటుంది. మొక్కలు పగటి పూట కిరణజన్య సంయోగక్రియలో పాల్గొంటాయి. ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తాయి. సూర్యాస్తమయం వచ్చే సరికి వాటి కార్యకలాపాలు మందగిస్తాయి. ఎందుకంటే మొక్కలు నిద్రించే సమయంలో వాటిని కదిలించడం మంచిది కాదని నమ్ముతారు.

దేవతలు ఉంటారు

పువ్వులు, మొక్కలలో దేవతలు నివసిస్తారని నమ్ముతారు. లక్ష్మీ దేవి తామర పువ్వు మీద కూర్చుంటుందని అందరికీ తెలిసిందే. కాళీకా దేవికి ప్రకాశవంతమైన మందార పువ్వులు అంటే చాలా ఇష్టం బంతి పువ్వులు ప్రతి దేవుడు, దేవతకు సమర్పిస్తారు. పూజలో బంతి పూలు లేకపోతే అలంకరణ అందంగానే అనిపించదు. ఎన్ని ఉన్నా ఒక్క బంతి పువ్వు పెట్టినా చాలు నిండుదనం వస్తుంది. అందుకే సాయంత్రం పూలు కోయడం దేవతలకు, మొక్కలలోని దైవిక శక్తికి భంగం కలిగిస్తుందని భావిస్తారు.

శాస్త్రీయ కోణం కూడా

సంధ్యా వేళ పూలు కోయకూడదు అనే దాని వెనుక శాస్త్రీయ కోణం కూడా ఉంటుంది. సాయంత్రం, రాత్రి వేళ మొక్కలు కిరణజన్య సంయోగక్రియ నుంచి శ్వాసక్రియకు మారే కాలం. పగటి పూట కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. కానీ సాయంత్రం అవి కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తాయి. అందుకే సాయంత్రం పూలు తీస్తే వాటి ప్రక్రియ దెబ్బతింటుంది. అది మొక్కల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

రాత్రిపూట వికసించే పూలు చాలా సువాసనతో ఉంటాయి. వాటిలోని తేనె, పుప్పొడి కోసం అనేక రకాల కీటకాలు వస్తాయి. రాత్రి వేళ పూల మీద ఉన్న కీటకాలు కంటికి కనిపించవు. సాయంత్రం వేళ పూలు తెంపడం వల్ల వాటిలోని కీటకాలు మనల్ని కుట్టవచ్చు. అవి ఒక్కోసారి ప్రమాదకరమైన కీటకాలు అయితే అవి మనకు మరింత హాని చేస్తాయి. అందుకే వాటిని సూర్యాస్తమయం తర్వాత కోయడం మంచిది కాదని చెప్తారు. ఇలా ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా సాయంత్రం పూలు కోయకూడదు అనేందుకు అనేక కారణాలు ఉన్నాయి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner