Tulasi plant: తులసి మొక్క దగ్గర సాయంత్రం వేళ దీపం ఎందుకు వెలిగించాలి? దీని వెనుక ఉన్న కథ ఏంటి?-why light a lamp near the tulsi plant in the evening what is the story behind this ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Tulasi Plant: తులసి మొక్క దగ్గర సాయంత్రం వేళ దీపం ఎందుకు వెలిగించాలి? దీని వెనుక ఉన్న కథ ఏంటి?

Tulasi plant: తులసి మొక్క దగ్గర సాయంత్రం వేళ దీపం ఎందుకు వెలిగించాలి? దీని వెనుక ఉన్న కథ ఏంటి?

Gunti Soundarya HT Telugu
Jun 22, 2024 10:09 AM IST

Tulasi plant: తులసి కోట దగ్గర చాలా మంది ఉదయం, సాయంత్రం దీపం వెలిగిస్తారు. అలా చేయడం వెనుక పురాణాల ప్రకారం ఒక కథ ఉంది. అది ఏంటో తెలుసా? ఇలా చేయడం వెనుక ఉన్న అర్థం ఏమిటో తెలుసుకుందాం.

తులసి మొక్క దగ్గర దీపం ఎందుకు వెలిగిస్తారు?
తులసి మొక్క దగ్గర దీపం ఎందుకు వెలిగిస్తారు?

Tulasi plant: హిందువులకు అత్యంత పవిత్రమైనది తులసి మొక్క. ఇది స్వచ్ఛతకు ప్రతిరూపం. భక్తి, జ్ఞానోదయానికి చిహ్నం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తులసి కోట దగ్గర పూజ చేసి చాలా మంది దీపం వెలిగిస్తారు. ఇది పరిసరాలను శుద్ధి చేస్తుందని, కుటుంబానికి దైవిక ఆశీర్వాదాలను ఇస్తుందని నమ్ముతారు. అయితే తులసి మొక్క దగ్గర సాయంత్రం వేళ దీపం ఎందుకు వెలిగించడం వెనుక పురాణాల ప్రకారం ఒక కథ ఉంది.

తులసి లక్ష్మీ దేవత స్వరూపంగా భావిస్తారు. శ్రీ మహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది. తులసి ప్రాముఖ్యత గురించి అనేక గ్రంథాలు, కథలలో పేర్కొన్నారు. స్కంద పురాణం ప్రకారం తులసి మొక్క నాటి దాని దగ్గర దీపం వెలిగించడం, మొక్కను సంరక్షించడం, పూజించడం వల్ల అన్ని పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. మోక్షం పొందుతారు. అలాగే పద్మ పురాణం కూడా తులసి మొక్కను ఎలా పూజించాలి? దీని వల్ల కలిగే ఫలితాల గురించి వివరించింది. తులసి మొక్కను పూజించడం వల్ల పితృదేవతలకు విముక్తి లభిస్తుందని కూడా చెబుతారు.

సాయంత్రం దీపం ఎందుకు పెడతారు?

తులసి మొక్క దగ్గర సాయంత్రం వేళ దీపం వెలిగించడం వెనుక ఒక కారణం ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక రుషిని వివాహం చేసుకున్న ఒక స్త్రీ తన సొంత చర్యల వల్ల అపవిత్రురాలిగా మిగిలిపోయింది. ఆమె ప్రవర్తన, మర్యాద భర్తకి ఎప్పటికీ నచ్చలేదు. దీంతో ఆమె అడవుల పాలైంది. విపరీతమైన అనారోగ్యానికి గురైంది. ఆమెను చూసుకోవడానికి ఎవరూ లేరు. అలాంటప్పుడు ఆ అమ్మాయి ఇద్దరు స్త్రీలతో కలిసి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది.

ఆమె అక్కడ నివసించేటప్పుడు ఇతర స్త్రీలు అనుసరించే ఏ ఆచారాలలోనూ పాల్గొనలేదు. కానీ ఒకరోజు కొంతమంది అమ్మాయిలు తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తూ ప్రార్థించడం చూసింది. ఆపై సాయంత్రం వేళ ఆమె కూడా అదే పని చేసింది. తులసి మొక్క దగ్గర దీపం పెట్టింది. దురదృష్టవశాత్తు అదే రోజు ఆమె అనారోగ్య సమస్యలతో మరణించింది. ఆమెను తీసుకువెళ్లేందుకు యమభటులు వస్తే ఆమె నరకానికి వెళ్ళదని వైకుంఠానికి వస్తుందని చెబుతారు. అందుకు కారణం ఆమె మహా విష్ణువుకి ఎంతో ప్రీతికరమైన తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించడం వల్ల ఆమె సర్వ పాపాలు తొలగిపోయి స్వర్గలోకానికి ప్రవేశం లభించిందని చెప్తారు. అందుకే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం మంచిదని అంటారు.

దీపం ప్రాముఖ్యత

హిందూ ఆచారాల ప్రకారం దీపం వెలిగించడం ఒక ముఖ్యమైన ఆచారం. చీకటిపై కాంతి, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి విజయానికి చిహ్నంగా దీపాన్ని వెలిగిస్తారు. అంటే చీకటి అజ్ఞానంతో నిండిన ప్రదేశంలో వెలుగును తీసుకురావడం ఉద్దేశంగా దీపాన్ని వెలిగిస్తారు. ఇది దైవానికి నైవేద్యం లాంటిది. ఎలాంటి ప్రతికూల శక్తులను మన చుట్టూ చేరకుండా కాపాడుతుంది. తులసి మొక్క దగ్గర దీపం వెలిగించిన వ్యక్తి తన పూర్వ పాపాల నుంచి విముక్తుడు అవుతాడు. విష్ణు నివాసమైన వైకుంఠంలోకి చేరుకుంటాడు.

అలాగే ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి నోట్లో కుటుంబ సభ్యులు ఒకటి లేదా రెండు తులసి ఆకులు ఉంచుతారు. ఇలా చేయడం వల్ల మరణించిన వ్యక్తి స్వర్గానికి చేరుకునేందుకు సహాయపడుతుందని నమ్ముతారు. ఆత్మ మోక్షాన్ని పొంది విష్ణు నివాసానికి చేరుకునేందుకు ఇది సహాయపడుతుందని విశ్వసిస్తారు. తులసి పవిత్రమైనది. ఆత్మను శుద్ధి చేస్తుందనే నమ్మకం ఉంటుంది. ఆత్మ విముక్తి ప్రయాణంలో ఇది సహాయపడుతుంది.

తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల ప్రయోజనాలు

తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఆశీర్వాదాలు లభిస్తాయి. సంపద, శ్రేయస్సు దేవతగా భావించే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే ఇల్లు సమృద్ధిగా ఉంటుంది. అలాగే విష్ణుమూర్తి సంరక్షకుడుగా కుటుంబాన్ని కాపాడుతూ వస్తాడు. తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించలేవు. ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. శక్తివంతమైన ప్రకాశాన్ని, ఆధ్యాత్మిక స్వచ్ఛతను సృష్టిస్తుందని నమ్ముతారు. దీపం వెలిగించడం వల్ల శాంతి, ఆరోగ్యం, ఆధ్యాత్మిక స్వచ్ఛత లభిస్తుందని సానుకూల శక్తులను ఆహ్వానిస్తుందని నమ్ముతారు.

WhatsApp channel