Diwali: దీపావళి రోజు లక్ష్మీ, వినాయకుడిని పూజించడం వెనుక ఉన్న ఈ కథ మీకు తెలుసా?-why goddess lakshmi and lord vinayaka worshipped together on diwali festival ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Diwali: దీపావళి రోజు లక్ష్మీ, వినాయకుడిని పూజించడం వెనుక ఉన్న ఈ కథ మీకు తెలుసా?

Diwali: దీపావళి రోజు లక్ష్మీ, వినాయకుడిని పూజించడం వెనుక ఉన్న ఈ కథ మీకు తెలుసా?

Gunti Soundarya HT Telugu
Oct 29, 2024 06:00 PM IST

Diwali: దీపావళి రోజు లక్ష్మీదేవి, వినాయకుడికి కలిపి పూజ చేస్తారు. ఈ రెండు విగ్రహాలను పక్క పక్కన పెట్టి పూజిస్తారు. అది దీపావళి రోజు వీరిద్దరినీ పూజించడం వెనుక ఒక చిన్న కథ ప్రాచుర్యంలో ఉంది. అదేంటో మీకు తెలుసా?

దీపావళి పూజ
దీపావళి పూజ (pinterest)

దీపావళి రోజు ప్రదోష కాలంలో ప్రజలు గృహాలు, కార్యాలయాలు, దుకాణాలలో లక్ష్మీ, గణేష పూజ నిర్వహిస్తారు. సాధారణంగా విష్ణుమూర్తితో కలిసి లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. కానీ దీపావళి రోజు మాత్రం వినాయకుడితో కలిపి పూజ చేస్తారు. ఇలా పూజించడం పురాణాల ప్రకారం ఒక చిన్న కథ ప్రాచుర్యంలో ఉంది.

లక్ష్మీదేవి గర్వం 

సంపద, సంతోషం, శ్రేయస్సు, ఆనందం, సంతానం, సౌభాగ్యం వంటి అనేక వాటికి ప్రతీకగా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఒకనాడు వైకుంఠంలో విష్ణువు, లక్ష్మీదేవి మధ్య దీని గురించి మాటలు వచ్చాయి. అప్పుడు తాను సంపదకు అధిదేవతను అంటూ లక్ష్మీదేవి గర్వం వ్యక్తం చేసింది. 'సంపద, శ్రేయస్సు, అదృష్టం, సమృద్ధిని ప్రసాదిస్తాను. నా దీవెనలు భక్తులకు అన్ని రకాల ఆనందాలను అందిస్తాయి’ అని పొగరుగా మాట్లాడిందట. దీంతో ఆమె గర్వాన్ని పసిగట్టిన విష్ణుమూర్తి తనకు బుద్ధి వచ్చేలా చేయాలని అనుకున్నారు. అవును కానీ ఎన్ని ఉన్నా ఏం ప్రయోజనం నిజమైన స్త్రీ అంటే మాతృత్వంతో నిండిన ఆనందం మాత్రమే వస్తుంది. నీకు అది లేదు కదా అని అన్నాడట.

లక్ష్మీదేవి విష్ణుమూర్తి మాటలకు దుఃఖించి పార్వతీ దేవితో తన బాధను పంచుకుంది. అప్పుడే పార్వతీ దేవి తన కుమారుడైన గణేశుడిని లక్ష్మీదేవికి దత్తపుత్రుడిగా ఇచ్చింది. దీంతో లక్ష్మీదేవి చాలా సంతోషించింది. అప్పటి నుంచి వినాయకుడికి లక్ష్మీదేవి మాతృమూర్తిగా మారింది. 

భక్తులు సంపద, విజయం, శ్రేయస్సును పొందటం కోసం లక్ష్మీదేవితో పాటు వినాయకుడిని పక్కన పెట్టి పూజించడం చేస్తారు. అలా దీపావళి రోజు లక్ష్మీ వినాయక పూజ చేయడం ఆనవాయితీగా వచ్చింది. లక్ష్మీదేవి సంపద దేవత, వినాయకుడు జ్ఞానం, తెలివికి దేవుడు. వీరిద్దరి ఆశీస్సులు కోరుతూ దీపావళి రోజు పూజ చేస్తారు. దీని వల్ల సంపద, జ్ఞానం రెండూ లభిస్తాయని భక్తుల విశ్వాసం.

లక్ష్మీదేవిని ఎలా పూజించాలి?

లక్ష్మీదేవికి నెయ్యి దీపం వెలిగించి పూజ చేస్తారు. 11, 21, 51 ఇలా దీపాలు వెలిగిస్తారు. అమ్మవారి ఆశీర్వాదాలు కోరుకుంటూ లక్ష్మీదేవి మంత్రాలు జపిస్తారు. దీపావళి రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు ఇది అత్యంత శక్తివంతమైన మార్గం. అలాగే పూజలో ఖీర్ నైవేద్యంగా సమర్పిస్తారు. లక్ష్మీదేవికి పాలతో చేసిన ఖీర్ అంటే మహా ఇష్టం.

దీపావళి రోజున అమ్మవారి ఆశీస్సులు పొందాలంటే భక్తులు తప్పనిసరిగా 11 తామర పువ్వులను అమ్మవారికి సమర్పించాలి. ఇది అమ్మవారికి అత్యంత ఇష్టమైన పుష్పం. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవాలంటే లక్ష్మీ స్తోత్రాన్ని పఠించాలి. 108 కమలగట్టను అమ్మవారికి సమర్పించాలి. కమలగట్ట అనేది కమలం విత్తనాలు. అలాగే పూజలో భాగంగా లక్ష్మీదేవికి సంబంధించిన ఈ కింద మంత్రాలు పఠించాలి.

మంత్రాలు

1. ఓం శ్రీం మహా లక్ష్మీయే నమః..!!

2. ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః..!!

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner