Ghee diya: మీరు ఇంట్లో ఈ దీపం వెలిగించారంటే ఐశ్వర్యం, ఆరోగ్యం సిద్ధిస్తాయి
Ghee diya: దీపం ఇంటికి కాంతిని ఇవ్వడమే కాదు అనేక చెడు శక్తులను బయటకు తరిమేస్తుంది. సనాతన ధర్మంలో అనేక రకాల దీపాల గురించి ప్రస్తావించారు. ఇల్లు సుఖశాంతులతో, ఐశ్వర్యంతో నిండిపోవాలంటే ప్రతిరోజు నెయ్యి దీపం వెలిగించడం శ్రేయస్కరం. ఈ దీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
దీపం సకల దేవతల స్వరూపంగా భావిస్తారు. అందుకే ప్రతి రోజు ఉదయం, సాయంత్రం దీపం వెలిగిస్తారు. హిందూ మతంలో దీపానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. దీపం మనల్ని చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తుందని అంటారు. శాంతి, కాంతి, వైద్యం, మంచి సంతానం వంటి అనేక సందేశాలని ఇస్తుంది.
శ్రావ్యమైన వాతావరణాన్ని సృష్టించేందుకు, గాలిని శుద్ది చేసేందుకు దీపాలు వెలిగిస్తారు. దీపం అగ్ని ద్వారా శరీరం, మనసు రెండూ రీఫ్రెష్ అవుతాయి. దీపం వెలుగుతున్న ఇంట్లో సానుకూల శక్తి నిత్యం ప్రసరిస్తుందని విశ్వసిస్తారు. దీపం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థానం సుస్థిరంగా ఉంటుందని నమ్ముతారు. ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన దీపం వెలిగిస్తారు. తమ కోరికలను బట్టి దీపంలో ఉపయోగించే నూనె ఉంటుంది.
దీపం ప్రాముఖ్యత
తులసి ముందు నెయ్యి దీపం వెలిగిస్తారు. విజయాలని ఇవ్వమని కోరుకుంటూ పరమేశ్వరుడికి ఆవు నెయ్యి దీపం వెలిగిస్తారు. వినాయకుడి పూజకు కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిదని సకల విఘ్నాలు తొలగిపోతాయని భావిస్తారు. అలాగే వేరుశెనగ నూనె దీపారాధనకు పొరపాటున కూడా వినియోగించకూడదు. నువ్వుల నూనె దీపం సకల దేవతలకు ప్రీతికరమైనది. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఆరోగ్యం, సుఖ సంతోషాలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్ముతారు.
అగ్ని పురాణం ప్రకారం నెయ్యి దీపాలు అత్యంత శ్రేష్టమైనవి. సనాతన ధర్మం ప్రకారం ఇంట్లో నెయ్యి దీపం వెలిగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నెయ్యి దీపం వెలిగిస్తే ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం.
నెయ్యి దీపం వెలిగించడం వల్ల లాభాలు
దీపాలకు తమ చుట్టూ ఉన్న గాలి నుంచి సాత్విక ప్రకంపనలు వచ్చే శక్తి ఉంటుంది. అందుకే దీపం కొండెక్కినప్పటికీ దాని సానుకూల శక్తి ప్రభావం ఇంటి మొత్తం వ్యాపిస్తుంది. దీపం అనేది ఇంటికి పురుగు మందులా పని చేస్తుంది. వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్ ల సంఖ్య తగ్గిస్తుంది. గాలిని శుద్ధి చేస్తుంది. గాలి నాణ్యత మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక భావన ప్రస్పుటిస్తుంది. ఏ ఇంట్లో అయితే నిత్యం నెయ్యి దీపం వెలుగుతుందో ఆక్కడ ఐశ్వర్యం, మంచి ఆరోగ్యం ఉంటాయి.
సూర్యోదయం, సంధ్యా సమయంలో దీపాలు వెలిగించినప్పుడు పర్యావరణం, ఇంట్లోని వారికి చక్కగా ఆరోగ్యాన్ని ఇస్తుంది. నెయ్యి దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరతాయి. భక్తుడి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరతాయి. ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది. మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది. మానసిక స్పష్టతను పెంపొందిస్తుంది. దీని నుంచి వచ్చే సువాసన మెదడును ప్రశాంత పరుస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తుంది. ప్రతికూలతను తిప్పికొట్టి సానుకూలతను స్వాగతిస్తుంది.
శాస్త్రం ప్రకారం నెయ్యి దీపం దేవుడికి ఎటువైపు వెలిగించాలి అనే విషయం తప్పనిసరిగా తెలుసుకోవాలి. నెయ్యి దీపం అయితే దేవుడికి కుడి వైపు వెలిగించాలి. అదే నూనె దీపం అయితే మాత్రం ఎడమ వైపు వెలిగించాలి. నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని వ్యాధులు దూరమవుతాయి. అనేక వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి లభిస్తాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.