శ్రీకూర్మం ఆలయం ఎక్కడ ఉంది? కూర్మనాథుడి కథ ఏంటి? ఈ క్షేత్ర మహత్యం ఏంటి?
శ్రీకూర్మం ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ చరిత్ర, విశిష్టత ఏంటి? అనే వివరాల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా తెలియజేశారు.
శ్రీ మహా విష్ణువు దశావతారాల్లో రెండో అవతారమైనటువంటి శ్రీకూర్మ అవతారం చాలా విశిష్టమైనదని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఈ సుప్రసిద్ధ క్షేత్రం ఉందని చిలకమర్తి తెలిపారు. 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైనటువంటి ఈ క్షేత్రానికి రామానుజాచార్యులు విచ్చేసి అనంత వర్మ చోడ గంగదేవా అనే కళింగ రాజు సహాయముతో ఆయన శ్రీకూర్మ ఆలయాన్ని పునరుద్ధరణ చేసినట్టుగా చిలకమర్తి తెలిపారు.
ఒరిస్సా ప్రాంతంలో ఉన్న గజపతి రాజులు ఈ ఆలయాన్ని ఉద్ధరించి, కూర్మావతారంలో ఉన్న మహావిష్ణువుని పూజించారని చిలకమర్తి తెలిపారు. భారతదేశంలో కూర్మావతారానికి, కూర్మరూపానికి సంబంధించిన ఏకైక ఆలయం శ్రీకూర్మం అని చిలకమర్తి తెలిపారు. ఈ ఆలయంలో వెలసిన దైవం పేరు కూర్మనాథ స్వామిగా, ఈ ఆలయంలో ఉన్న పుష్కరిణి శ్వేత పుష్కరిణిగా చెప్పబడింది.
ఈ ఆలయ చరిత్ర ప్రకారం దక్షిణ సముద్రతీరమున శ్వేతపురమనే పట్టణం కలదు. ఆ పట్టణాన్ని శ్వేత చక్రవర్తి పరిపాలించేవాడు. ఆయనకు విష్ణు ప్రియ అనే భార్య ఉండేది. ఆమె పరమ విష్ణు భక్తురాలు. ఆమె ఒకనాడు ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా శ్వేత చక్రవర్తి కామవాంఛతో ఆమె వద్దకు వెళ్లెను. ఏం చేయాలో పాలుపోని విష్ణుప్రియ భర్తను ఆత్మీయంగా ఆహ్వానించి పూజా మందిరంలోకి వెళ్లి విష్ణువును భక్తితో ధ్యానించింది.
'స్వామీ.. కూర్మ రూపంలో ఈ జగత్తు భారాన్ని నువ్వే మోశావు. నా మీద పడిన ఈ భారాన్ని నువ్వే తొలగించాలిస అని కోరగా శ్రీ మహా విష్ణువు గంగాదేవిని ఉద్భవింప చేసెను. ఆ గంగను చూసి భయపడిన రాజు పర్వతం మీదకు పారిపోయెను. మంత్రుల ద్వారా తన తప్పు తెలుసుకున్న శ్వేత చక్రవర్తి తన పాపానికి ప్రాయశ్చితము తలచి మహా విష్ణువును ధ్యానించెను. అక్కడికి వచ్చిన నారదుడు రాజును ఓదార్చి శ్రీకూర్మ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రానుసారం చేత గంగా ప్రవాహం తగ్గి.. ఆ నది వంశధార పేరుతో సాగరంలో లీనమయ్యెను.
ఆ నదిలో స్నానమాచరించిన చక్రవర్తి విష్ణు మూర్తి కోసం ఘోర తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన శ్రీ మహా విష్ణువు ఆ వంశధార నది నుంచి కూర్మావతరంలో చక్రతీర్థం గుండా వెలువడి శ్వేత మహారాజుకు దర్శనమిచ్చెను. స్వామివారిని చూసి పరమానందభరితుడైన రాజు.. ఇకపై ఇక్కడే కొలువై ఉండమని స్వామివారిని కోరగా.. శ్రీ మహా విష్ణువు తన చక్రాన్ని ఇచ్చి ఈ చక్రం ఉండే సరైన స్థానం నందు తాను కొలువై ఉంటానని చెప్పెను. ఆ మాట వినిన వెంటనే నారదుడితో కలిసి రాజు ఒక వట వృక్షం వద్దకు వచ్చి ఆ వృక్షంపై చక్ర ప్రయోగం చేసెను. ఆ వృక్షం నుంచి క్షీర సమానమైన జలం ఉద్భవించెను. ఈ జలమునే శ్వేత గుండమని అంటారు.
ఆ చక్రం వెళ్లిన మార్గం నుంచి మహాలక్ష్మి దేవి కూడా ప్రత్యక్షమయ్యెను. ఇలా శ్రీ కూర్మంలో లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువు వెలిసెనని చిలకమర్తి తెలిపారు. మహా భారతం ప్రకారం బలరాముడు శ్రీ కూర్మ క్షేత్రానికి విచ్చేసినట్టుగా అక్కడ ఉమారుద్ర కోటేశ్వరలింగ ప్రతిష్ఠ చేసినట్టుగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయని చిలకమర్తి తెలిపారు.
అక్కడ క్షేత్రపాలకుడైన భైరవుడు బలరాముడిని అడ్డగించాడని.. బలరాముడు కోపంతో భైరవుడిని గిరగిరా తిప్పి విసిరేశాడని, ఇది తెలిసిన కూర్మ నాథుడు బలరాముడికి దర్శనం ఇచ్చాడని, అయినప్పటికీ అవమాన భారం తగ్గక బలరాముడు ఈ ప్రపంచంలో మరో కూర్మ ఆలయం ఉండదని శపించినట్టుగా మహాభారతం తెలియజేస్తుందని చిలకమర్తి తెలిపారు. ఇక్కడ కూర్మనాథునికి అభిషేకం చేస్తే గృహవాస్తు దోషాలు పోతాయని, అలాగే ఇక్కడ పితృదేవతలకు పిండప్రదానం చేస్తే ముక్తి లభిస్తుందని స్థల పురాణం చెబుతోందని చిలకమర్తి తెలిపారు.
ఈ కూర్మావతారం గురించి పద్మాపురాణంలో చెప్పబడిందని చిలకమర్తి తెలిపారు. పురణాల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీర సాగర మథనం చేసిన విషయం తెలిసిందే. పాల సముద్రాన్ని చిలకడం కోసం శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని దాల్చినట్లుగా శాస్త్రాల్లో చెప్పబడిందని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
టాపిక్