Shivalingam: శివలింగాన్ని ఏ పదార్థముతో పూజిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది
Shivalingam: సోమవారం శివునికి అంకితం చేసిన రోజు. శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు అభిషేకం అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఏ పదార్థంతో శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
Shivalingam: శివః అభిషేఖ ప్రియహ పరమేశ్వరుడి అభిషేఖ ప్రియుడు అని శాస్త్రం. అటువంటి శివ అరాధన 21 రకాల అభిషేక పదార్థాలతో ఆచరిస్తారు అని ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఒక్కొక్క పదార్థానికి ఒకొక ఫలము ఉంటుందని చిలకమర్తి తెలిపారు. శివలింగాన్ని ఏ పదార్థముతో పూజిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం.
1. కస్తూరి, చందనంతో చేసిన శివలింగానికి రుద్రాభిషేకం చేస్తే శివసాయుజ్యం లభిస్తుంది.
2. పువ్వులతో శివలింగాన్ని పూజిస్తే భూసంపత్తి కలుగును.
3. యవలు, గోధుమలు, బియ్యం మూడింటి పిండి సమానంగా కలిపి తయారుచేసిన శివలింగార్చన ఆరోగ్యం, సంపద, సంతానాన్ని ఇస్తుంది.
4. పటిక బెల్లంతో చేసిన శివలింగాన్ని పూజిస్తే రోగ నివృత్తి అగును.
5. చక్కెర పాకంతో చేసిన శివలింగం పూజ సుఖశాంతులను ప్రసాదిస్తుంది.
6. వెదురువేళ్ళతో చేసిన శివలింగం పూజిస్తే లక్ష్మీకరం, సుఖం కలుగును.
7. పెరుగును బట్టలో వడబోసి, పిండి, నీరు తీసేశాక శివలింగం తయారుచేసి పూజిస్తే లక్ష్మీకరం, సుఖం కలుగును.
8. బెల్లంకు అన్నం అతుకుబెట్టి దాన్ని శివలింగంగా తయారుచేసి పూజచేస్తే వ్యవసాయ ఉత్పత్తి వృద్ధి చెందుతుంది.
9. ఒక పండును శివలింగంగా భావన చేసి రుద్రాభిషేకం చేస్తే పండ్ల తోటలో అధిక ఉత్పత్తి కలుగుతుంది.
10. ఉసిరికాయను నూరి శివలింగంగా చేసి పూజిస్తే ముక్తి లభిస్తుంది.
11. వెన్నను కాని, చెట్టు ఆకులను నూరి శివలింగం చేసి రుద్రాభిషేకం చేస్తే స్త్రీకి సౌభాగ్యం కలుగుతుంది.
12. గరికను శివలింగాకారంలో పెట్టి పూజిస్తే అకాల మృత్యుభయం నివారణ కలుగుతుంది.
13. కర్పూరంతో చేసిన శివలింగం పూజ భక్తిని, ముక్తిని ప్రసాదిస్తుంది.
14. ఇనుముతో చేసిన శివలింగం పూజ సిద్ధిప్రదం.
15. ముత్యంతో చేసిన శివలింగం పూజ స్త్రీ భాగ్య హేతువు.
16. స్వర్ణ నిర్మిత శివలింగార్చన సమృద్ధికరం.
17. రజత నిర్మిత శివలింగార్చన ధనధాన్య వృద్ధికరం.
18. ఇత్తడితో చేసిన శివలింగం దారిద్ర్య నాశనకరం.
19. లహసునియా (బంగారపు రంగు రత్నం) శివలింగం అర్చిస్తే శత్రునాశనం విజయం లభిస్తుంది.
20. స్ఫటిక లింగార్చన మానవునికి అభీష్టసిద్ధి కలిగిస్తుంది.
21. పాదరస శివలింగ పూజ సర్వకామప్రదం, మోక్షప్రదం శివస్వరూప ప్రాప్తిని కలిగిస్తుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
టాపిక్