Krishnashtami 2024: జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడికి 56 రకాల నైవేద్యాలు ఎందుకు సమర్పిస్తారో తెలుసా?
Krishnashtami 2024: ఈ ఏడాది ఆగస్ట్ 26ణ కృష్ణాష్టమి పండుగ జరుపుకోనున్నారు. జన్మాష్టమి రోజు చాలా మంది కృష్ణుడికి ఛప్పన్ భోగ్ సమర్పిస్తారు. అంటే 56 రకాల నైవేద్యాలు పెడతారు. ఇలా ఎందుకు పెడతారు? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణం ఏంటో తెలుసుకుందాం.
Krishnashtami 2024: హిందూ మతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఆ రోజు ప్రతి ఒక్కరూ తమ ఇంటికి కన్నయ్యని ఆహ్వానిస్తూ చిన్ని కన్నయ్య పాదాలు వేస్తారు. ఇంట్లోని పిల్లలను అందంగా కన్నయ్య మాదిరిగా రెడీ చేసి మురిసిపోతారు.
శ్రీమహా విష్ణువు ఎనిమిదో అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించారని చెబుతారు. కృష్ణాష్టమిని గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. దేవకి వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా శ్రావణమాసం కృష్ణ పక్షం అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు. ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగస్ట్ 26వ తేదీన జరుపుకోనున్నారు. ఈ రోజున ప్రజలు శ్రీకృష్ణుడిగా భావించే సాలిగ్రామం లేదా లడ్డూ గోపాల్ రూపంలో పూజిస్తారు. కొందరు ఉపవాసాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే జన్మాష్టమి నాడు కొందరు ఛప్పన్ భోగ్ ని కృష్ణుడికి సమర్పిస్తారు. అంటే ఇందులో 56 రకాల వంటకాలు ఉంటాయి. వీటిని కృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఛప్పన్ భోగ్ అంటే ఏంటి?
ఛప్పన్ భోగ్ అంటే ఇందులో 56 రకాల వంటకాలు ఉంటాయి. మఖన్ మిశ్రీ, ఖీర్, రసగుల్లా, జీరా లడ్డు, జిలేబి, రబ్డీ, మాల్పువా, మోహన్ భోగ్, మూంగ్ దాల్ హల్వా, ఘేవర్ వంటివి 56 రకాలు ఉంటాయి. అయితే కృష్ణుడికి జన్మాష్టమి రోజు 56 వంటకాలు ఎందుకు అందిస్తారు అనే విషయం చాలామందికి తెలియదు. ఈ వంటకాలు అందించడం వెనక రెండు కథలోకి ప్రాచుర్యంలో ఉన్నాయి.
గోపికల కోసం
మొదటి కథ గోపికలు శ్రీకృష్ణుడికి సంబంధించినది. యమునా నదిలో ఒక నెలపాటు నిరంతరాయంగా స్నానం ఆచరించి శ్రీకృష్ణుడిని భర్తగా పొందాలని గోపికలు కాత్యాయని మాతను పూజించారు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడు గోపికలందరికి వారి కోరికలను తీరుస్తానని హామీ ఇచ్చాడు. దీంతో సంతోషించిన గోపికలు కృష్ణుడి కోసం 56 రకాల వంటకాలు సిద్ధం చేసి పెట్టారని చెబుతారు.
గోవర్థన గిరి ఎత్తాడని
శ్రీకృష్ణుడికి ఛప్పన్ భోగ్ పె ట్టడం వెనక మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. కృష్ణుడికి తల్లి యశోద రోజుకి ఎనిమిది సార్లు ఆహారం పెడుతుందని నమ్ముతారు. అయితే శ్రీకృష్ణుడు గోవర్ధన పూజ నిర్వహించినప్పుడు దేవతల రాజు ఇంద్రుడు బ్రిజ్ ప్రజలపై కోపంతో ఊగిపోయాడు. గోవర్థన పూజ చేస్తున్నందుకు వారిని శిక్షించాలని అనుకున్నాడు.
ఆ సమయంలో భారీ వర్షాలు కురిపించి ఇంద్రుడు ప్రకృతి విలయం సృష్టించాడు. బ్రిజ్ ప్రజలు క్షమించమని వేడుకుంటేనే వాటి నుంచి విముక్తి కలిగించాలని అనుకుంటాడు. కానీ కృష్ణుడు మాత్రం బ్రిజ్ ప్రజలను కాపాడేందుకు గోవర్థన గిరి పర్వతాన్ని తన చిటికెన వేలితో ఎత్తాడు. ప్రతి ఒక్కరూ ఆ పర్వతం కింద ఆశ్రయం పొందారు. అలా ఇంద్రుడు ఏడు రోజులు పాటు వర్ష బీభత్సం సృష్టించాడు.
ఈ ఏడు రోజులు కృష్ణుడు ఏమీ తినకుండా, తాగకుండా పర్వతాన్ని పట్టుకున్నాడని చెబుతారు. అనంతరం శ్రీకృష్ణుడు భగవంతుడని తెలుసుకున్న ఇంద్రుడు తన తప్పును గ్రహించి క్షమించమని కోరుతాడు. ఏడవ రోజు వర్షం ఆగినప్పుడు తల్లి యశోద బ్రిజ్ ప్రజలతో కలిసి కృష్ణుడు కోసం 56 వంటలను సిద్ధం చేసింది. ఏడు రోజులలో రోజుకి 8 సార్లు చొప్పున లెక్కించి 56 రకాల వంటలు చేశారు. అప్పటి నుంచి శ్రీకృష్ణుడి పూజ సమయంలో ఛప్పన్ భోగ్ సమర్పించే సంప్రదాయం కొనసాగుతోంది.