Prana pratishta: ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి? హిందూ శాస్త్రంలో ప్రాణ ప్రతిష్ఠ ప్రాముఖ్యత ఎందుకు?
Prana pratishta: అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. అసలు ప్రాణ ప్రతిష్ఠ ఎందుకు చేస్తారు? దీనికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఉంటుంది.
Prana pratishta: యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న మధుర క్షణాలు అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసమే. ఎన్నో ఏళ్ల కల జనవరి 22న నెరవేరనుంది. అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది. రామ్ లల్లా విగ్రహం ప్రతిష్టాపన జరగనుంది. అసలు ఈ ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి? ఎందుకు నిర్వహిస్తారు? అనేది తెలుసుకుందాం.
ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి?
వేద మంత్రోచ్చారణ మధ్య రామ్ లల్లా విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. సనాతన ధర్మంలో ప్రాణ ప్రతిష్ఠకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రాణ అంటే ప్రాణ శక్తి, ప్రతిష్ఠ అంటే స్థాపన అని అర్థం. అప్పటి వరకు ఆ విగ్రహానికి ప్రాణం ఉండదు. కేవలం విగ్రహం మాదిరిగానే పరిగణిస్తారు. ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందో అప్పటి నుంచి విగ్రహంలోకి దైవం వచ్చి చేరుతుంది.
హిందూ మతంలో ప్రాణ ప్రతిష్ఠ అనేది పవిత్రమైన వేడుక. ఆలయంలో ఏర్పాటు చేసే విగ్రహంలోకి దేవతని ఆహ్వానించడం. కొత్తగా ఆలయం నిర్మించినప్పుడు లేదా కొత్తగా విగ్రహాన్ని పెడుతున్నప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. విగ్రహం పాడైపోయినా లేదా ఆలయం పునర్నిర్మిస్తున్నా ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఇందుకు సరైన ముహూర్తం, సమయం చూసుకోవాలి.
ప్రాణ ప్రతిష్ఠ ప్రాముఖ్యత
ప్రాణ ప్రతిష్ఠకి ముందు ఆ విగ్రహాన్ని పూజకి ఉపయోగించరు. ప్రాణ ప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోకి ప్రాణశక్తిని ప్రవేశపెడతారు. భక్తులు విగ్రహాన్ని కేవలం విగ్రహంగా కాకుండా దేవుళ్ళ సజీవ స్వరూపంగా భావిస్తారు. ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత మాత్రమే ఆ విగ్రహం పూజ చేసేందుకు అర్హత సాధిస్తుంది. ఇలా చేసిన తర్వాత దేవుడి విగ్రహంలోకి కొలువై ఉంటాడు.
ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో శిక్షణ పొందిన పూజారులతో ఆచారాలు నిర్వహిస్తారు. విగ్రహాన్ని ప్రతిష్టించే ముందుగా పవిత్ర గంగాజలంతో శుద్ది చేస్తారు. ఆలయ ప్రాంగణం కూడా శుద్ది చేస్తారు. పూలు, పండ్లు, పాలు వంటి వివిధ నైవేద్యాలు దేవుడికి సమర్పించడం భక్తికి చిహ్నంగా భావిస్తారు. మంత్రాలు పఠిస్తూ పూజ చేస్తారు.
ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తం ప్రాముఖ్యత
జనవరి 22వ తేదీన రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు ఎంపిక చేశారు. ఈరోజు జ్యోతిష్య పరంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ద్వాదశ తిథిలో ప్రాణ ప్రతిష్ఠ జరగడం అనేది చాలా మంచి విషయమని నిపుణులు చెప్తున్నారు. ఈరోజు విష్ణువుతో ముడిపడి ఉంటుంది. ఈ ప్రత్యేకమైన రోజున ఆలయాన్ని ప్రారంభించడం వల్ల విష్ణువు ఉనికి ఉంటుందని నమ్ముతారు. శ్రీరాముడు విష్ణు మూర్తి ఏడో రూపంగా చెప్తారు. అందుకే ఈ తేదీ వేడుకకి అధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది.
శంకరాచార్యులు ఎందుకు హాజరు కావడం లేదంటే..
జనవరి 22వ తేదీన అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి నలుగురు శంకరాచార్యులలో ఇద్దరు హాజరు కావడం లేదు. మిగిలిన ఇద్దరు ఆహ్వానాన్ని బహిరంగంగా అంగీకరించలేదు అలా అని తిరస్కరించలేదు. ఆలయాన్ని పూర్తిగా నిర్మించకముందే ప్రాణ ప్రతిష్ఠ చేయడం శాస్త్రాలకి విరుద్దం. అందుకే శంకరాచార్యులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని చెప్పారు. అందుకే ఈ చర్యని తను వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడించారు.