Ayudha pooja: ఆయుధ పూజ చేసేందుకు శుభ సమయం ఎప్పుడు? పనిముట్లను ఎందుకు పూజిస్తారు?-today october 11th maha navami ayudha pooja shubha muhurtham and significance ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ayudha Pooja: ఆయుధ పూజ చేసేందుకు శుభ సమయం ఎప్పుడు? పనిముట్లను ఎందుకు పూజిస్తారు?

Ayudha pooja: ఆయుధ పూజ చేసేందుకు శుభ సమయం ఎప్పుడు? పనిముట్లను ఎందుకు పూజిస్తారు?

Gunti Soundarya HT Telugu
Oct 11, 2024 08:31 AM IST

Ayudha pooja: మహానవమి అంటే అక్టోబర్ 11వ తేదీ ఆయుధ పూజ చేస్తారు. ఈరోజు పూజ చేసేందుకు శుభ సమయం ఎప్పుడు ఉంది. ఈ పూజ ఎలా చేయాలి? దీని ప్రాముఖ్యత ఏంటి? ఆయుధ పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం.

ఆయుధ పూజకు శుభ సమయం
ఆయుధ పూజకు శుభ సమయం (pixabay)

దేవి శరన్నవరాత్రులలో తొమ్మిదో రోజు మహా నవమి జరుపుకుంటారు. నవరాత్రులలో చివరి మూడు రోజులు పూజలు చేసేందుకు అత్యంత ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. దక్షిణ భారతీయులు నవమి రోజు ఆయుధ పూజ నిర్వహించుకుంటారు.

ఈ ఏడాది అష్టమి, నవమి తిథులు కొద్ది గంటల తేడాతో ఒకే రోజు వచ్చాయి. దీంతో ఆయుధ పూజ చేసేందుకు సరైన సమయం ఏది అనే దాని మీద గందరగోళం నెలకొంది. ధృక్ పంచాంగం ప్రకారం నవమి తిథి అక్టోబర్ 11 మధ్యాహ్నం 12.06 గంటల నుంచి ప్రారంభమై మరుసటి రోజు అక్టోబర్ 12 ఉదయం 10.58 గంటలకు ముగుస్తుంది. తర్వాత దశమి తిథి ప్రారంభమవుతుంది. ఆయుధ పూజ చేసేందుకు శుభ ముహూర్తం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.17 గంటల వరకు ఉంటుంది.

ఆయుధ పూజ ప్రాముఖ్యత

కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళతో పాటు పలు రాష్ట్రాలు ఆయుధ పూజను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజులు ప్రతి ఒక్కరూ తమ పనిలో ఉపయోగించే పని ముట్లను శుభ్రం చేసుకుని పూజ చేస్తారు. ఆయుధాల వల్ల ఎటువంటి హాని జరగకుండా చూడమని కోరుకుంటూ ఆయుధాలు, పరికరాలను పూజ చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతారు. కొంతమంది తమ పుస్తకాలను కూడా పూజలో పెట్టి పూజిస్తారు.

ఆయుధ పూజ ఎందుకు చేస్తారు?

పురాణాల ప్రకారం ఈ పూజ దుర్గాదేవి మహిషాసుర రాక్షసుడితో యుద్ధం చేసేందుకు దేవతలందరూ తమ ఆయుధాలను అమ్మవారికి ఇచ్చారు. అలా ఎనిమిది చేతుల్లో అమ్మవారు అనేక ఆయుధాలను పట్టుకుని యుద్ధానికి దిగారు. తొమ్మిది రోజుల పాటు సాగిన యుద్ధ పోరాటంలో చివరికి రాక్షసుడిని సంహరించినది. అనంతరం ఆయుధాలను దేవతలు తిరిగి తీసుకుని రాక్షస సంహారం చేసి విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతగా వాటిని పూజించారు. అప్పటి నుంచి ఆయుధ పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఆయుధ పూజ చేయడం వెనుక మరొక కారణం కూడా చెప్తారు. అరణ్య వాసానికి వెళ్లేటప్పుడు పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టులో భద్రపరిచారు. అప్పటి నుంచి జమ్మి చెట్టును పూజించడం మొదలుపెట్టారు. అజ్ఞాత వాసం ముగించుకుని తిరిగి వచ్చేటప్పుడు ఆయుధాలను తీసుకుని పూజ చేసిన తర్వాత కౌరవులతో యుద్ధానికి దిగారు. ఈ యుద్ధంలో పాండవులు విజయం సాధించారు. ఈ సందర్భంలో కూడా విజయానికి చిహ్నంగా ఆయుధాలను పూజించడం చేశారు.

ఆయుధ పూజ ఎలా చేయాలి?

పూజకు ముందు ఇంటిని శుభ్రపరుచుకోవాలి. అనంతరం పనిముట్లు, ఆయుధాలు అన్నింటినీ శుద్ది చేసి పెట్టుకోవాలి. పసుపు, కుంకుమ, చందనం వాటికి రాయాలి. కొందరు ఈ పవిత్రమైన రోజున పుస్తకాలు, వ్యాపారస్తులు తమ పద్దుల పుస్తకాలకు కూడా పూజలు చేస్తారు. అలాగే వాహనాలకు కూడా పూజలు చేస్తారు. తమ పనిముట్లకు బొట్టు పెట్టి పువ్వులు సమర్పించి వేద మంత్రాలతో ఆశీర్వాదం ఇప్పిస్తారు. ఇలా చేయడం వల్ల చేసే ప్రతి పనిలో విజయం చేకూరాలని అలాగే వాటి వల్ల తమకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడమని భక్తులు వేడుకుంటారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

 

Whats_app_banner