Dasara Jammi Chettu: దసరా రోజున జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు? చదవాల్సిన శ్లోకం ఏంటి?-what is the importance of jammi chettu and why we worship on dasara shami vriksha sloka ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Dasara Jammi Chettu: దసరా రోజున జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు? చదవాల్సిన శ్లోకం ఏంటి?

Dasara Jammi Chettu: దసరా రోజున జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు? చదవాల్సిన శ్లోకం ఏంటి?

Anand Sai HT Telugu
Oct 23, 2023 08:41 AM IST

Dasara 2023 : నవరాత్రుల్లో దసరాకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజున జమ్మి చెట్టుకు పూజ చేస్తారు. జమ్మి ఆకులను బంగారంలా పంచుకుంటారు. దీని వెనక ఉన్న కారణాలు ఏంటి?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

దసరా పండగ రోజున శమీ పూజ చేస్తారు. తర్వాతే జమ్మి ఆకులను పంచుకుంటారు. దీని వెనక పురాణ కథలు ఉన్నాయి. శమీ పూజ చేసి.. జమ్మి ఆకులను పెద్దలకు పంచి పెడుతారు. వారి ఆశీర్వాదం తీసుకుంటారు. జమ్మి చెట్టును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. జమ్మి చెట్టును పూజించడం వెనక కొన్ని కారణాలు ఉన్నాయి.

రుగ్వేద కాలం నుంచి జమ్మి వృక్షం ప్రస్తావన ఉంది. జమ్మి చెట్టును శమీ వృక్షం అని కూడా అంటారు. అమృతం కోసం దేవుళ్లు పాల సముద్రాన్ని చిలికే సమయంలో దేవతా వృక్షాలు కూడా వచ్చాయని, అందులో శమీ వృక్షం కూడా ఒకటని చెబుతారు. అప్పట్లో దీన్ని అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారని, అందుకే అరణి అని కూడా అంటారని పండితులు చెబుతున్నారు.

త్రేతా యుగంలో లంకకు వెళ్లే సమయంలో రాముడు శమీ పూజ చేసి వెళ్లాడని కథలు ఉన్నాయి. అందుకే రావణుడి మీద విజయం సాధించాడని అంటారు. ఇక మాహా భారతంలోనూ జమ్మి చెట్టు ప్రస్తావన ఉంది. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు.. తమ ఆయుధాలను ఒక మూటలో కట్టారు. తర్వాత దానిని శమీ వృక్షంపై పెట్టారు. అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకూ ఆయుధాలను కాపాడాలని శమీ వృక్షానికి పూజలు చేశారు. అజ్ఞాతవాసం తర్వాత వచ్చి జమ్మి చెట్టుకు పూజ చేసి.. ఆయుధాలను తీసుకుని.. యుద్ధంలో గెలిచారని చెబుతారు. అప్పటి నుంచి శమీ వృక్షాన్ని పూజిస్తే.. అపజయం ఉండదని నమ్మకం.

దసరా రోజున జమ్మిచెట్టుకు పూజ

విజయ దశమి రోజున విజయాలు కలగాలని శమీ వృక్షానికి పూజ చేస్తారు. శమీ పూజలో ఈ శ్లోకం చదువుకోవాలి.

'శమీ శమయతే పాపం

శమీ శత్రు వినాశినీ.. 

అర్జునస్య ధనుర్దారీ 

రామస్య ప్రియదర్శినీ..' అనే శ్లోకం చదవాలి. 

జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఆ తర్వాత ఆకులను తెంచుకుని వాటిని బంగారంలా భావించి ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత ఒకరికొకరు పంచుకుంటారు. పెద్దలకు ఇచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు.

జమ్మిని పూజిస్తే.. జీవితంలో విజయాలు వస్తాయని అందరూ నమ్ముతారు. జమ్మి చెట్టు చాలా కాలం బతుకుతుంది. ఈ చెట్టు వేళ్లు భూసారాన్ని పెంచుతాయి. జమ్మి చెట్టును నాటు వైద్యంలోనూ ఉపయోగిస్తారు. ఈ చెట్టు గాలి ఆరోగ్యానికి మంచిదని అంటారు. అందుకే శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేయాలని అంటుంటారు.