Saddula bathukamma songs: సద్దుల బతుకమ్మ వేళ వీడ్కోలు పలుకుతూ ఈ పాటలతో ఆడి పాడండి
Saddula bathukamma songs: నేటితో బతుకమ్మ సంబరాలు ముగిసిపోతాయి. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు. బతుకమ్మలు ఒక చోటకు చేర్చి ఆడి పాడతారు. ఈ సమయంలో మీరు పాడుకునేందుకు ఈ సింపుల్ పాటలు నేర్చుకోండి.
అక్టోబర్ 10 సద్దుల బతుకమ్మ జరుపుకుంటున్నారు. ఈరోజు ఆడపడుచులు అందరూ అందంగా ముస్తాబై బతుకమ్మలు తయారు చేసి పూజ చేస్తారు. సాయంత్రం నాటికి వాటిని తల మీద పెట్టుకుని ఒక చోటకు చేరతారు. బతుకమ్మలు అన్నీ గుండ్రంగా పెట్టి వాటి చుట్టూ చేరి జానపద గీతాలు పాడుతూ నృత్యాలు చేస్తారు.
సద్దుల బతుకమ్మ సందర్భంగా అమ్మవారిని గంగమ్మ ఒడికి సాగనంపుతూ ఏం పాట పాడాలో తెలియడం లేదా. సందర్భానికి తగినట్టుగా ఉండే ఈ సద్దుల బతుకమ్మ పాడుతూ మీ ఆనందాన్ని వ్యక్తపరచండి. పోయి రావే బతుకమ్మ అంటూ సంతోషంగా బతుకమ్మను నిమజ్జనం చేయండి.
హిమవంతునింట పుట్టి ఉయ్యాలో
హిమవంతునింట్ల పుట్టి ఉయ్యాలో
హిమంతునింట్ల పెరిగి ఉయ్యాలో
విదియ పోయి తదియ నాడు ఉయ్యాలో
కాంతలంతా కూడి ఉయ్యాలో
గన్నేరు కొమ్మ తెచ్చి ఉయ్యాలో
గౌరి పూజలు చేసి ఉయ్యాలో
వత్తి పొత్తులు పెట్టి ఉయ్యాలో
ఒడిబియ్యం పోసి ఉయ్యాలో
ఒప్పైన సద్ది కట్టి ఉయ్యాలో
శంభునికి అప్పగించి ఉయ్యాలో
మాయమ్మ గౌరి దేవి ఉయ్యాలో
పోయీ రావమ్మా ఉయ్యాలో
అత్తవాడల్లకు ఉయ్యాలో
పోయీ రావమ్మా ఉయ్యాలో
చీరెలు కొదవనమ్మా ఉయ్యాలో
సారెలు కొదవనమ్మ ఉయ్యాలో
ఆరు నెలలున్నాది ఉయ్యాలో
సంక్రాంతి పండుగ ఉయ్యాలో
పండుగ నాటికి ఉయ్యాలో
నిను తొలుకొస్తమ్మా ఉయ్యాలో
కూర్చుండ పీటెస్త ఉయ్యాలో
కుదుర్ల దొంతులేస్తా ఉయ్యాలో
ఆదేటి దొంతులేస్తా ఉయ్యాలో
అపరంజి మెట్లేస్తా ఉయ్యాలో
మల్లెమొగ్గ చీరెలిస్తా ఉయ్యాలో
అద్దాల రవికలిస్తా ఉయ్యాలో
నీకు దగ్గ సొమ్ములిస్తా ఉయ్యాలో
గంధం గిన్నెలిస్తా ఉయ్యాలో
నీలాల కమ్మలిస్తా ఉయ్యాలో
నిలువుటద్ధమిస్తా ఉయ్యాలో
ఎక్కే అందలాలిస్తా ఉయ్యాలో
పట్టపుటేనుగు లిస్తా ఉయ్యాలో
పది నూర్ల రూకలిస్తా ఉయ్యాలో
పంచ కల్యాణి నిస్తా ఉయ్యాలో
మాయమ్మ గౌరమ్మ ఉయ్యాలో
పోయిరా గౌరమ్మా ఉయ్యాలో
పోయిరా గౌరమ్మా ఉయ్యాలో
మళ్ళీ రా గౌరమ్మా ఉయ్యాలో
గుంపు గుంపు గునుగుల్లా నేరియాలో
గుంపు గుంపు గునుగుల్లా నేరియాలో
గుంపు గునుగు పూల నేరియాలో
తెంపరాదే నాయన్న నేరియాలో
గుల్లల్ల నింపరాదే నేరియాలో
పచ్చపచ్చ తంగేళ్ల నేరియాలో
పచ్చ తంగేడి పూల నేరియాలో
తెంపరాదు నాయన్న నేరియాలో
గంపల్ల కెత్తరాదే నేరియాలో
అడవిలున్న చెట్ల పూల నేరియాలో
తీగవారే కట్లపూలు నేరియాలో
తెంపరాదే నాయన్న నేరియాలో
మొంటెల్ల నింపరాదే నేరియాలో
మాయింటి వదినలు నేరియాలో
పువ్వులన్నీ ఏరినారు నేరియాలో
సక్కాని పువ్వులన్నీ నేరియాలో
సాపలల్ల పోసినారె నేరియాలో
తీరోక్క రంగులద్ది నేరియాలో
తీరితీరి పువ్వులాయే నేరియాలో
నూటొక్క వరుసల్లో నేరియాలో
పేర్చినారు బతుకమ్మ నేరియాలో
రవ్వాల గాజులేసి నేరియాలో
చెక్కుడు బిల్లలు పెట్టి నేరియాలో
చుక్కబొట్టు పెట్టుకొని నేరియాలో
దిద్దినారు కాటుక నేరియాలో
సిద్ధిపేట చీరల్లో నేరియాలో
సిరిసిల్లా రవికాలు నేరియాలో
ముక్కూకు ముక్కెరమ్మ నేరియాలో
ముత్యాల దండలమ్మ నేరియాలో
బతుకమ్మలెత్తుకొని నేరియాలో
బజారులన్నీ కదిలే నేరియాలో
ఆడినారు బతుకమ్మ నేరియాలో
ఆడపిల్లలంతా కూడి నేరియాలో
మలీద ముద్దాలు నేరియాలో
మంచి శనిగెలు పులిహోర నేరియాలో
తీరోక్క వంటలతో నేరియాలో
బతుకమ్మ సద్దులు నేరియాలో
మావూరి బతుకమ్మ నేరియాలో
మళ్ళీ మళ్ళీ రావే బతుకమ్మ నేరియాలో
ఎల్లి రావే బతుకమ్మ నేరియాలో
తల్లి సిరులనిచ్చే బతుకమ్మ నేరియాలో