Saddula bathukamma 2024: సద్దుల బతుకమ్మ అంటే ఏంటి? ఈరోజు సమర్పించే ఐదు రకాల నైవేద్యాలు ఏంటి?-saddula bathukamma 2024 date and significance naivedyam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saddula Bathukamma 2024: సద్దుల బతుకమ్మ అంటే ఏంటి? ఈరోజు సమర్పించే ఐదు రకాల నైవేద్యాలు ఏంటి?

Saddula bathukamma 2024: సద్దుల బతుకమ్మ అంటే ఏంటి? ఈరోజు సమర్పించే ఐదు రకాల నైవేద్యాలు ఏంటి?

Gunti Soundarya HT Telugu
Oct 09, 2024 07:09 PM IST

Saddula bathukamma 2024: తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మలో చివరి రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 10న వచ్చింది. సద్దుల బతుకమ్మ విశిష్టత ఏంటి? ఈరోజు అమ్మవారికి సమర్పించే ఐదు రకాల నైవేద్యాలు ఏంటో తెలుసుకుందాం.

సద్దుల బతుకమ్మ అంటే ఏంటి?
సద్దుల బతుకమ్మ అంటే ఏంటి? (pinterest)

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ. ఈ ఏడాది అక్టోబర్ 2న ఎంగిలి పూల బతుకమ్మతో సంబరాలు ప్రారంభమయ్యాయి. దుర్గాష్టమి రోజు అంటే అక్టోబర్ 10న సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలు ముగుస్తాయి.

సద్దుల బతుకమ్మ విశిష్టత

సద్దుల బతుకమ్మ అన్నింటి కంటే చాలా విభిన్నంగా ఉంటుంది. ఎనిమిది రోజులతో పోలిస్తే తొమ్మిదో రోజు పేర్చే బతుకమ్మ చాలా పెద్దదిగా ఉంటుంది. ఇదే రోజు దుర్గాష్టమి పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది అష్టమి, నవమి ఒకే రోజు వచ్చాయి. సద్దుల బతుకమ్మ రోజు ఎన్ని రకాల పూలు దొరికితే అన్ని రకాల పూలు అమర్చుకుంటూ ఎత్తైన బతుకమ్మ తయారు చేస్తారు. అలాగే పెద్ద బతుకమ్మతో పాటు చిన్న బతుకమ్మ కూడా పెట్టుకుంటారు. పసుపుతో గౌరీ దేవిని చేసి పూజిస్తారు. అమ్మవారిని పూజించిన తర్వాత పసుపు తీసుకుని మహిళలు ఒకరికొకరు రాసుకుంటారు.

తొమ్మిదో రోజు సాగే సద్దుల బతుకమ్మ చూసేందుకు ఊరు వాడ అంతా ఒక చోటుకు చేరతారు. మహిళలు అందరూ ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ప్రకృతిలో దొరికే పూలు అన్నింటినీ తెచ్చుకుంటారు. తాంబూలం పళ్ళెం తీసుకుని అందులో అన్ని రంగుల పూలను వరుసలుగా పేర్చుకుంటూ ఉంటారు. కొందరు వలయాకారంలో పెడితే మరికొందరు గోపురం, స్తూపం ఆకారంలో అమర్చుకుంటారు. గునుగు పూలకు రంగులు అద్ది వాటిని ఉపయోగిస్తారు.

ఐదు రకాల నైవేద్యాలు

ఒక్కొక్క వరుస పూలు పెట్టుకుంటూ మధ్యలో ఆకులు వేస్తూ బతుకమ్మను తయారు చేస్తారు. తర్వాత దాన్ని పూజ గదిలో పెట్టి ధూప, దీపాలతో పూజ చేస్తారు. సద్దుల బతుకమ్మ రోజు ఐదు రకాల నైవేద్యాలు పెడతారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, నిమ్మకాయ అన్నం నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు. దీనితో పాటు చక్కెర, రొట్టె కలిపి చేసిన లడ్డూలు కూడా చేస్తారు.

ఇక సాయంత్రం వేళ అయితే ఏ వీధి చూసినా బతుకమ్మలు కనిపిస్తూ కనువిందు చేస్తాయి. ప్రతి ఒక్కరూ తాము తయారు చేసిన బతుకమ్మలు తీసుకొచ్చి అన్ని ఒక చోట పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుకుంటూ నృత్యాలు చేస్తారు. తొమ్మిది వరుసలుగా చేసే బతుకమ్మ చూసేందుకు ఎంతో ముద్దుగా ఉంటుంది. బతుకమ్మలతో పాటు ఆడవాళ్ళు కూడా తామేమి తక్కువ కాదంటూ పట్టు చీరలు కట్టి, ఆభరణాలు ధరించి మిలమిలా మెరిసిపోతారు.

ఆడవాళ్ళు తలల మీద బతుకమ్మలు పెట్టుకుని ఊరి మధ్యలోకి లేదా చెరువు సమీపంలోకి తీసుకొచ్చి పెడతారు. వాటి చుట్టూ చేరి ఆడిపాడతారు. చీకటి పడే వరకు అందరూ ఆనందంగా గడుపుతారు. అనంతరం పోయి రావే బతుకమ్మ అంటూ వెంట తీసుకొచ్చిన బతుకమ్మను గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేస్తారు. తర్వాత వెంట తెచ్చుకున్న లడ్డూ నైవేద్యాలను ఒకరికొకరు పంచుకుంటారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి. ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అంటూ ఒకరికొకరు ఇచ్చుకుంటారు. దీంతో బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి.

Whats_app_banner